కోవిడ్‌ సమస్యకు వాక్సినేషన్ తుది పరిష్కారం: సీఎం జగన్‌ | YS Jagan Review Meeting On Corona Prevention Vaccination | Sakshi
Sakshi News home page

అది మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి: సీఎం జగన్‌

Published Fri, Apr 16 2021 7:10 PM | Last Updated on Fri, Apr 16 2021 10:27 PM

YS Jagan Review Meeting On Corona Prevention Vaccination‌ - Sakshi

సాక్షి, అమరావతి : కోవిడ్‌ నియంత్రణకు తమ వద్ద ఉన్న అస్త్రం వ్యాక్సినేషన్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే వ్యాక్సిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అదే విధంగా కోవిడ్‌ టెస్టులు, ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తప్పనిసరిగా వాక్సిన్‌ వేయాలని, ఎక్కడా కోవిడ్‌ వాక్సిన్‌ను వృథా చేయొద్దన్నారు. ఈ మేరకు కోవిడ్‌19 నియంత్రణ, నివారణ, కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.

ఇంకా సీఎం ఏమన్నారంటే.. ‘కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలందించాలి. ఐసొలేషన్‌కు ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి. శానిటేషన్, మెడికేషన్, ఫుడ్‌ క్వాలిటీ ఉండాలి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాలి. రోగిని ఎప్పటికప్పుడు చెక్‌ చేయడం కూడా మన బాధ్యత. 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలి. కోవిడ్‌ సమస్యలకు ఈ నెంబరు ఏకైక గమ్యంగా ఉండాలి. గ్రీవెన్స్‌ కోసం కేటాయించిన 1902 నెంబర్‌ను అటెండ్‌ చేయాలి. ఏ సమస్యపై ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిష్కరించాలి. 

(చదవండి: ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ)

వారి సేవలు ప్రశంసనీయం..
మనం ఎందుకు సమావేశమయ్యామన్నది మీ అందరికి తెలుసు. కోవిడ్‌ కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. గత ఏడాది నుంచి జిల్లా యంత్రాంగాలు చాలా బాగా పని చేస్తున్నాయి. కోవిడ్‌ నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు చాలా బాగా పని చేస్తున్నారు. వారి సేవలు ప్రశంసనీయం. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో తిరిగి పని చేయాల్సిన అవసరం వచ్చింది. 

వాక్సినేషన్‌ ఒక్కటే..
వాక్సినేషన్‌ అనేది శాశ్వత పరిష్కారం. అయితే అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఆ డోస్‌లు కేంద్రం సరఫరా చేయాల్సి ఉంది. నెలకు 7 కోట్ల వ్యాక్సీన్లు ఉత్పత్తి అవుతుండగా, రోజుకు 23 లక్షల డోస్‌లు తయారవుతున్నాయి. వాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాపై పూర్తి నియంత్రణ కేంద్రానిదే. దీంతో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు వీలైనంత వరకు అందరికి వాక్సిన్‌ ఇవ్వడంతో పాటు, మరోవైపు కోవిడ్‌ వ్యాప్తిని అరి కట్టాల్సి ఉంది.

పరీక్షలు–పాజిటివిటీ
రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 1.55 కోట్ల పరీక్షలు చేయగా 9.37 లక్షల కేసులు పాజిటివ్‌గా తేలాయి. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.03 శాతం కాగా, రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది. అదే సమయంలో దేశ సగటు చూస్తే రికవరీ రేటు 88.9 శాతం మాత్రమే. రాష్ట్రంలో టయర్‌–1 వంటి నగరాలు లేకపోయినా మనం మనకున్న వసతులతో బాగా పని చేయగలిగాం. కోవిడ్‌ కేసులను గుర్తించి పరీక్షలు చేయడంతో పాటు, అవసరమైన చికిత్స చేశాం. ఈ ప్రక్రియలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలతో పాటు, సచివాలయాలు కీలకపాత్ర పోషించాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.78 శాతంగా ఉండగా, జాతీయ స్థాయిలో అది 1.24 శాతంగా ఉంది. ఇవన్నీ మనకున్న పాజిటివ్‌ అంశాలు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. గత డిసెంబరు నుంచి ఏప్రిల్‌ మధ్య వరకు పాజిటివ్‌ రేటు 7.77 శాతం నమోదైంది. ఇన్ఫెక్షన్, పాజిటివిటీ రేటు చిత్తూరులో ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది.

లాక్‌డౌన్‌ లేకుండా
ఇది కష్టకాలం కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలి. లాక్‌డౌన్‌ విధించకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలు దెబ్బ తినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ వి«ధించడం లేదు. గత ఏడాది చూశాం. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు.

ఫోకస్డ్‌ టెస్టింగ్‌
ఇప్పుడు మనకు ఉన్న అస్త్రం వాక్సిన్‌. అందువల్ల లాక్‌డౌన్‌ అన్న మాట రాకుండా కోవిడ్‌ నియంత్రణపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. కాబట్టి, ఫోకస్డ్‌ టెస్టింగ్‌. అంటే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను టెస్టు చేయడం. దాన్నే ఫోకస్డ్‌ టెస్టింగ్‌ అంటారు. అదే విధంగా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టు చేయించుకోవాలంటే, వారికి కూడా వెంటనే చేయాలి. ఆ విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి. పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లలో టెస్టులు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. అక్కడ శాంపిల్స్‌ సేకరించాలి.

గ్రామీణ ప్రాంతాల్లో
పాజిటివిటీ కేసుల కాంపోజిషన్‌ చూస్తే 62 శాతం పట్టణ ప్రాంతాల్లో, 38 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. అయితే మరణాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. పాజిటివ్‌ కేసుల్లో మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం చాలా ఆలస్యంగా ఆస్పత్రులకు వెళ్లడం. అందువల్లనే మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.

అవగాహన కల్పించాలి
కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. అందుకోసం వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఉపయోగించాలి. అవసరం అనుకున్న వారికి ఫీవర్‌ టెస్టులు చేయాలి. అక్కడ కూడా వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీల వైద్యులను వినియోగించండి. మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చాలా కీలకం. సర్వేలో కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి గుర్తించిన వెంటనే, పరీక్షలు చేయాలి. అలా చేస్తేనే కోవిడ్‌ ఉందా లేదా అని తెలుస్తుంది.

ఎప్పటికప్పుడు సమీక్ష
కలెక్టర్లు దృష్టి పెట్టాల్సిన మరో అంశం.. జాయింట్‌ కలెక్టర్ల (డెవలప్‌మెంట్‌)తో ప్రతి రోజూ మానిటర్‌ చేయాలి. ఇక జేసీలు ప్రతి నిమిషం, ప్రతి గంటకు పరిస్థితిని, ఆస్పత్రుల ప్రిపేర్డ్‌నెస్‌ను సమీక్షించాలి. కలెక్టర్లు ప్రతి రోజూ సమీక్షించాలి.

వాటిని పెంచాల్సి ఉంది
గత ఏడాది సెప్టెంబరులో 261 ఆస్పత్రులను కోవిడ్‌ చికిత్స కోసం గుర్తించడం, తీసుకోవడం జరిగింది. అందులో సగం ప్రభుత్వ ఆస్పత్రులు కాగా, మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రులు. 37,441 బెడ్లు వాటిలో అందుబాటులో ఉండగా, 17,921 నాన్‌ ఐసీయూ ఆక్సీజన్‌ బెడ్లు ఉండేవి. కాగా, ఇప్పుడు 108 ఆస్పత్రులను కోవిడ్‌ చికిత్స కోసం ఎంప్యానెల్‌ చేయడం జరిగింది. అందులో కూడా సగం ప్రభుత్వ ఆస్పత్రులు. వాటిలో 15,669 బెడ్లు ఉండగా, 4,889 ఆక్యుపైడ్‌ బెడ్లు. కాగా ఇప్పుడు గత ఏడాది సెప్టెంబరులో ఉన్న విధంగా బెడ్లు కావాలి మనకు. ఆ మేరకు లక్ష్యం నిర్దేశించుకుని బెడ్లు పెంచాలి. ఇప్పటికిప్పుడు మనకు అవసరమైన ఐసీయూ బెడ్లు, ఆక్సీజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని ఇంకా పెంచుకోవాల్సి ఉంది.

అవన్నీ మన భాద్యత
మనం ఆస్పత్రులను తీసుకోవడం అంటే, వాటిని ఓన్‌ చేసుకోవడం. ఆక్సీజన్‌ సదుపాయాలు. అందుకు తగిన మౌలిక వసతులు ఉన్నాయా? అన్నది చూడాలి. ఆస్పత్రిలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటు.. ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోండి. దీన్ని కలెక్టర్లు గుర్తించాలి.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లు
ఇంట్లో ఐసొలేషన్‌ కోసం ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి. అక్కడ కూడా శానిటేషన్, మెడికేషన్, ఫుడ్‌ క్వాలిటీ, మందులు అందుబాటులో ఉంచడం, ఎప్పటికప్పుడు చెక్‌ చేయడం కూడా మన బాధ్యత. రాష్ట్రంలో ఇప్పుడు 26 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 13,500 బెడ్లు ఉండగా, మనం వాటి సంఖ్యను గత సెప్టెంబరు నాటితో చూస్తే, అంటే 50 వేల బెడ్లకు పెంచాల్సిన అవసరం ఉంది’.

హోం ఐసొలేషన్‌
హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి సంబంధించి.. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సర్వే ద్వారా కోవిడ్‌ కేసుల నిర్ధారణ చేసిన తర్వాత లేదా 104 కాల్‌ సెంటర్‌ తర్వాత కోవిడ్‌ కేసు గుర్తిస్తే, వెంటనే ఆ ఇంటిని మార్క్‌ చేసి, ఆ ఇంట్లోని రోగికి వెంటనే కోవిడ్‌ కిట్‌ ఇవ్వడంతో పాటు, రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలి. మూడు రోజులకు ఒకసారి ఏఎన్‌ఎంలు ఆ ఇంటిని సందర్శించాలి. వారు పరిస్థితి చూసి, డాక్టర్‌ ఆ ఇంటికి వెళ్లేలా రిక్వెస్టు చేయాలి. రోగి పరిస్థితి బాగా లేకపోతే, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించడం లేదా ఆస్పత్రిలో చేర్పించడంపై నిర్ణయం తీసుకుని అమలు చేయాలి’.

ఆస్పత్రులలో అవి తప్పనిసరి
అన్ని ఆస్పత్రులలో సీసీ టీవీలు ఉండాలి. అది తప్పనిసరి. అలాగే హెల్ప్‌ డెస్కులు కూడా ఉండి తీరాలి. అవి రోజంతా పని చేయాలి. ఆ రెండింటి ద్వారా ఆయా ఆస్పత్రులలో శానిటేషన్, ఫుడ్‌ క్వాలిటీ, వైద్యుల అందుబాటు, మందుల సరఫరా, ఆక్సీజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. గ్రామాల నుంచి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలో కోరితే, వెంటనే 108 సర్వీసులు వెళ్లి రోగులను తీసుకోవాలి’.

104 కాల్‌ సెంటర్‌
104 కాల్‌ సెంటర్‌ను ఓన్‌ చేసుకోవడం, కలెక్టర్లు ఆ పని చేయనంత వరకు, మనం తగిన విధంగా పని చేయలేం. 104కు ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే అటెండ్‌ చేయాలి. రియాక్ట్‌ కావాలి. అందువల్ల అవి ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవడానికి, రోజుకు రెండు, మూడు మాక్‌ కాల్స్‌ను కలెక్టర్లు చేయాలి. ఒక వేళ ఆ కాల్‌ సెంటర్‌ సక్రమంగా పని చేయడం లేదని గుర్తిస్తే, వెంటనే అన్నీ సరిదిద్దాలి. కాబట్టి 104 కాల్‌ సెంటర్లు సమర్థంగా పని చేసేలా చర్యలు చేపట్టాలి. 104 నెంబర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే వైద్యులు అందుబాటులోకి వస్తారు. రోగితో మాట్లాడి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఇది సక్రమంగా జరగాలి. బెడ్‌ కావాలంటే, ఫోన్‌ చేసిన 3 గంటల్లో కేటాయించాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కూడా వెంటనే కోవిడ్‌ కిట్‌ ఇవ్వాలి. అది కూడా 3 గంటల్లో పూర్తి కావాలి. అదే విధంగా 108 సర్వీసులో రోగిని అంతే సమయంలో తరలించాలి. 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వచ్చిన వెంటనే, సిబ్బంది వెళ్లాలి. పీహెచ్‌సీ నుంచి సిబ్బంది కదలాలి. 3 గంటల్లో అవసరమైన పరీక్షలు పూర్తి చేయాలి. కోవిడ్‌ కేర్‌కు సంబంధించి 104 నెంబరు మస్ట్‌ బి సింగిల్‌ డెస్టినేషన్‌. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.

ఉచితంగా సేవలు
కోవిడ్‌ రోగికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రులలో రోగులకు మంచి వైద్య సేవలందించాలి. అవి కూడా పూర్తిగా ఉచితం. ఇది పక్కాగా అమలు కావాలి. అదే విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కూడా అవసరమైన కోవిడ్‌ చికిత్సలు చేయాలి. అవి కోవిడ్‌ ఎంప్యానెల్‌లో లేనప్పటికీ. రెమ్‌డెస్‌విర్‌ వంటి ఇంజెక్షన్లు, నాణ్యతతో కూడిన డ్రగ్స్‌ అన్ని ఆస్పత్రులలో అందుబాటులో ఉండాలి. ఆ విధంగా కలెక్టర్లు అన్నీ చూడాలి.

కొరడా ఝలిపించండి
ఇదే కాకుండా, ఆరోగ్యశ్రీ, కోవిడ్‌ ఆస్పత్రుల జాబితాలో లేని ప్రైవేటు ఆస్పత్రులలో ఇష్టం వచ్చినట్లు ఫీజులు, రుసుములు వసూలు చేయకుండా చూడాలి. అందుకోసం జీఓ నెం. 77, 78 ప్రకారం పక్కాగా అమలు చేయాలి. ఎక్కడైనా రోగుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకునే అధికారం మీకు ఉంది. కోవిడ్‌ కష్టకాలంలో ఆస్పత్రులు రోగులను దోచుకోకుండా చూడాలి. అందు కోసం కఠినంగా వ్యవహరించండి.

ప్రతి రోజూ రివ్యూ
ఆక్సీజన్‌ అందుబాటు గురించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి. ఎక్కడ ఆక్సీజన్‌ అవసరమున్నా, వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు, ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రతి రోజూ రివ్యూ చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌. మీకు ఏ అవసరం ఉన్నా వెంటనే వారిని సంప్రదించండి. ప్రతి జిల్లా బాధ్యతను ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి అప్పగించాం. వారు ఎప్పటిప్పుడు పరిస్థితి సమీక్షిస్తారు. మరోవైపు సీఎంఓ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారు.

సమస్యకు అదే పరిష్కారం
ఇంకా, వాక్సినేషన్‌. కోవిడ్‌ సమస్యకు ఇదే తుది పరిష్కారం. మనం ప్రతి రోజు 6 లక్షల వాక్సిన్లు వేసే స్థాయికి చేరుకున్నాం. ఆ సామర్థ్యం మనకు ఉంది. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ప్రతి గ్రామ సచివాలయంలో ఆశా వర్కర్, స్థానిక ఏఎన్‌ఎం, వలంటీర్లు ఉన్నారు. వారు ఇల్లిల్లూ సందర్శించి, వాక్సిన్‌ అవసరమైన వారిని గుర్తించి, ఏ రోజు వారికి వాక్సిన్‌ వేస్తారన్నది తెలియజేస్తారు. ఆ మేరకు నిర్దేశించిన రోజున స్థానిక పీహెచ్‌సీ వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు వచ్చి, వారందరికీ వాక్సిన్‌ వేస్తారు. ఇదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా వాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగాలి. గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వాక్సిన్లు ఇవ్వాలి. ఆ విధంగా రోజుకు 6 లక్షల వాక్సిన్లు. ఆ మేరకు వాక్సిన్‌ డోస్‌ల కోసం కేంద్రానికి లేఖ రాస్తున్నాం.

వారికి వాక్సిన్‌ తప్పనిసరి
ఇదే సమయంలో ప్రతి హెల్త్‌ వర్కర్, ప్రతి ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌కు తప్పనిసరిగా వాక్సిన్‌ ఇవ్వాలి. అది చాలా సురక్షితమని చెప్పాలి. సీఎం కూడా తీసుకున్నారన్న విషయం చెప్పాలి. అలా ప్రతి హెల్త్‌ వర్కర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ వాక్సిన్లు ఇవ్వాలి. హెల్త్‌ కేర్‌ వర్కర్లలో ఇంకా దాదాపు లక్ష మందికి వాక్సిన్లు ఇవ్వాల్సి ఉంది. విజయనగరం, కృష్ణా జిల్లాలలో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో కూడా ఇంకా దాదాపు 1.8 లక్షల మందికి వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది. వారందరికీ వాక్సిన్‌ ప్రాధాన్యత వివరించి, ప్రతి ఒక్కరూ వాక్సిన్‌ వేసుకునేలా సిద్దం చేయాలి. ప్రతి ఒక్కరికి వాక్సిన్‌ ఇవ్వాలి.

వాక్సిన్‌ వేస్టేజ్‌ వద్దు
వాక్సిన్‌ వేస్టేజ్‌ లేకుండా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడా వాక్సిన్‌ వృథా కాకుండా చూడాలి. వాక్సిన్‌ వాయిల్స్‌ తెరవక ముందే తగిన సంఖ్యలో అది అవసరమైన వారు ఉన్నారా? లేదా? అన్నది చూడాలి. ఆ తర్వాతే వాక్సిన్‌ వేయాలి. అంతే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనే వాక్సిన్లు వృథా చేయొద్దు.

1902 నెంబరు
1902 నెంబర్‌. ఇది గ్రీవెన్స్‌ కోసం కేటాయించిన నెంబర్‌. సమస్యలు చెప్పుకోవడం కోసం ఆ నెంబర్‌. కాబట్టి ఫోన్‌ వస్తే, అటెండ్‌ చేయాలి. సమస్యలు పరిష్కరించాలి. ఆ విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలి’.. అంటూ సీఎం వైఎస్‌ జగన్, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు నిర్దేశించారు.

క్యాంప్‌ కార్యాలయం నుంచి జరిగిన ఈ కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement