చంద్రబాబు, లోకేశ్‌పై ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ధ్వజం
దాడులు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలతో రాష్ట్రం అరాచకంగా మారింది
రషీద్ హత్య టీడీపీ అరాచకాలకు పరాకాష్ఠ
టీడీపీ దాడులపై ఢిల్లీ స్థాయిలో గళమెత్తుతాం
పులివెందుల: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్‌కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారి రెడ్‌బుక్ రాజ్యాంగం మనిషి స్వేచ్ఛగా బతకాలన్న ప్రాథమిక హక్కును హరిస్తోందన్నారు. ఓవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, మరోవైపు అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం, హత్యలతో రాష్ట్రం అరాచకంగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలపై ఢిల్లీ స్థాయిలో గళమెత్తుతామని తెలిపారు.
అవినాశ్ రెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఇటీవల అధికార పార్టీ దాడిలో గాయపడిన అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని పరామర్శించి, వారిలో ధైర్యం కల్పించి, వైఎస్ జగన్ తరపున భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని చెప్పామన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారన్నారు. వినుకొండలో వందల మంది చూస్తుండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ చేతులు, తర నరకడం టీడీపీ నేతల అరాచకానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వేంపల్లెలో వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని 20 మంది టీడీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్‌తో విచక్షణా రహితంగా కొట్టారని, స్టిక్స్ విరిగిపోతే బండరాళ్లతో తలపై దాడి చేశారన్నారు. బుధవారం పుంగనూరులో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి పైనా రాళ్లతో దాడులు చేశారన్నారు. తాము గత ఐదేళ్లు ఇదే విధంగా ఆలోచించి ఉంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవారా అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఏ రోజూ అరాచకాలను ప్రోత్సహించలేదని, ఎంతసేపూ కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించడంపైనే దృష్టి పెట్టిందని తెలిపారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు ఉన్న సెక్యూరిటీని 80 శాతం తొలగించారన్నారు. సెక్యూరిటీని తొలగించినా, ఇంకా ఏమి చేసినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఆపలేరని ఆయన తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత పులివెందులలో 70వేల టన్నుల ఇసుకను టీడీపీ వారు దోచేశారని చెప్పారు. మైన్స్, బార్ల పైనాపడిపోతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment