సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే ఆయన తమను ఉద్దేశించి అంత చులకనగా మాట్లాడటం, నిరాధార ఆరోపణలు చేయడంపట్ల మహిళా పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంపిక పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన తమను నామినేటెడ్ ఉద్యోగులని చంద్రబాబు హేళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
విజయవాడలో మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశాక చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. అందులోనూ మహిళా పోలీసులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలన్నారు. అంతేకాకుండా వీరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వో)లుగా వీరు పనిచేస్తున్నారని.. వీరిని తొలగించాలన్నారు. నామినేటెడ్ ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
వారికి ఏం అవగాహన ఉంది.. ఎన్నికల విధులు, ఓటర్ల నమోదు గురించి ఏం తెలుసన్నారు. అంతటితో చంద్రబాబు సరిపెట్టలేదు. మహిళా పోలీసుల వ్యకి్తత్వం గురించి కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్ష ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు పొందిన తమను ఆయన అవమానించారని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు.
తాము విధుల్లో చేరాక రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉన్నామని.. ఈ కాలంలో ప్రతిభ చూపినందుకు ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే, ప్రభుత్వ నిబంధనల మేరకే తాము కూడా నియమితులయ్యామనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని వారంటున్నారు. అటువంటి తమను నామినేటెడ్ ఉద్యోగులని హేళన చేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు.
ఎన్నికల విధులకు మేమెందుకు అర్హులం కాదు?
ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఎన్నికల విధులు నిర్వహించేందుకు అర్హులు అయినప్పుడు తామెందుకు కామని మహిళా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ తమను ద్వితీయశ్రేణి ఉద్యోగులుగా వివక్షాపూరితంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని గతంలోనే చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీడీపీ వ్యవహార శైలి అదే తీరులో ఉండటం గమనార్హం.
తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని పునరుద్ఘాటించాయి. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తొలగించడంతోపాటు తమను తీవ్ర అవస్థల పాలు చేస్తారని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కించపరిచిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చంద్రబాబు నిరాధారణ ఆరోపణలు చేయడంపై మహిళా పోలీసులు మండిపడుతున్నారు. మహిళలు అంటే చంద్రబాబుకు ఎంతటి చిన్నచూపో.. ఎంతటి చులకన భావముందో మరోసారి ఈ వ్యాఖ్యల ద్వారా నిరూపించారని రాష్ట్ర మహిళా పోలీసుల సంఘం మండిపడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రధానంగా మహిళా పోలీసుల పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment