ప్రాణాంతకమైన రేబీస్‌ వ్యాధి: లక్షణాలు ఇవే, జాగ్రత్తలు అవసరం! | World Rabies Day: Doctor Advice For Control Rabies | Sakshi
Sakshi News home page

World Rabies Day 2021: రేబీస్‌తో అప్రమత్తం అవసరం

Published Tue, Sep 28 2021 10:10 AM | Last Updated on Tue, Sep 28 2021 10:51 AM

World Rabies Day: Doctor Advice For Control Rabies - Sakshi

సాక్షి,అనంతపురం: కుక్క కాటుతో వ్యాపించే ప్రాణాంతక రేబీస్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జ్‌ జేడీ డాక్టర్‌ వై.సుబ్రహ్మణ్యం, రెడ్డిపల్లి పశుగ్రాస విత్తనోత్పత్తి కేంద్రం ఏడీ డాక్టర్‌ ఏవీ రత్నకుమార్‌ సూచించారు. ప్రముఖ జీవ శాస్త్రవేత్త, రేబీస్‌ టీకా సృష్టికర్త సర్‌ లూయిస్‌ పాశ్చర్‌ వర్దంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 28ని ప్రపంచ రేబీస్‌ నియంత్రణ దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించినట్లు గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే రేబీస్‌ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి అంశాలపై జిల్లా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పశు వైద్యశాలల్లో  మంగళవారం కుక్కలకు ఉచితంగా రేబీస్‌ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం 2,600 డోసులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.  

రేబీస్‌ వ్యాప్తి ఇలా..  
‘రాబ్డో’ కుటుంబానికి చెందిన ‘లిస్సా’ వైరస్‌ కారణంగా రేబీస్‌ వ్యాధి వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, ఆవులు, గొర్రెలు, పందులు, గుర్రాల్లో ఈ వైరస్‌ కనిపిస్తుంది. వ్యాధి సోకిన కుక్క మరొక కుక్కనో, ఇతర జంతువునో, మనిషినో కరచినప్పుడు వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. 90 శాతం కుక్కల వల్లనే మనుషులకు ఈ వైరస్‌ సోకుతుంది. కుక్క కాటు వేయగానే వైరస్‌ శరీరంలో ప్రవేశించి కండరాలలో వృద్ధి చెంది న్యూరో మస్కులర్‌ స్టిండిల్‌ ద్వారా నాడీ వ్యవస్థకు చేరుతుంది. అక్కడి నుంచి మెదడుకు వ్యాపిస్తుంది. శ్వాస దిగ్బంధనం వల్ల రేబీస్‌ వ్యాధి సోకిన కుక్క చనిపోతుంది.  

ప్రాణాంతకమైన రేబీస్‌ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తీవ్రమైన లక్షణాలు (ఫ్యూరియస్‌ ఫారం), మరొకటి తీవ్రత తక్కువ గల లక్షణాలు (డంబ్‌ ఫారం). తీవ్రమైన లక్షణాల విషయానికి వస్తే వ్యాధికి గురైన కుక్కలు శబ్ధాలకు అతిగా స్పందిస్తాయి. ఇతర జంతువులు, మనుషులు, చలనం లేని వస్తువులపై దాడి చేస్తుంటాయి. నడకలో కాళ్ల సమన్వయం లేకుండా పోవడం, పిచ్చిగా విపరీతంగా అరవడం చేస్తుంటాయి.

చివరగా 24 నుంచి 48 గంటలల్లోపు వ్యాధి తారాస్థాయికి చేరుకుని పక్షవాతానికి గురై మరణిస్తుంది. ఇక వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వాటిలో వెనుక కాళ్లు మడత పడుతుంటాయి. తరచుగా తోక ఒకవైపు ఒరిగి ఉంటుంది. శబ్ధాలకు స్పందించే గుణం తక్కువగా ఉండి, నోటి నుంచి చొంగ కారుతూ, ఆవలిస్తున్నట్లుగా అరవడం చేస్తుంటాయి. ఇలాంటి లక్షణాలున్న కుక్కలు వారం నుంచి పది రోజుల్లో మరణిస్తాయి.  

ముందస్తు జాగ్రత్తలతోనే నివారణ 
ప్రాణాంతక రేబీస్‌ వ్యాధి సోకకుండా కుక్కలకు ముందస్తుగా టీకాలు వేయించడం ఒక్కటే సరైన ప్రత్యామ్నాయ మార్గం. కుక్క కాటుకు గురైన వారు నీటి కొళాయి కింద కార్బలిక్‌ సబ్బు లేదా డెట్టాల్‌ సబ్బుతో 10 నుంచి 15 సార్లు బాగా నురగ వచ్చేలా కడుక్కోవాలి. గాయం మీద ఐస్‌ ముక్కలు ఉంచడం వల్ల వైరస్‌ కదలికలను కొంత వరకు తగ్గించవచ్చు.

కుక్క కరచిన మొదటి రోజు నుంచి 3, 7, 14, 28, 90వ రోజుల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, పశుసంవర్ధకశాఖ సహకారంతో వీధి కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు టీకాలు వేయిస్తే వ్యాధి అదుపులోకి వస్తుంది.

చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement