వెంకాయమ్మ పింఛన్ తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదైన జాబితా
సీన్–1
టీడీపీ కార్యకర్త దెబ్బకు ఎల్లో మీడియా అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సోమవారం (16వ తేదీ) ఉదయం గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఓ ఒంటరి మహిళ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు బూతులు లంఘించుకుంది. ఆమె ఎవరని ఆరా తీస్తే.. తెలుగుదేశం కార్యకర్త అని చివరికి తేలింది. ఈ వ్యవహారంలో ‘పచ్చ’ ప్రచారం బెడిసికొట్టగా టీడీపీ, దాని భజన బ్యాచ్ అయిన ఎల్లో మీడియా అభాసుపాలయ్యాయి.
ఏం జరిగిందంటే.. :
► గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కర్లపూడి వెంకాయమ్మ సోమవారం గుంటూరు కలెక్టరేట్‌కు వెళ్లి తన స్థలాన్ని సర్వే చేయడంలేదంటూ అధికారులపై ఫిర్యాదు చేసింది.
► బయటకొచ్చి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగోలేదంటూ మీడియా ఎదుట సంబంధం లేకుండా నానా మాటలు అనేసింది.
► తన పూరిగుడిసెకు రూ.18 వేల కరెంట్ బిల్లు వచ్చిందని, అందుకే పెన్షన్ ఆపేశారని, అధికారులు అడిగినా పట్టించుకోవడంలేదంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేసింది.
► ఇంకేముంది.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అక్కసుతో రోజూ రగిలిపోతున్న టీడీపీ, దాని భజన బ్యాచ్ అయిన ఎల్లో మీడియా కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు వెంకాయమ్మ వ్యాఖ్యలను ముందూవెనక ఆలోచించకుండా తెగ వైరల్ చేసేశాయి.
► పెన్షన్ అందకపోవడాన్ని తెలుసుకుందామని వలంటీరు మిక్కిలి మంజరి వెంకాయమ్మ వద్దకు వెళ్లగా.. వెంకాయమ్మతో పాటు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పాల్‌బాబు మరికొందరు మంజరిపై దాడిచేశారు.
► అంతటితో వెంకాయమ్మ ఆగకుండా.. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు తన మీద దాడిచేశారని.. తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని మరోసారి మీడియాకెక్కింది.
► టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ అయితే.. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తారా? రాష్ట్రంలో ఐదు కోట్ల మందిపై దాడిచేస్తారా అంటూ ట్వీట్ చేసేశారు.
అసలు నిజాలివీ..
వెంకాయమ్మ ఆరోపణల్లోని నిజానిజాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే అవన్నీ అవాస్తవాలని తేలింది.
► వెంకాయమ్మకి వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ఒంటరి మహిళ పెన్షన్ అందుతోంది. ఈ నెల ఒకటో తేదీ ఉ.5.49 గంటలకే వలంటీరు ఆమె ఇంటికెళ్లి పెన్షన్ అందించింది.
► ఆమె ఇంటి కరెంట్ సర్వీస్ నెంబర్ 9232309001236. ఎస్సీ కోటా కింద ఆమె రాయితీ పొందుతోంది. ఆరు నెలలుగా ఒక్క పైసా కూడా కరెంట్ బిల్లు చెల్లించలేదు.
► ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఒంటరి మహిళ పెన్షన్ పొందుతోంది. భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది.
► ఇక వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా గ్రూపులో తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె గ్రూపునకు రుణం మంజూరు కాలేదు.
► అంతేకాదు.. కలెక్టరేట్‌లో వెంకాయమ్మ ఫిర్యాదు చేసిన ఇంటి స్థలం వ్యవహారం మంగళగిరి కోర్టు పరిధిలో (146/2015) ఉంది. ఈ సమయంలో అధికారులు తనకు సర్వే చేయడంలేదంటూ తప్పుడు ఫిర్యాదు చేసింది.
► ఇవన్నీ బయటపడడంతో చివరికి వెంకాయమ్మ మంగళవారం సాయంత్రం తాను టీడీపీ కార్యకర్తనంటూ వ్యాఖ్యానించడంతో టీడీపీ, ఎల్లో మీడియా వారి గోతిలో వారే పడినట్లయింది.
► కొసమెరుపు.. వలంటీర్ మంజరి ఫిర్యాదుతో తాడికొండ పోలీసులు వెంకాయమ్మతోపాటు టీడీపీకి చెందిన మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.
సీన్–2
గంగమ్మ జాతరపైనా అదే పైత్యం
తిరుపతి మంగళం : గుంటూరు జిల్లాలో అభాసుపాలైనట్లుగానే ఎల్లో మీడియా మంగళవారం తిరుపతిలోనూ బొక్కబోర్లా పడి పరువు పోగొట్టుకుంది. భక్తుల తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇక్కడ ఏమైందంటే.. తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా గత కొద్దిరోజులుగా గంగజాతరను అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. వివిధ రకాల వేషధారణలు, మేళ తాళాలు, డప్పులతో నగరమంతా మార్మోగింది. కానీ, మొదటి నుంచీ ఏబీఎన్ ఛానల్ దీనిపై విషం కక్కుతోంది. ఎంతలా అంటే.. ఏకంగా జాతర పర్వదినం రోజున ‘చెత్తకుప్పలో గంగమ్మలు, గంగజాతరలో అపశ్రుతి’.. అంటూ దుష్ప్రచారం చేసింది.
కార్పొరేషన్ లలిత కళాప్రాంగణంలో నిమజ్జనానికి ఉంచిన గంగమ్మ ప్రతిమలు
కానీ, వాస్తవం ఇదీ..
► ఏడు రోజులపాటు విశేష పూజలందుకున్న గంగమ్మ ప్రతిమలను జాతర అనంతరం నిమజ్జనం చేస్తారు.
► ఇందులో భాగంగా గంగమ్మ ప్రతిమలను సంప్రదాయం ప్రకారం ఊరేగింపుగా తీసుకొచ్చి ఆదివారం రాత్రి కార్పొరేషన్‌లోని లలిత కళాప్రాంగణం వద్ద ఉంచారు. బుధవారం నిమజ్జనం చేయాల్సి ఉంది.
► కానీ, గత రెండ్రోజులుగా గాలి, వాన బీభత్సంతో లలిత కళాప్రాంగణం వద్ద ఉన్న చెట్ల నుంచి ఆకులు రాలి గంగమ్మ విగ్రహాలపై పడ్డాయి.
► దీనిని ఏబీఎన్ చానల్ వక్రీకరించి చెత్త కుప్పలో గంగమ్మ ప్రతిమలు అంటూ అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతినేలా తప్పుడు కథనాలతో నానాయాగీ చేసింది.
► దీంతో లక్షలాది మంది భక్తులు ఆ చానల్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంతో వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన గంగమ్మ జాతరపై ఏబీఎన్ ఛానెల్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని కార్పొరేటర్ నరేంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
► అలాగే, దీనిపై కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ స్పందిస్తూ.. గంగమ్మ ప్రతిమలను చెత్త కుప్పల్లో ఎలా పడేస్తామని.. ఎవరైనా అలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతామని.. దురదృష్టవశాత్తూ కురిసిన భారీ వర్షం, గాలి బీభత్సంతో చెట్ల నుంచి ఆకులు రాలాయని.. దానిని చెత్తకుప్ప అంటూ రాద్ధాంతం చేస్తారా అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment