చేతిలో నుంచి విభూతి, నోటిలో నుంచి శివలింగం తీయడం వంటివి చూసి దైవాంశ శక్తులున్న వారే ఇలా చేయగలరని గుడ్డిగా నమ్మడం, చేతబడి, చిల్లంగి వంటివి ఉన్నాయన్న మూఢ నమ్మకాలతో దారుణంగా మోసపోతున్న ప్రజల్లో ఇంద్ర జాలకులు చైతన్య కల్పిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఓ అడుగు ముందుకేసి అవన్నీ ఊహాజనితమేనంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు పద్మశ్రీ పీసీ సర్కార్ (సీనియర్) జయంతి ఫిబ్రవరి 23న ఏటా ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే కోవిడ్ ప్రభావంతో ఎక్కడా సరైన ప్రోగ్రామ్‌లు లేక ఇంద్రజాలంపైనే ఆధారపడి జీవిస్తున్న కళాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఇంద్రజాలకుల అభిప్రాయాలిలా ఉన్నాయి.
– విజయనగరం
సమాజంలో మార్పుకోసం కృషి
గత 48 ఏళ్లుగా ఇంద్రజాల రంగంలో రాణిస్తూ, జాతీయస్ధాయిలో జిల్లా పేరును నిలబెట్టేందుకు కృషిచేస్తున్నాను. సమాజంలో మార్పుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాను. సుమారు పదివేలకు పైగా ప్రదర్శనలు దేశమంతా ఇవ్వగలిగాను. కళ ఎప్పుడూ మరుగున పడిపోదు. కళాకారుల కళపైనే ఆధారపడి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి. పూర్వం విద్య గోప్యంగా ఉండేది. ప్రస్తుతం యూ ట్యూబ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత బహిర్గతమైంది. అందులోనూ కేవలం 40 శాతం నిజం ఉంటుంది. పూర్వం థియేటర్ షోలు, స్టాండర్డ్ ఫ్లాట్‌ఫామ్‌లు ఉండేవి. ప్రస్తుతం బర్త్‌డే, మ్యారేజ్‌డే షోలు మాత్రమే ఉంటున్నాయి. చిన్నపాటి స్థలంలో అద్బుతాలు సృష్టించే అవకాశం తక్కువగా ఉంటుంది.
– సీహెచ్. శ్యామ్, సీనియర్ మెజీషీయన్
ఆసక్తే ప్రేరణ కల్పించింది
చిన్న నాటి నుంచి ఇంద్రజాలమంటే ఎంతో ఆసక్తి. అదే ఆసక్తి నాలో ప్రేరణ కల్పించి, నేర్చుకునేలా చేసింది. గ్రామగ్రామాన అవకాశం వచ్చినప్పుడల్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు కృషిచేస్తున్నాను. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నప్పటికీ ఎక్కడ అవకాశం వచ్చినా ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నాను.
– పవన్ ఆశిష్, మెజీషీయన్
ఐదు వేలకు పైగా ప్రదర్శనలిచ్చా
చేతబడి, చిల్లంగి పూర్తిగా మోసం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించేందుకు మేజిక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఏ ప్రాంతానికి వెళ్లినా మూఢనమ్మకాలను పారద్రోలడానికి కృషిచేస్తున్నాను. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇస్తే మంచి కార్యక్రమాలను చేయడానికి సిద్ధం.
– ఎస్‌కె.సలీమ్, ఇంద్రజాలికుడు
మేజిక్ సిస్టర్స్‌గా ప్రతిభ
మేజిక్ సిస్టర్స్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు అందుకున్నాం. చిన్నప్పటినుంచి నాన్న చారి మా గురువు. 2006 నవంబరు 14న ఢిల్లీలో జాతీయస్థాయి అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకోవడం తృప్తినిచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామగ్రామాన పర్యటించి, ప్రజల్లో మూఢ నమ్మకాలు పారదోలడంపై అవగాహన కల్పిస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి మేజిక్ సిస్టర్స్‌గా పేరుగాంచాం.
– సుస్మిత, మౌనిక
Comments
Please login to add a commentAdd a comment