కోటగిరి(బాన్సువాడ) : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్‌పూర్ గ్రామానికి చెందిన కూలీ షేక్ బషీర్(45) చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండాయి. ఈ నేపథ్యంలో షేక్‌బషీర్ మంగళవారం ఉద యం తన ఇంటి నుంచి కొందరు స్నేహితులతో కలిసి గ్రామ చెరువు సమీపంలోని వాగు వద్దకు వెళ్ళాడు. గ్రామ చెరువు అలుగు పారుతుండడంతో చెరువులోని చేపలు వాగులోకి కొట్టుకు రావడంతో గమనించిన షేక్‌బషీర్ కర్ర సహాయంతో చేపలను కొట్టాడు.
చేప కిందపడడంతో దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అదుపుతప్పి వాగులో పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు గమనించి గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సులోచన, జెడ్పీటీసీ పుప్పాల శంకర్, తహసీల్దార్ విఠల్, ఆర్‌ఐ కృష్ణదత్తు, అడీషనల్ ఆర్‌ఐ నజీర్, ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. హంగర్గకు చెందిన మక్కయ్య అనే యువకుడు వాగులోకి వెళ్ళి గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాడు. మక్కయ్య ప్రతిభను పలువురు అభినందించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
గ్రామంలో విషాదఛాయలు
షేక్‌బషీర్ వాగులో పడి మృతి చెందాడనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదానికి గురయ్యారు. ప్రతిరోజు అందరితో కలుపు గొలుపుగా ఉండేవాడని క్షణాల్లో కళ్ళముందర ఉన్న వ్యక్తి మృతి చెందాడనే వార్త పలువురు జీర్ణించుకోలేక పోయారు. అక్కడికి చేరిన ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యం చెప్పారు. మృతదేహం ఒడ్డుకు చేర్చే వరకు అక్కడే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment