నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. శరీరంలోని అన్ని అవయవాలు బాగున్నా కొందరు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా ఉంటారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రెండు చేతుల్లేవు. అయినా ఏ మాత్రం కుంగిపోలేదు. తనకు జీవితం లేదని భావించలేదు. కష్టపడి పనిచేస్తూ తల్లిని పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీకి చెందిన పందిళ్లపల్లి శేషయ్య, రమణమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు పిల్లలు. రెండో సంతానమైన మల్లికార్జున రెండు చేతులు లేకుండా జన్మించాడు. దీంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. ఎలా బతుకుతాడో?, ఎలాంటి అవమానాలను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందారు. మల్లికార్జున చిన్నతనంలో ఉండగా తండ్రి అనారోగ్యంతో మరణించాడు.
దీంతో అతను ఎవరికీ భారం కాకుండా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. చదువుకు స్వస్తి పలికి పనులు చేయడం ప్రారంభించాడు. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. అలాగే ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ అందజేస్తోంది. వీటితో తల్లి రమణమ్మను పోషిస్తున్నాడు. మల్లికార్జున తన పనులు తానే చేసుకుంటాడు. కష్టమైన పనులకు మాత్రం తల్లి సాయం తీసుకుంటాడు.
తల్లి రమణమ్మతో మల్లికార్జున..
సాయం చేస్తే అంగడి పెట్టుకుంటా
సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసి విక్రయిస్తుంటా. అలాగే నాకు, మా అమ్మకు వచ్చే పింఛన్‌తో జీవిస్తున్నాం. జీవనభృతి కోసం శాశ్వతంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి భావిస్తున్నా. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే చిల్లర దుకాణాన్ని ప్రారంభించి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుంటా.
– పందిళ్లపల్లి మల్లికార్జున, దివ్యాంగుడు
Comments
Please login to add a commentAdd a comment