మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ | YS Jagan Mohan Reddy special focus on school children mid day meal | Sakshi
Sakshi News home page

మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ

Published Sat, Apr 20 2024 3:47 AM | Last Updated on Sat, Apr 20 2024 3:47 AM

YS Jagan Mohan Reddy special focus on school children mid day meal - Sakshi

బడి పిల్లల మధ్యాహ్న భోజనంపై జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

రోజుకొక మెనూతో నిత్యం పాఠశాలలోనే పౌష్టికాహారం  

ఒక్కోరోజు ఒక్కో మెనూతో రుచికరం 

వారంలో ఆరు రోజులు.. 16 రకాల పదార్థాలతో మెనూ..  

నీళ్ల సాంబారు, ముద్ద అన్నంతో సరిపెట్టిన బాబు సర్కారు  

పిల్లల పౌష్టికాహారం కోసం ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా మెనూ రూపకల్పన 

రోజూ సగటున 34.90 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం  

ఐదురోజులు కోడిగుడ్డు, మూడు రోజులు చిక్కీ, రాగిజావ 

మూడు దశల్లో ఆహార నాణ్యత పరిశీలన  

పిల్లల్లో రక్తహీనత లేకుండా మెనూ పదార్థాల తయారీ 

ఐదేళ్లలో గోరుముద్దకు రూ.7,244.6 కోట్ల బడ్జెట్‌ 

బాబు పాలనలో ఏడాదికి రూ.450 కోట్ల బడ్జెట్‌ మాత్రమే  

జగనన్న గోరుముద్దకు జాతీయ స్థాయిలో ప్రశంసలు 

గతం
ముద్దన్నం...నీళ్ల సాంబారు... అదీ అరకొర... ఇదీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బడిపిల్లలకు అందించే మధ్యాహ్న భోజన తీరు. ఆయన పాలనంటేనే కరువు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య రాష్ట్రంలో చాలావరకు కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలకు ఉపాధి కూడా కరువైంది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే.. అక్కడా ఆకలితో అలమటించేలా చేశారు.

రోజూ ఒకేరకమైన మెనూవల్ల దానిని తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఈ అన్నం తిన్నవారికి కడుపునొప్పి సర్వ సాధారణం. కౌమారదశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచి్చన పిల్లల్లో 30 శాతంలోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున రూ.450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించే వారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు రూ.3.59 మాత్రమే కేటాయించారు. అదీ ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. 

ప్రస్తుతం 
పాలనపై చిత్తశుద్ధి... విద్యారంగంపై సరికొత్త విజన్‌గల ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు అమలుచేశారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ‘గోరుముద్ద’ పథకాన్ని స్వయంగా రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు.

ఒక్కో విద్యార్థి వంట ఖర్చును రూ.8.57 పెంచారు. బడ్జెట్‌ కూడా ఏడాదికి సగటున రూ.1,400 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోరి్టఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యంతో అన్నం, వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు ఐదు రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోను శ్రద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలు పిల్లలకు వడ్డిస్తున్నారు. ఉపాధ్యాయులు మొబైల్‌ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్‌ మానిటరింగ్‌ సిస్టం ఫర్‌ మిడ్‌ డే మీల్స్‌ అండ్‌ శానిటేషన్‌’ (ఐఎంఎంఎస్‌) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేస్తున్నారు.

భోజనం చేశాక, వంటపై విద్యార్థులే స్వయంగా రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల్లో 43 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రతిరోజు హాజరైనవారిలో సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ యాప్‌ ద్వారా తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు.   

సోమవారం: హాట్‌ పొంగల్,  ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్‌ పులావు, గుడ్డు కూర, చిక్కీ 
మంగళవారం:ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు 
బుధవారం: వెజిటబుల్‌ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌ బాత్‌/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు 
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ 
శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్‌ పొంగల్‌

‘గోరుముద్ద’కు జాతీయ అవార్డు 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద అమలుకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. రక్తహీనత నివారణ, మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయడాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి గతేడాది నవంబర్‌లో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి రాష్ట్రానికి అందజేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్ల పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ(వేరుశనగ బార్‌) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ జోయా అలీ రిజ్వీ అవార్డు వేడుకలో అభినందించడం గమనార్హం.  

వంట ఏజెన్సీలకు ఖర్చులు పెంపు 
గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. 2014–18 వరకు వంటపాత్రల సరఫరా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,617 పాఠశాలలకు రూ.41 కోట్ల వ్యయంతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది.

గత ప్రభుత్వం 2014–18 మధ్య పిల్లల భోజన ఏడాది వ్యయం రూ.450 కోట్లు అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది సగటున రూ.1449 కోట్లకు పెంచింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ.3.59 నుంచి రూ.6.51 మధ్య మాత్రమే కాగా.. ప్రస్తుతం ఆ ఖర్చు రూ.8.57కు పెంచి చెల్లిస్తున్నారు.

ఏటా సగటున రూ.1449 కోట్ల ఖర్చు 
ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది ఒంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘గోరుముద్ద’కు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు.  ప్రభుత్వ బడుల్లోని 43 లక్షల మంది విద్యార్థుల కోసం రోజుకో మెనూ చొప్పున 16 రకాల ఐటమ్స్‌తో ‘జగనన్న గోరుముద్ద’ అందిస్తున్నారు.

ఉదయం 9.30 గంటలకే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. ‘గుడ్‌’ అని ‘నాట్‌ గుడ్‌’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. గత ప్రభుత్వంలో నీళ్ల సాంబారు, ముద్ద అన్నం కోసం ఏటా రూ.450 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే.. గోరుముద్ద కోసం ప్రభుత్వం ఏటా సగటున రూ.1449 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.7,244.6 కోట్ల నిధులు వెచి్చంచింది. 

పౌష్టికాహారం కోసం ఫోర్టిఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యం 
పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు వారంలో మూడురోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడురోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఫోర్టిఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే మెనూ పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు, దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీలు పాత్రలు అందించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement