అవగాహనే అస్త్రం.. వినియోగదారుడా మేలుకో.. | World Consumer Rights Day 2022 Special Story Visakhapatnam District | Sakshi
Sakshi News home page

అవగాహనే అస్త్రం.. వినియోగదారుడా మేలుకో..

Published Tue, Mar 15 2022 6:32 PM | Last Updated on Tue, Mar 15 2022 6:32 PM

World Consumer Rights Day 2022 Special Story Visakhapatnam District - Sakshi

కొనే ప్రతి వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోయాయి. చివరికి మనం తాగే పాళ్లు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండా పోతుంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం చాలా ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు అవగాహన కల్పిచడంతో పాటు వారి హక్కులు, ఏర్పాటైన పరిరక్షణ చట్టం, ఫిర్యాదు ఏ విధంగా చేయాలనే వివరాలపై ప్రత్యేక కథనం. –తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర)

వినియోగదారులెవరు..?  
వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే. ఈ నిర్వచనం ప్రకారం అందరూ ఏదో ఒక రకంగా వినియోగదారులమే.  

చట్టంలో ఏముంది...? 
భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణకు ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తెచ్చింది. అదే వినియోగదారులు హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ‘రీడ్రసల్‌ ఫోరమ్స్‌’ను ప్రతి జిల్లా కేంద్రంలోను ఏర్పాటు చేశారు. ఇవి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఫోరమ్స్‌గా మూడు విభాగాలుగా విభజించారు.

వినియోగదారుల హక్కులు... భద్రత హక్కు  
కొనే వస్తువులు, పొందే సేవలు వినియోగదారులు తక్షణ అవసరాలు తీర్చడమే కాకుండా అవి సుదీర్ఘ కాలం మన్నేలా ఉండాలి. అవి వినియోగదారుల జీవితాలకు, ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. ఈ భద్రత పొందటానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఐఎస్‌ఐ, అగ్‌మార్క్, హాల్‌మార్క్, వంటి నాణ్యతా చిహ్నాలు గల వస్తువులనే  కొనుగోలు చేయాలి.  

న్యాయం పొందే హక్కు..  
అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందవచ్చు. న్యాయ సమ్మతమైన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు ధనపరంగా చిన్న మొత్తానికో లేదా అంశానికో కావచ్చు... అయినా సమాజంపై దాని ప్రభావం అసమానం కావచ్చు.  

భారత ప్రమాణాల మండలి... 
వస్తువుల ప్రమాణాలను గుర్తించేందుకు మన దేశంలో ప్రధానంగా బీఐఎస్, ఎన్‌టీహెచ్‌లు పనిచేస్తున్నాయి. ఇవి ఆయా వస్తువులను బట్టి  ఐఎస్‌ఐ, హాల్‌మార్కింగ్, సర్టిఫికెట్లను ఇస్తుంటాయి. వినియోగదారులు అవసరాలు నెరవేర్చే రీతిలో వస్తువులు, సేవల నాణ్యతలు పరిరక్షించడం బీఐఎస్‌ ప్రధాన విధి. పరిశ్రమలు, వ్యాపార వర్గాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకునే విధంగా తగిన జాగ్రత్తలను సూచించడం కూడా బీఐఎస్‌ విధులలో భాగమే. అలాగే స్వర్ణాభరణాల, వెండి ఆభరణాల నాణ్యతకు హాల్‌ మార్కింగ్‌ విధానం కూడా బీఐఎస్‌ విధిలో భాగమే. బిఐఎస్‌ కింద 5 ప్రాంతీయ కార్యాలయాలు, 32 శాఖా కార్యాలయాలు, 8 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. ప్రమాణాల రూపకల్పన, ప్రొడక్ట్‌ సర్టిఫికేషన్, మేనేజ్‌మెంట్‌ సిస్టం సరి్టఫికేషన్, హాల్‌ మార్కింగ్‌లలో బీఐఎస్‌ పనిచేస్తోంది. 

కొనుగోలు విషయంలో సూచనలు...  
కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్‌కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చింతగా గమనించాలి. మందులు–ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్‌పై చూపాలి. దేనిలో నెట్‌ కంటెంట్స్‌ ఎక్కువగా ఉన్నాయో చూసి కొనాలి. కాస్మోటిక్‌ ఉత్పత్తులపై తప్ప కుండా వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్‌పీపై స్టిక్కర్‌ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి. ఆటో మీటర్లను టాంపరింగ్‌ చేసి ఎక్కువ తిరిగేలా చేస్తుంటారు. వీటిని టైం టెస్ట్, బెంచ్‌ టెస్ట్‌ ద్వారా కనిపెట్టవచ్చు. 

పరిహారాన్ని ఎలా పొందుకోవచ్చు. 
ఎలాంటి కొనుగోళ్లు, లావాదేవీలు చేసినా వినియోగదారుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. వారంటీ, గ్యారంటీ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఇతర బిల్లులు, ఇన్వాయిస్‌ వంటివి జతచేయాల్సి ఉంటుంది. వినియోగదారుల హక్కులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. కొనుగోలు చేసిన వస్తు, సేవలలో లోపాలు ఉన్నా, అమ్మకం దారులు చెప్పినదానికి, వాస్తవ వస్తుసేవలకు తేడాలు ఉన్నా, వినియోగదారుడు నష్టపరిహారాన్ని కోరే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు వినియోగదారుడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు తనకు కలిగిన డ్యామేజిని బట్టి నష్టపరిహారాన్ని పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది.  

సమస్యల పరిష్కారం, నష్టపరిహారం కోసం 
వినియోగదారులకు ఎదురైన సమస్యలు, నష్టపరిహారం కోసం జిల్లా స్థాయిలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తి స్థాయిలో 2022 ఫిబ్రవరి నుంచి సేవలందిస్తున్నాయి. గత రెండేళ్లుగా ఇవి ఖాళీగానే ఉన్నాయి. గతంలో వీటిని వినియోగదారుల ఫోరంగా పిలిచేవారు. వీటిని 2019లో వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్లుగా మార్చారు. విశాఖలో ఇటువంటి రెండు కమిషన్లు ఉన్నాయి. రెండు జడ్జి కోర్టు ఎదురుగా గల వీధిలో ఉన్నాయి.  వినియోగదారులు ఏదైనా సమాచారం కోసం డైరెక్టుగా లేదా ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.  

ఫిర్యాదు ఎలా చేయాలంటే..?  
ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు, ఫిర్యాదుదారుడైనా, అతని ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది.  
  
ఫిర్యాదులో ఏం రాయాలి..?  
ఫిర్యాదుదారు పూర్తి పేరు, చిరునామా, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఇవ్వడం మంచిది. అలాగే, అవతలి పార్టీ పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు, ఎప్పుడు.. ఎలా.. జరిగింది, ఏ విధంగా నష్టపోయారనే విషయాలు తెలుపుతూ డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఫిర్యాదుకు జత చేయాలి. ఇవి కేసు విచారణ సమయంలో ఉపయోగపడుతాయి. ఫిర్యాదుదారుడు ఏ విధంగా నష్ట పరిహారం అడుగుతున్నాడో వివరణ ఇవ్వాలి.   

విశాఖలో కమిషన్‌–1లో ఇప్పటివరకు 383 కేసులు నమోదు కాగా ఫిబ్రవరిలో 7 కేసులు పరిష్కరించారు. (గత రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా ఇవి పనిచేయలేదు.) 
కమిషన్‌ 1 ఫోన్‌ నంబర్‌ 0891–2746026 

కమిషన్‌ 2లో ఫిబ్రవరి 2022 వరకు 443 కేసులు నమోదుకాగా, 13 కేసులు ఫిబ్రవరిలో పరిష్కరించారు. 
కమిషన్‌ 2 ఫోన్‌ నంబర్‌ 0891–2734128 

ఇవి కాకుండా కొన్ని స్వచ్ఛంధ సేవా సంస్థలు కూడా వినియోగదారుల హక్కుల కోసం పనిచేస్తున్నాయి.   

మోసపోతున్నా ముందుకు రావడం లేదు 
వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. మోసాలపై ఫిర్యాదు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కారణం సమయం వెచ్చించలేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం. అందుకే విస్తృతంగా  అవగాహన కల్పిస్తున్నాం. హాస్పటల్, డయాగ్నోస్టిక్‌ సెంటర్స్, పెట్రోల్‌ పంప్స్, బంగారం షాపులు, ఇలా ప్రతి చోటా వినియోగదారుడు మోసపోతున్నాడు. ఉదాహరణకు ఎంఆర్‌ఐ స్కాన్‌కు నగరంలో సుమారు రూ.7వేలు వసూలు చేస్తున్నారు. కానీ దీని వాస్తవ ధర రెండు వేల లోపే. కానీ మధ్యవర్తుల కమీషన్ల కోసం ఇలా అమాంతం ధరలు పెంచేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ప్రతి చోటా మా కార్యాలయాలను స్థాపించి, వలంటీర్లను నియమించి అవగాహన కల్పించాలనుకుంటున్నాం.
–కొణతాల కృష్ణ, వినియోగదారుల హక్కుల చట్టం ఆర్గనైజేషన్,ఏపీ అధ్యక్షుడు

అప్రమత్తంగా ఉండాలి 
వినియోగదారులు ఏదైనా వస్తువులు, సేవలు కొనుగోలు చేసేటప్పుడు పూర్తిగా దాని గురించి తెలుసుకోవాలి. వినియోగదారుడికి ఏదైనా వస్తు, సేవాలోపం జరిగినట్లయితే వెంటనే కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. వినియోగదారులు వాణిజ్య ప్రకటనలు, వ్యాపార సంస్థల డిస్కౌంట్లకు, ఆఫర్లకు ఆకర్షితులై మోసపోతున్నారు. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బిల్టర్స్, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ప్రముఖ మాల్స్‌ ఎక్కువగా ఇటువంటివి చేస్తుంటాయి. కానీ అమలులో ఇవి కనిపించవు.

ఫిబ్రవరి 2022 నుంచి ఆంద్రప్రదేశ్‌లోని మొత్తం జిల్లాలో ఈ కమిషన్లు పనిచేయడం ప్రారంభించాయి. గతంలో ఎక్కడ కోనుగోలు చేస్తే అక్కడే ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. కొత్త చట్టం ప్రకారం వినియోగదారుడు ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. ఉన్నతాధికారుల అనుమతితో భవిష్యత్తులో స్కూల్స్‌లో, కళాశాలలో, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం.  –వర్రి కృష్ణమూర్తి, ప్రిసైడింగ్‌ మెంబర్, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌–1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement