
హిందూపురం: సేవా లోపం కారణంగా అసహనానికి గురైన ఓ యువకుడు షోరూం ఎదుట తన నూతన ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. హిందూపురంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న టీవీఎస్ షోరూంలో బీరేపల్లికి చెందిన మనోజ్ ఫైనాన్స్ కింద ఓ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు.
పట్టుమని ఐదు నెలలు కూడా గడవక ముందే వాహనంలో సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. సమస్య తలెత్తిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిబెడుతూ వచ్చారు. అయినా సాంకేతిక సమస్యలు తప్పలేదు. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి వాహనం మరమ్మతుకు గురవడంతో షోరూంకు తీసుకెళ్లాడు.
ఆ సమయంలో షోరూం నిర్వాహకులతో వాగ్వాదం జరిగి అసహనానికి గురైన మనోజ్ వెంటనే షోరూం ఎదుట తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఘటనతో నివ్వెర పోయిన షోరూం నిర్వహకులు వెంటనే మంటల్ని అదుపు చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment