
సాక్షి, అమరావతి: అమరావతిలో నిర్మాణాలను పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రణాళికను సిద్ధంచేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీపై (ఏఎంఆర్‌డీఏ) గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న వాటి వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో చర్చించారు. అలాగే, హ్యాపీనెస్ట్ బిల్డింగులను కూడా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు సీఎస్ నీలం సాహ్ని, ఏఎంఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం తదితర అధికారులు పాల్గొన్నారు.
అమరావతిని అభివృద్ధి చేస్తాం : బొత్స
అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపుతామని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. శాసనసభ ఆవరణలో గురువారం శాసన మండలి అభ్యర్థి పెనుమత్స సూర్యనారాయణ రాజు (సురేష్‌బాబు) నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బొత్స మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషిచేస్తున్నారని కొనియాడారు. అమరావతిలో రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇచ్చి ఆభివృద్ధి చేస్తామన్నారు. (రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే..)
అలాగే, అక్కడ నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తిచేస్తామని.. వీటిని ఏం చేయాలి, ఎలా ఉపయోగించాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఈ ప్రాంత రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలందరికీ నమ్మకం కలిగేలా అమరావతిని అభివృద్ధి చేసి చూపుతామన్నారు. ప్రతిపక్షం మాటలను నమ్మొద్దని ప్రజలను మంత్రి బొత్స కోరారు. చంద్రబాబు ప్రతిపక్ష బాధ్యతను విస్మరించారని.. అధికార, ప్రతిపక్షం మొత్తం తామేనన్నారు. ప్రతిపక్షాలు కోర్టు ద్వారా ప్రభుత్వ చర్యలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. (ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది: కోన రఘుపతి)
త్వరలో నూతన రాజధాని శంకుస్థాపన
రాష్ట్ర నూతన రాజధాని పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు దేశంలోని పెద్దలందరినీ పిలుస్తామని.. అన్ని రాష్ట్రాల వారికి ఆహ్వాన పత్రాలను అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment