మనోడి దొంగతనాన్ని దర్యాప్తు సంస్థలు బయట పెట్టి నోటీసులిస్తే అవి చెల్లని నోటీసులట. 118కోట్లకు పైగా అడ్డంగా ఎలా తిన్నావయ్యా? చెప్పని నిలదీస్తే అవి మామూలు నోటీసులట. కంగారు పడాల్సింది ఏమీ లేదట. చంద్రబాబు నాయుడి అడ్డగోలు లూటీ ని కేంద్ర ఐటీ శాఖ నోటీసులు బయట పెట్టడంతో ఏం మాట్లాడాలో తెలీక నోటికి తాళాలు వేసుకున్న పచ్చ బ్యాచ్ కాస్త గ్యాప్ ఇచ్చి అబ్బే అవేం సీరియస్ నోటీసులు కావండీ బాబూ అని బుగ్గలు నొక్కేసుకుంటోంది. చంద్రబాబును ఎలా కాపాడాలా అని నానా తంటాలూ పడుతూ తమ చెత్త లాజిక్ తో దొరికిపోతున్నారు.
అమరావతిలో తాత్కాలిక భవనాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాల ముసుగులో శాంపిల్ కింద 118 కోట్ల రూపాయలకు పైగా డొల్ల కంపెనీల ద్వారా తన ఖాతాలోకి రప్పించుకున్న చంద్రబాబు నాయుడికి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల్లో అయ్యా చంద్రబాబు గారూ మీరు ..మీ తనయుడు..మీ పిఏ శ్రీనివాసు.. కలిసి మీ డొల్ల కంపెనీల ద్వారా ఫేక్ ఇన్వాయిస్ లద్వారా 118 కోట్ల 90లక్షలకు పైగా లూటీ చేశారు కదా...దానికి సంబంధించి మీ వివరణ ఏంటో చెప్పండి సార్ అని ఐటీ అధికారులు ఆరా తీశారు. నోటీసులు రావడంతోనే పక్షవాతం వచ్చినట్లు టీడీపీ నేతలు వారి అనుబంధ పత్రికలు, సంస్థల ప్రతినిథుల నోళ్లు పడిపోయాయి.
కొద్ది రోజులుగా అన్ని వర్గాల ప్రజలూ చంద్రబాబు దోపిడీ గురించే కథలు కథలు గా చెప్పుకుంటున్నారు. దీన్ని గమనించిన చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. ప్రజల నుండి సానుభూతిని కొట్టేయడానికి నన్ను రేపో మాపో అరెస్ట్ చేస్తారంటూ ఆయనే బేలగా వ్యాఖ్యానించారు. అయితే అనుకున్న సానుభూతి ఎక్కడి నుండీ రాలేదు. పై పెచ్చు లూటీ చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దులు పెట్టుకుంటారా అని ప్రశ్నలు వెల్లువెత్తాయి.
దీంతో ఈ లోకం అంతా చంద్రబాబు నాయుడిపై కక్షగట్టేసిందన్నట్లు ఎల్లో బ్యాచ్ ఆరున్నొక్క రాగం అందుకుంది. అందులో బాబు జేబు మీడియాలో చిత్ర విచిత్ర కథనాలు వచ్చేశాయి. అసలు అవి ముడుపులే కావట. ఐటీ జారీ చేసిన నోటీసులు అసలు చెల్లనే చెల్లవట. చాలా రొటీన్ గా ఇచ్చే నోటీసులే తప్ప సీరియస్ గా తీసుకోవలసిన అవసరమే లేదట. ఇవీ ఘనత వహించిన ఎల్లో పత్రికల కుళ్లు రాతలు.
ఇక చంద్రబాబు నాయుడైతే అడ్డంగా దొరికిపోయి కూడా నేను నిప్పులా బతికాను అని పాత రికార్డు మళ్లీ ప్లే చేసేశారు. తనని ఇంత వరకు ఏ ఒక్క కేసులోనూ జైలుకు పంపలేకపోయారన్న చంద్రబాబు.. ఏ కేసులోనూ తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవుగా అని అనేశారు. అంటే తానేం చేసినా సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తగానే లూటీ చేస్తానని ఆయన చెప్పకనే చెప్పారు.
సరే ఎల్లో మీడియా అంటేనే చంద్రబాబు అక్రమ సంపాదనతో నడిచేవి కాబట్టి అవి బాబును నిర్దోషిగా చిత్రీకరించడానికి విఫలయత్నాలు చేస్తాయి. ఏపీలో టీడీపీకి ప్రత్యర్ధి పార్టీ అయిన బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబుకు రక్షణ కవచంలా అడ్డు పడిపోయారు. బాబుకు వచ్చిన ఐటీ నోటీసులు రొటీనే అంటూ ఆమె కూడా దాన్ని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. ఆ నోటీసులు పంపింది బిజెపి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ఐటీ శాఖ అధికారులేనని ఆమె మర్చిపోయినట్లున్నారని ఆర్ధిక రంగ నిపుణులు సెటైర్లు వేస్తున్నారు.
తమ రాజకీయ ప్రత్యర్ధులకు ఏవైనా నోటీసులు వస్తే వాళ్లు అవినీతి పరులనీ తామే తీర్పులు ఇచ్చేసి దుర్మార్గంగా వ్యవహరించే ఎల్లో బ్యాచ్ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా ఆయన్ను నిజాయితీ పరుడిగా చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ బ్యాచ్ లో ఇపుడు కొత్తగా పురంధేశ్వరి కూడా వచ్చి చేరడమే కొసమెరుపు అంటున్నారు రాజకీయ పండితులు. ఎన్టీయార్ పేరిట నాణెం విడుదల కార్యక్రమం ముసుగులో చంద్రబాబు-నడ్డాల భేటీ ఏర్పాటు చేసిన పురంధేశ్వరి ఇపుడు చంద్రబాబు నాయుడి నిజాయితీ నిరూపించే పనిలో పడ్డారని బిజెపిలోని ఒరిజనల్ నేతలు అంటున్నారు.
-సీఎన్‌ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment