సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్సై చికిత్స పొందుతున్న అశోక్
సాక్షి, గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని జంగపల్లిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జక్కనపెల్లి ఆంజనేయులు, భారతి దంపతుల కుమారుడు అశోక్ హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం రాంహనుమాన్ నగర్‌కు చెందిన అతని తాత లింగయ్య(తల్లికి తండ్రి) ఇటీవల మృతి చెందాడు. గురువారం దినకర్మ ఉండటంతో అశోక్ బుధవారం రాత్రి గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి గురువారం ఉదయం రాంహనుమాన్ నగర్ వెళ్లాడు. మధ్యాహ్నం తండ్రితో కలిసి ఇంటికి చేరుకున్నాడు.
అశోక్ వంటింట్లో నిద్రిస్తుండగా, తండ్రి ఆంజనేయులు, నానమ్మ రాజవ్వ గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న మరో ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ ఉన్న ఇంట్లోకి గ్రామానికే చెందిన వెల్దిండి రవీందర్ ప్రవేశించాడు. అశోక్ ముఖంపై కారం చల్లి, గొడ్డలితో దాడి చేశాడు. బాధితుడు కేకలు వేయడంతో పారిపోయాడు. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి ఒంటిపై ఉన్న గాయాలను చూసి, అశోక్ తండ్రి బోరున విలపించారు. బాధితుడిని కరీంనగర్ ఆస్పపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తేల్చారు. వారి సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. నిందితుడు గొడ్డలిని బాధితుడి ఇంట్లో బీరువా కింద దాచాడు. అనంతరం పోలీస్‌స్టేషన్ లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై మామిడాల సురేందర్‌లు పరిశీలించారు. గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు మద్యానికి బానిస
నిందితుడు రవీందర్ కొన్నేళ్ల కిందట దుబాయి వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడని చెప్పారు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కనిపించినవారిని డబ్బులు డిమాండ్ చేస్తుంటాడని అన్నారు. కానీ అశోక్‌తో అతనికి పరిచయం లేదని, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు తేవని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. మద్యం, గంజాయి మత్తుకు మానిసై సైకోగా మారి, దాడి చేసి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment