టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గతానికి పూర్తి భిన్నంగా అవినీతి లేకుండా, పక్షపాతం చూపకుండా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేశాం. మంచి జరిగిన కుటుంబాల వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఆర్బీకేలను తెచ్చి రైతన్నలు గ్రామం దాటాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఒక్కటీ అందచేస్తున్నాం. ఇంటి వద్దే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నాం.
గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, నాడు–నేడుతో కార్పొరేట్‌కు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలతో పల్లెల ముఖచిత్రం సంపూర్ణంగా మారుతోంది. డిసెంబర్ నాటికి మిగతా పనులు కూడా పూర్తవుతాయి. ఇవన్నీ రావటంతో గ్రామాల రూపురేఖలు మారి సరికొత్త చిత్రం ఆవిష్కృతమవుతోంది. చేసిన మంచి కళ్లెదుటే కనిపిస్తోంది. వాటిని చూసి మనమే అధికారంలో ఉండాలని ప్రతి చోటా ప్రజలు కోరుకుంటున్నారు.
అలాంటప్పుడు 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ కచ్చితంగా సాధ్యమే. మనం చేయాల్సిందల్లా ప్రజల్లోకి వెళ్లి చేసిన మంచిని వివరించాలి. రేపు ఎన్నికల్లో గెలిచాక వచ్చే 30 ఏళ్లూ మనమే అధికారంలో ఉంటాం’ అని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మీరూ, నేనూ కలసికట్టుగా అడుగులు వేసి క్లీన్ స్వీప్ చేద్దామని దిశానిర్దేశం చేశారు.
వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రావాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతోనూ విడివిడిగా మాట్లాడి వారి యోగక్షేమాలను ఆరా తీశారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం టెక్కలి అభివృద్ధి కోసం చేసిన పనులను సీఎం జగన్ గణాంకాలతో సహా వివరించారు. టెక్కలి నియోజకవర్గంలో భావనపాడు పోర్టు రానుందని, అందుకోసం సుమారు రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్‌లో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులను డిసెంబరులో పునరుద్ధరిస్తామన్నారు.
► మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. చాలా కాలం ఉంది కదా.. ఇవాళ్టి నుంచే ఎన్నికల గురించి ఆలోచన చేయాలా? అని మీరు అనుకోవచ్చు. 18 నెలల తర్వాత ఎన్నికలున్నా ఆ అడుగులు ఇవాళ్టి నుంచి కరెక్ట్‌గా పడితేనే క్లీన్‌స్వీప్ చేయగలుగుతాం.
► ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే మూడేళ్ల నాలుగు నెలల వ్యవధిలో అక్షరాలా రూ.1,026 కోట్లను గడప గడపకూ చేర్చగలిగాం. ఎవరెవరికి ఇచ్చామో వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. అర్హులెవరూ మిస్ కాకుండా, సంతృప్తస్థాయిలో వలంటీర్లు, సచివాలయం ద్వారా వీటిని చేర్చాం. ప్రతి నియోజకవర్గం, గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే ప్రతి గ్రామంలోనూ 87 శాతం ఇళ్లకు మంచిచేశాం.
► ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ ప్రతి గడపకూ వెళ్లాలి. మనం చేసిన మంచిని గుర్తు చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి.
► టెక్కలి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు78కి 74, ఎంపీపీలు, జడ్పీటీసీలు మొత్తం నాలుగు మనమే గెలిచాం. ఒక్క టెక్కలిలోనే కాదు.. కుప్పంలో కూడా ఇలాగే మంచి విజయాలు నమోదుచేశాం. మనం తెచ్చిన మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
► మనలో మనకు ఎన్ని విభేదాలున్నా పక్కనపెట్టి బిగ్గర్ పిక్చర్ గుర్తు తెచ్చుకుందాం. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం.
► ఈ రోజు మన గ్రామంలోనే ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలవుతుంది.
► మూడున్నరేళ్లుగా ప్రజలకు చేస్తున్న మంచిని వివరించడానికే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టాం. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోంది. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment