మూడు రోజుల రెక్కీ.. వెంటాడి.. వేటాడి.. | Young man Murder in Manakondur | Sakshi
Sakshi News home page

మూడు రోజుల రెక్కీ.. వెంటాడి.. వేటాడి..

Published Wed, May 29 2024 7:27 AM | Last Updated on Wed, May 29 2024 8:04 AM

మూడు రోజుల పాటు రెక్కీ

పక్కా సమాచారంతో దాడి

తప్పించుకునే యత్నంలో బావిలో పడ్డ యువకుడు

బయటికి తీసి చిత్రహింసలు పెట్టి ఘాతుకం!

12 గంటల గాలింపు తర్వాత మానేరులో దొరికిన మృతదేహం

మృతుడిది మానకొండూర్‌ మండలం పచ్చునూరు

మానకొండూర్‌: ఓ యువకుడిని చంపేందుకు మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. విషయం తెలిసి సదరు యువకుడు ప్రాణాలు కాపాడుకునేందుకు పొరుగూరిలో దాక్కున్నాడు. పసిగట్టిన ప్రత్యర్థులు వెంబడించారు. తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డాడు. అయినా వదలని ఆ దండగులు ఆ యువకుడిని బావి నుంచి బయటకు తీసి తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. చివరకు సదరు యువకుడు పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి– కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం వెల్ది గ్రామాల మధ్యలోని మానేరు వాగులో శవమై కనిపించాడు. స్థానికుల కథనం ప్రకారం.. మానకొండూర్‌ మండలం పచ్చునూరుకు చెందిన గోపు ప్రశాంత్‌ రెడ్డి(23) మంగళవారం ఉదయం కిడ్నాప్‌నకు గురై సాయంత్రం శవమై కనిపించడంతో గ్రామం ఉలిక్కిపడింది.

 గ్రామానికి చెందిన గోపు రమ, రఘునాథరెడ్డికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్యాంసుందర్‌ వరంగల్‌లో ఉంటున్నాడు. చిన్న కొడుకు ప్రశాంత్‌రెడ్డి (23) ఇంటర్‌ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. పదేళ్లక్రితం తల్లి రమ, ఆరేళ్ల క్రితం తండ్రి రఘునాథరెడ్డి అనారోగ్యంతో చని పోయారు. ఒంటరిగానే ఇంటివద్ద ఉంటున్న ప్రశాంత్‌రెడ్డిపై పోలీసు కేసులు ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ప్రశాంత్‌రెడ్డికి స్థానికంగా ఉండే రమేశ్‌ ఉరఫ్‌ జానీతో ఓ భూమి సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో ‘నిన్ను చంపుతా.. అంటే నిన్నే చంపుతా’ అంటూ  తరచూ ఒకరినొకరు చాలెంజ్‌ చేసుకుంటున్నారు.

ఎక్కడ ప్రశాంత్‌రెడ్డి తనను చంపుతాడోననే భయంతో రమేశ్‌ తన ఫ్రెండ్‌ గాజు శంకర్, మరికొందరి సహకారంతో ప్రశాంత్‌ను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. మూడు రోజులుగా ఆయ న ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు స మాచారం. ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టిన ప్రశాంత్‌ అప్రమత్తమయ్యాడు. తనకు సాయం చేయాలని గ్రామంలో పలువురిని కోరాడు. సోమవారం సాయంత్రం ఊటూరులోని ఓ మిత్రుడి వద్దకు వెళ్లాడు. తనకు రూ.500 ఇచ్చి ఈ రాత్రికి ఆశ్రయం కల్పిస్తే ఉదయాన్నే జమ్మికుంట వెళ్లి, అక్కడి నుంచి హన్మకొండలోని తన సోదరుడి వద్దకు వెళ్తానని తెలిపాడు.

బావిలో పడ్డా.. రాళ్లతో కొట్టి..బయటకు తీసి..  
సోమవారం రాత్రి రమేశ్‌ ఆయన అనుచరులు పచ్చునూరులో ప్రశాంత్‌రెడ్డి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఊటూరు వెళ్లాడని తెలుసుకుని మంగళవారం వేకువజామున ఐదుగంటల ప్రాంతంలో ఆ గ్రామానికి వెళ్లారు. శివారులోని ఓ శివాలయం వద్ద ఓ హనుమాన్‌ మాలధారుడితో ప్రశాంత్‌రెడ్డి గురించి వాకబు చేశారు. సదరు భక్తుడి సెల్‌ఫోన్‌ తీసుకుని ప్రశాంత్‌రెడ్డి నంబరుకు ఫోన్‌ చేశారు. సమీపంలోనే ఫోన్‌ రింగ్‌ శబ్ధం రావడంతో అతడిని వెంబడించారు. గమనించిన ప్రశాంత్‌రెడ్డి తప్పించుకునే క్రమంలో సమీపంలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడ్డాడు. అయినా వదలని దుండగులు రాళ్లతో దాడిచేశారు. తీవ్రగాయాలైనా.. వదలకుండా తాడుసాయంతో బావిలోంచి బయటకు తీసి ఉదయం 6 గంటల ప్రాంతంలో జీప్‌లో ఎక్కించుకొని గ్రామం నుంచి తీసుకెళ్లారు.

ఆ 12 గంటలు..
కిడ్నాప్‌ గురించి పోలీసులకు సమాచారం అందడంతో ఉదయం 6గంటలకు కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ వెంకటరమణ, మానకొండూర్‌ సీఐ మాదాసు రాజ్‌కుమార్‌ హుటా హుటిన ఊటూరు గ్రామానికి చేరుకుని ప్రశాంత్‌రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 12 గంటల పాటు పలు గ్రామా ల్లో సీసీ ఫుటేజీలు  పరిశీలించారు. వాటి ఆధారంగా వేగురుపల్లి శివారులోని మానేరువాగుకు జీపులో వెళ్లినట్లు గుర్తించారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి– మా నకొండూ ర్‌ మండలం వెల్ది మధ్యలో ఉన్న మానేరు వాగులో ప్రశాంత్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. ప్రశాంత్‌రెడ్డిని హత్య చేసింది రమేశ్‌ అనే వ్యక్తిగా సమాచారం. 

కాగా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రశాంత్‌ ను దారుణంగా హింసించి, పైశాచికంగా చంపినట్లు అతని మృతదేహాన్ని బట్టి తెలు స్తోంది. హత్యకు ఆధిపత్య పోరా? పాత కక్షలు కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులో ఇలా పైశాచికంగా ప్రవర్తించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. గతేడాది ఏప్రిల్‌లోనూ గంజాయి తాగి వచ్చిన కొందరు మానకొండూరులో తుపాకీతో కాల్పులు జరిపేందుకు యత్నించారు. ఆ ఘటనతో పోలికలుండడం బలాన్ని చేకూరు స్తున్నాయి. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజ్‌కుమార్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement