![Young Man From Srikakulam District Deceased With Corona - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/23/6.jpg.webp?itok=lTB10u3o)
సాక్షి, శ్రీకాకుళం: ఆ యువకుడిది పేద కుటుంబం.. తండ్రి మరణించాడు.. అన్నయ్య, తల్లి కష్టపడి చదివించారు. తాను కూడా ఉపాధ్యాయ వృత్తిని సాధించాలనే పట్టుదలతో చదివారు. 2018 డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించారు. అయితే కోరిక తీరకుండానే మృత్యువు అతన్ని కాటేసింది. కరోనా రూపంలో బలితీసుకుంది. ఈ విషాద ఘటన రేగిడి మండలం బాలకవివలస గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన డోల శంకర్ (27) అనారోగ్యంగా ఉందంటూ బూరాడ పీహెచ్‌సీకి కొద్దిరోజుల క్రితం వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాకుళం సమీపంలోని పాత్రునివలస క్వారంటైన్‌కు తరలించారు
ఆ తరువాత చికిత్స నిమిత్తం రిమ్స్‌లో చేర్పించారు. ఈ నెల 16వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో శంకర్ ఫోన్లో మాట్లాడారు. ఆ తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో తల్లి సూరీడమ్మ ఆందోళన చెంది.. స్థానికుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొంతమంది యువకులు శ్రీకాకుళం రిమ్స్‌కి వెళ్లి ఆరా తీయగా శంకర్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అండగా ఉంటాడనుకున్న కొడుకు మృతితో తల్లి కన్నీరుమున్నీరుగా రోదించడం స్థానికులను కలచివేసింది. (కొత్తగా 16 వైద్య కళాశాలలు)
Comments
Please login to add a commentAdd a comment