మంత్రి మండలి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా రూ.1.25 లక్షల కోట్లతో పది పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 5వ తేదీన సీఎం అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పరిశ్రమల శాఖ పరిధిలో నాలుగు, విద్యుత్ శాఖ పరిధిలో ఐదు, పర్యాటక శాఖ పరిధిలో ఒకటి చొప్పున మొత్తంగా పది పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 40 వేల మందికి, పరోక్షంగా 60 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.
జడ్జిలకు వ్యక్తిగత కార్యదర్శి
► రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులకు, రిజిస్టార్లకు 71 కోర్టు మాస్టర్లు, పర్శనల్ సెక్రటరీ పోస్టుల నియామకానికి ఆమోదం. నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటుకు ఆమోదం. ఆయా లోక్ అదాలత్‌ల పరిధిలో 40 పోస్టుల భర్తీ.
► ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన 175 మంది ఖైదీలతో పాటు మరో 20 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలన్న నిర్ణయానికి ఆమోదం.
► నంద్యాల, నెల్లూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, విశాఖపట్నం జిల్లాలలో వివిధ ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలకు అవసరమైన ప్రభుత్వ భూములను కేటాయించాలన్న నిర్ణయానికి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతిపాదనల మేరకు పారిశ్రామిక పార్కులు, వివిధ సంస్థలకు భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
► శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది.
► శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బంజారా సేవా సంఘానికి ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు అవసరమైన 44 సెంట్ల భూమి కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
► వైఎస్సార్ జిల్లా అమీన్ పీర్ దర్గాకు వివిధ సర్వే నెంబర్లలో 16.86 ఎకరాల స్థలాన్ని ఈద్గా, అనాథ సదనం కోసం కేటాయిస్తూ నిర్ణయం. ఎకరా రూ.లక్ష చొప్పున కేటాయించాలని నిర్ణయం.
► వైఎస్సార్ జిల్లా కడప మండలం చిన్న చౌక్‌లో 134 ఎకరాలను డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్ట్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కోసం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం భూములిచ్చిన 379 మంది ఆసైనీ పట్టాదారులకు అసైన్‌మెంట్ కమిటీ నిర్ణయం మేరకు పరిహారం చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
► ప్రకాశం జిల్లా రుద్రసముద్రంలో సోలార్ పపర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 1454.06 ఎకరాల భూమిని ఏపీజీఈసీఎల్‌కు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్
► అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు ప్రధాన కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం.
► విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో రహదారులు, భవనాల శాఖకు 23.73 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ నిర్ణయం.
► రాష్ట్ర వ్యాప్తంగా 679 రెవెన్యూ మండలాల్లో ఏఆర్‌ఐ (అడిషనల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) లేదా సీనియర్ అసిస్టెంట్ పోస్టులను డిప్యూటీ తహసీల్దార్ పోస్టు కేడర్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భూముల రీ–సర్వే, గ్రామ కంఠం భూముల రికార్డింగ్ ప్రక్రియ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. సర్వే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు లేదా గరిష్టంగా రెండేళ్లు వర్తించేట్టుగా లేదా రెండింటిలో ఏది ముందు పూర్తయితే ఆ మేరకు ఈ నిర్ణయం అమలు.
► వైఎస్సార్ జిల్లా చిన్నచౌక్‌లో 17 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 95 ఎకరాల భూమిని మున్సిపల్ శాఖకు కేటాయిస్తూ నిర్ణయం.
► శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, తాటితోట గ్రామాల్లో 304.15 ఎకరాల భూమిని 500 మెగావాట్ల పంప్డ్, హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంటు ఏర్పాటు కోసం ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి కేటాయింపు.
► ఆంధ్రప్రదేశ్ టెనెన్సీ యాక్ట్ – 1956కు సంబంధించిన ప్రతిపాదన బిల్లుకు ఆమోదం.
► వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో వీరబల్లి మండలం, ఒంగిమల్లలో 1800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్లాంటు ఏర్పాటుకు ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం.
► అరబిందో రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ 1600 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం.
► ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ ఆమోదం.
► గ్రీన్‌కోకు సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
► కర్నూలు జిల్లా నంద్యాలలో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న 700 మెగావాట్ల సోలార్ పవర్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన భూమి కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
► రెన్యూవబుల్ ఎక్స్‌పోర్ట్ పాలసీ 2020 సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం.
రాష్ట్రంలో పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
► ప్రస్తుత ఖరీఫ్ సందర్భంగా రాష్ట్రంలో 438 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావడంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఈ ఖరీఫ్‌లో 82 శాతం నాట్లు పూర్తయ్యాయని, మిగిలిన చోట్ల వ్యవసాయ పనులు ఊపందుకున్నట్టు మంత్రివర్గం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. రాష్ట్రంలో 2014–15 నుంచి 2018–19 వరకు సగటున 153 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగ్గా.. 2019 నుంచి వరుసగా మూడేళ్లు సగటున ఏడాదికి 13 లక్షల టన్నులకు ఉత్పత్తులు పెరిగి 166.73 లక్షలకు చేరడంపై మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది.
► ప్రస్తుత ఖరీఫ్‌లో సబ్సిడీ ద్వారా 5.05 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేశామని, ఖరీప్ అవసరాలకు 19 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, 18 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు.
► రాష్ట్రంలో ఎక్కడా ఎరువులకు కొరత లేదని, ఆర్‌బీకేల ఏర్పాటు ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు చర్చ జరిగింది. ఆర్బీకే విధానాలను ప్రపంచ బ్యాంకు ప్రశంసించడంపై మంత్రివర్గం ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఏడాదిలో వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రూ.2,235 కోట్లు ఖర్చు చేస్తోంది.
► మరోవైపు కోవిడ్ పరిస్థితుల్లోనూ మన రాష్ట్రం దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా 11.43 శాతం వృద్ధి రేటు సాధించడంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రివర్గం అభినందనలు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment