AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం | Yellow Media False Propaganda On Rythu Bharosa Centres | Sakshi
Sakshi News home page

AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం

Published Sat, Mar 19 2022 8:20 AM | Last Updated on Sat, Mar 19 2022 8:20 AM

Yellow Media False Propaganda On Rythu Bharosa Centres - Sakshi

సాక్షి, అమరావతి: అన్నదాతలకు తోడుగా నిలుస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) సాగుదారుల ప్రతి అవసరాన్నీ తీరుస్తున్నాయి. పల్లెపట్టున విశేష సేవలందిస్తున్న ఆర్బీకేలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్బీకేల రాకతో తెల్లవారగానే మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో రైతన్నలు పరుగులు తీయాల్సిన దుస్థితి తొలగిపోయింది. గంటల తరబడి కి.మీ. పొడవున క్యూలైన్లలో నిలబడాల్సిన అవస్థలు ఇప్పుడు లేవు. రవాణా ఖర్చులతో పాటు సమయం ఆదా అవుతోంది. సాగు ఉత్పాదకాల కోసమే కాకుండా సలహాలు, సూచనల కోసం కూడా రైతన్నలు ఆర్బీకేల తలుపు తడుతున్నారు. అలాంటి వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలపై ఓ వర్గం మీడియా బురద చల్లుతూ అసత్య కథనాలను ప్రచురించడంపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

చదవండి: బాబు.. ఏబీ.. ఓ పెగసస్‌ ఇప్పుడేమంటారు..?

ఎరువుల రవాణా చార్జీల్లోనే రూ.18 కోట్లు ఆదా
గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలు అన్నదాతలకు అన్ని రకాల సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంటున్నాయి. ఆర్బీకేల సేవలకు గుర్తింపుగా ఇటీవలే గోల్డెన్‌ స్కోచ్‌ అవార్డు దక్కింది. ఆర్బీకే వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత దళారులు, బ్లాక్‌ మార్కెటింగ్‌ బెడద తొలగిపోయింది. నకిలీలు, నాసిరకం భయం లేదు. గత 20 నెలల్లో 46.03 లక్షల మందికి పైగా రైతులు ఆర్బీకేల ద్వారా రూ.1,074.52 కోట్ల విలువైన సాగు ఉత్పాదకాలను పొందగా కోటిమందికి పైగా వివిధ రకాల సేవలు అందాయి. ఒక్క ఎరువులను తీసుకుంటే లోడింగ్, అన్‌లోడింగ్‌ చార్జీల కింద సగటున బస్తా ఎరువుపై రూ.20 చొప్పున రైతులకు ఇప్పటివరకు రూ.18.20 కోట్లు ఆదా కావడం గమనార్హం. ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ టీవీ, డిజిటల్‌ లైబ్రరీ, సీడ్, సాయిల్‌ టెస్టింగ్‌ కిట్స్, కియోస్క్‌లు రైతుల అవసరాలను తీరుస్తూ వారి నైపుణ్యాన్ని పెంచుతున్నాయి. శాఖల వారీగా తెస్తున్న మాస పత్రికలు రైతుల ఆదరణ చూరగొంటున్నాయి.

ఆర్బీకేల ద్వారా 20 నెలల్లో కొన్ని సేవలిలా..
ఆర్బీకేల ద్వారా 127.56లక్షల ఎంటీల పంట ఉత్పత్తులను సేకరించారు. 
81,529 మంది ఆదర్శ రైతులతో ఏర్పాటైన వ్యవసాయ సలహా మండళ్లు ఆర్బీకేల ద్వారా రైతులకు  సలహాలు ఇస్తున్నాయి. 63,842 మంది రైతులకు 2,991 క్షేత్ర సందర్శనలు నిర్వహించారు. 
పొలం బడుల ద్వారా 10,47,210 మందికి, తోట బడుల ద్వారా 8.50 లక్షల మందికి, పట్టు బడుల ద్వారా 1.20 లక్షల మంది పట్టు రైతులకు, పశు విజ్ఞాన బడుల ద్వారా 11.85 లక్షల మంది పాడి రైతులకు, మత్స్య సాగుబడుల ద్వారా 27,744 మందికి శిక్షణనిచ్చారు. 
ఆర్బీకేల ద్వారా 31.54 లక్షల పశువులకు హెల్త్‌ కార్డులు జారీ చేశారు. 1.17 కోట్ల పశువులకు ప్రథమ చికిత్స 
అందింది. 9,160 మంది కరస్పాండెంట్లు ఆర్బీకేల ద్వారా బ్యాంకింగ్‌ సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేలో ఏటీఎం సేవలు అందుబాటులోకి తెస్తున్నారు.
ఆర్బీకే చానల్‌ ద్వారా సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న 1.71 లక్షల మంది రైతులు పంటల వారీగా సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. 
ఆర్బీకేలు వేదికగా ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయాలు విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 

కడుపు మంటతోనే..
ఆర్బీకేలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఆస్థాన పత్రిక ‘ఈనాడు’ కడుపు మంటతో అసత్య కథనాలు ప్రచురిస్తోంది. ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుతున్నాయి. జాతీయ స్థాయిలో అమలు చేయడంపై కేంద్రం ఆలోచన చేస్తోంది. పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు అధ్యయనం చేస్తున్నాయి. ఇవేమీ ఈనాడుకు కానరావా?
– కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement