గుంటూరు, సాక్షి: ఎమ్మెల్సీ ఎన్నికలో మెజార్టీ లేకుండా టీడీపీ పోటీచేస్తుందంటే దాని అర్థం ఏంటి?.. కొనుగోలుచేసి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవాలని చూస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో నియోజకవర్గం ఎంపీటీసీ, జడ్పీటీసీలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడన్నదానిపై సమాజం చూస్తుంది. కాని చంద్రబాబులో అలాంటి విలువలు లేవు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడితో యుద్ధంచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. సూపర్ సిక్స్ హామీ ఇచ్చాడు, కాని మోసం చేస్తున్నాడు. నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అని ప్రచారం చేశాడు. ఎన్నికల్లో చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. మనం అబద్ధాలు చెప్పి, ఆ కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకుంటే మనకు ఏం సంతృప్తి వస్తుంది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
‘‘కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేల వరకూ తిరిగి గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా?. జగన్ మాట చెప్పాడు, కాని అమలు చేయలేదనే మాట అనిపించుకోకూడదు. మన పార్టీ పేరు చెప్తే కార్యకర్తలు, నాయకులు కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు కూడా ఇలాంటి హామీలు ఇచ్చి, మాట తప్పాడు. ఇది ప్రజలకు అర్థమైంది, అందుకే 2019లో ఆయన డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019లో మనం అధికారంలోకి వచ్చి ఇచ్చిన ప్రతిమాటనూ నిలబెట్టాం. ఇవ్వాల్టికీ ప్రజల దగ్గరకు వెళ్లి మనం ఇది చేశామని చెప్పుకోగలిగాం’’ అని వైఎస్ జగన్ చెప్పారు.
‘‘కష్టకాలంలో మనం ఎలా ఉంటున్నామనేది ప్రజలు చూస్తారు. ప్రజలకు మనకు శ్రీరామ రక్షగా ఉంటారు. విలువలు కోల్పోయిన రోజు మనకు ప్రజలనుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. విలువలు, విశ్వసనీయతగా మనం అడుగులేశాం. కష్టాలు లేకుండా ఏదీ ఉండదు. చీకటి తర్వాత వెలుగు రాక మానదు. పలానా వాడు మన నాయకుడు అని చెప్పుకునే రీతిలో మనం ఉండాలి. జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా.. పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే.. బిర్యానీ పెడతానని మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది’’ అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
‘‘స్కూళ్లు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. గడపవద్దకే మనం సేవలు అందిస్తే ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పాలన దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది. వ్యవసాయం దెబ్బతింది. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలు, మోసాలని తేలిపోతున్నాయి. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా అంది ఉండేది. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే.. కాలెండర్ ప్రకారం పథకాలు వచ్చేవి. తేడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు మనం దగ్గరంగా ఉంటే చాలు. ప్రజలే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకూ నేను భరోసా ఇస్తున్నాను. వీటిని ఎదుర్కొని ఉన్నప్పుడు ప్రజలు మనల్ని కచ్చితంగా ఆదరిస్తారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా నన్ను 16 నెలలు జైలుకు పంపారు. కాని ప్రజలకోసం మనం చేసిన పోరాటాలతో మళ్లీ మంచి స్థానంలో పెట్టారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ధనబలం, అధికార బలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధర్మం, అన్యాయం సాగదన్న సందేశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరినీ కొనలేరనే మెసేజ్ పంపాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.
‘‘విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీకి చుక్కెదురు అంటూ ఈనాడు పత్రిక ఏదో ఘనకార్యం జరిగినట్టుగా రాసింది. మెజార్టీలేని చోట ప్రలోభాలు పెట్టి, పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నందుకు ఘనకార్యమా?. దొంగతనం, హత్యలు చేస్తే దాన్ని కూడా ఘనకార్యంగా రాసే స్థితిలో ఉన్నారు. చంద్రబాబు ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఘన కార్యాలుగా రాస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పు చాలా కీలకం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment