బాల్కొండ: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం రెంజర్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన అక్షయ్(19) ఇంటర్మీడియట్ మధ్యలో నిలిపి వేసి ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తల్లి సుజాత పోలీసులకు సమాచారం అందించింది. ఉరికి గల కారణాలు తెలియలేదు.
మృతుడి తండ్రి మర్రెన్న 15 ఏళ్ల క్రితమే హత్యకు గురయ్యాడు. దీంతో తల్లి సుజాత అక్షయ్‌ని అల్లారుముద్దుగా పెంచింది. కన్న కొడుకు, కట్టుకున్న భర్త ఇద్దరూ చనిపోవడంతో సుజాత కన్నీరుమున్నీరైంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి మృతికి గత కారణాలపై ఆరా తీస్తున్నారు.