సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న చిత్తూరు జిల్లా నాయకులు
Updates:
వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌దే: ఎమ్మెల్యే ఆర్కే రోజా
ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగిరిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగిరి ఓం శక్తి సర్కిల్ నందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత పడుతున్న కష్టాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు. ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని దృఢ సంకల్పంతో సంకల్ప పాదయాత్ర చేపట్టారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సర కాలంలోనే సమస్యలకు పరిష్కారం చూపుతూ తానిచ్చిన వాగ్దానాలను నూటికి నూరు శాతం నెరవేర్చారు.
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్‌సైడ్‌గా సీఎం జగన్‌కు విజయాన్ని అందిస్తున్నారు. ఆనాడు సీఎం జగన్ పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు జగన్ వైపు నిలబడ్డారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాగ్దానాలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టుబడి తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.
శ్రీకాకుళం జిల్లా..
టెక్కలిలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానిక వైఎస్సార్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి పాదయాత్రను ప్రారంభించారు.
గుంటూరులో..
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు నగరపాలెంలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి హిమని సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లాలో..
గూడూరులో జనహృదయనేత సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ వైఎస్సార్ విగ్రహం నుంచి సాదుపేట సెంటర్ వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో..
సీఎం జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ 10 ఏళ్ల కష్టం ప్రజలందరికీ తెలుసు: భూమన
ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసికున్న సందర్భంగా వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తుడా సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహం వద్ద సర్వమత ప్రార్ధనలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తుడా వైఎస్సార్ సర్కిల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషా, కార్పొరేటర్‌లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 10 ఏళ్లు పడ్డ కష్టం ప్రజలందరికీ తెలుసు.
నాడు వైఎస్ పాదయాత్రతో ఎలా ప్రభంజనం సృష్టించారో, అదే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని, రెండు పేజీలు మ్యానిఫెస్టోలో పెట్టి నవరత్నాలుగా మార్చి ప్రజలకు అందించారు. కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్నారు. చంద్రబాబు నిరంతరం దూషిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అయ్యింది. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌కే పట్టం కట్టారు. 3,648 కి.మీ ప్రజా సంకల్ప పాదయాత్ర సువర్ణ చరిత్ర అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
అనంతపురం జిల్లాలో..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జెండా ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి: ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుంది. విపక్ష నేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా..
ప్రజాసంకల్పయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నిడమర్రు మండలం బువ్వనపల్లిలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించాయి.
విజయవాడలో..
సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు ఈ సంబరాల్లో పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ భాగ్యలక్ష్మి పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు.
చిత్తూరు జిల్లా
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో వైఎస్ జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు, నేతలు పాలాభిషేకం చేశారు. ప్రజా సంకల్ప యాత్రను గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎండనక వాననక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచి పోయిందని అంటున్నారు.
వైఎస్సార్ జిల్లా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేంపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుండి రాయచోటి బైపాస్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్ది, ఎంపీపీ గాయత్రి, కార్పొరేషన్ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సాక్షి, అమరావతి: జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నవంబర్ 6వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేడు (శనివారం) పాదయాత్రలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం పాదయాత్రతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాలని, సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని, కేక్ కటింగ్ చేయాలని ఆయన తెలియజేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. నాటి పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలోనే 97 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారన్నారు. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ.. ఈనాటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.
కాగా, నవంబర్ 6, 2017న ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 134 నియోజకవర్గాల్లో 231 మండలాల్లో 2,516 గ్రామాల్లో కొనసాగింది. అడుగడుగున పేదల కష్టాలను తెలుసుకున్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ఆనాడే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అధికారం చేపట్టగానే యాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి నడుంకట్టారు.
Comments
Please login to add a commentAdd a comment