AP: విద్యార్థులకు అందుబాటులో ప్రపంచ జ్ఞానం! | World Knowledge Available To Students Of AP With Smartical APP | Sakshi
Sakshi News home page

AP: విద్యార్థులకు అందుబాటులో ప్రపంచ జ్ఞానం!

Published Fri, Jan 14 2022 4:23 PM | Last Updated on Fri, Jan 14 2022 7:36 PM

World Knowledge Available To Students Of AP With Smartical APP - Sakshi

సాక్షి, అమరావతి: బట్టీ పట్టే చదువులతో విద్యార్థుల్లో ప్రపంచ పరిజ్ఞానం లోపిస్తోంది. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రంలోని విద్యార్థులకు విస్తృతమైన జనరల్‌ నాలెడ్జి కోసం రీడింగ్‌ రైట్‌ అనే సంస్థ సహకారంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చిన స్మార్టికల్‌ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్‌ను ఆరంభించిన అనతికాలంలోనే 25 వేల మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగిస్తున్నారు. విద్యార్థుల మానసిక వికాసానికి సచిత్ర, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివరణాత్మక వార్తా కథనాలను అందించేందుకు ఈ స్టార్టప్‌ యాప్‌ను ఉన్నత విద్యామండలి ఇటీవలే ప్రారంభించింది. నిపుణులు వివిధ పత్రికలు, మేగజైన్లు, ఇతర జర్నల్స్‌లో వచ్చిన వార్తా కథనాలను ఈ స్టార్టప్‌ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు అందిస్తున్నారు. విభిన్న రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దేలా వాస్తవిక దృశ్యాత్మక అంతర్జాతీయ కథనాలను ఉండేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. 

చదివేకొద్దీ సమాచారం
ప్రతి పదానికి అర్థం, దాని వ్యుత్పత్తితో పాటు చాలా లోతుగా అన్ని అంశాలను ఈ యాప్‌ అందిస్తోంది. విద్యార్థి ఏదైనా కొత్త అంశాన్ని విన్నప్పుడు దానికి సంబంధించిన ముందు వెనుక అంశాలన్నిటినీ వారికి అందిస్తోంది. సబ్జెక్టు అంశాలతో ముడిపడి ఉన్న జనరల్‌ నాలెడ్జి అంశాలను విద్యార్థులకు సులభమైన రీతిలో అర్థమయ్యేలా, గుర్తుండిపోయేలా సమస్త సమాచారాన్ని వారి ముందుంచుతోంది. ఇవే కాకుండా  సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు, వాటికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా యాప్‌ ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలం పాటు చేసిన ఆందోళన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విద్యార్థి ఆ పదాన్ని యాప్‌లో టైప్‌ చేయగానే దాని ప్రాథమిక సమాచారం అందుబాటులోకి వస్తుంది. దాన్ని చదివిన వెంటనే దానితో ముడిపడి ఉన్న అంశాలు ఒకదాని వెనుక ఒకటిగా విద్యార్థికి అందుతాయి.  

జాతీయ, అంతర్జాతీయ పత్రికల కథనాలు
జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లలో వార్తా కథనాలు, సంపాదకీయాలు, ప్రముఖుల విశ్లేషణలు ఈ యాప్‌ అందిస్తోంది. ద కార్వాన్, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, ఫ్రంట్‌లైన్‌–హిందీ, లైవ్‌మింట్, అబ్జర్వ్‌ రీసెర్చి ఫౌండేషన్, వియాన్, ద కెన్, ద వైర్, ఆర్టికల్‌ 14, బ్రోకింగ్‌ ఇండియా, ద హిందూ, ద ప్రింట్, లైవ్‌లా, బిజినెస్‌ స్టాండర్డ్, ద ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్, ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రముఖ పత్రికలు, మేగజైన్ల కథనాలు విద్యార్థులకు యాప్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఎడిటోరియల్స్, బిజినెస్, ఇండియన్‌ పాలిటిక్స్, సైన్సు అండ్‌ టెక్నాలజీ, ఎకానమీ, స్టార్టప్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, లీగల్, వరల్డ్‌ ఎఫైర్స్, నాట్‌సో రీసెంట్, కల్చర్, పాలసీ, సైకాలజీ, మెంటల్‌హెల్త్, ఫిలాసఫీ అనే విభాగాల కింద లోతైన విశ్లేషణాత్మక కథనాలను విద్యార్థులకు ఇది అందిస్తోంది. వివరణాత్మక విధానంలో వచనం, చిత్రం, దృశ్యరూపకంగా ఆయా అంశాలను వివరించేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. క్షేత్ర స్థాయి పరిశీలనతో విశ్లేషణలతో రూపొందించిన ఈ కథనాల ద్వారా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచం తెలియనుంది. 

విద్యార్థులకు అందుబాటులోప్రపంచ జ్ఞానం
ఈ యాప్‌ ద్వారా విద్యార్థులందరూ ప్రపంచ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిపుచ్చుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్, యాప్‌ స్టోర్‌తో సహ  web. readingright. in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీరియాడికల్స్‌ జర్నల్స్‌లో నిపుణులు ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేసి వడపోసి రూపొందించిన వార్తా కథనాలను ఈ స్మార్టికల్‌ యాప్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఈ యాప్‌ ద్వారా ప్రపంచ పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. 
– హేమచంద్రారెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement