YS Jagan Says Government Had Identified The IT And Electronic Manufacturing - Sakshi
Sakshi News home page

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు ప్రోత్సాహం

Published Wed, Feb 10 2021 5:11 AM | Last Updated on Wed, Feb 10 2021 9:45 AM

YS Jagan said that AP Govt has identified the IT and electronics manufacturing industry as fastest growing sectors - Sakshi

జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ మసయుకి తాగకు జ్ఞాపిక అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో అతి వేగంగా వృద్ధి చెందే రంగాలుగా ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దేశంలో స్మార్ట్‌ఫోన్ల తయారీ, విడిభాగాల ఉత్పత్తి రెండు మూడేళ్లలో 800 మిలియన్లకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఈ రంగంలో పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇందులో భాగంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీలను రూపొందించామన్నారు. నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఈ రంగాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర బిందువుగా మారనుందని సీఎం జగన్‌ చెప్పారు. చెన్నైలోని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ మసయుకి తాగ మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి రాష్ట్రాబివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు.

పలు ప్రముఖ సంస్థల ఆసక్తి..
పలు ప్రముఖ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నాయని సీఎం వివరించారు. ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 200 మెగావాట్ల డేటా సెంటర్‌ పార్క్, స్కిల్‌ యూనివర్శిటీ, ఐటీ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. దీని ద్వారా సుమారు 25,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, ఇంటెలిజెంట్‌ సెజ్‌లో ఫుట్‌వేర్‌ పరిశ్రమల ఏర్పాటు ద్వారా దాదాపు 12,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు.

ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలను అందిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో హై ఎండ్‌ ఐటీ స్కిల్స్‌ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్‌ సెంటర్స్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ల్యాబ్స్, కో వర్కింగ్‌ స్పేసెస్, ఐకానిక్‌ ఐటీ టవర్స్, స్టేట్‌ డేటా సెంటర్ల ఏర్పాటుతో ఐటీ సెక్టార్‌కు అన్ని విషయాల్లోనూ ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో అన్ని వనరులతో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీల స్థాయిలో డిజిటల్‌ లైబ్రరీలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్, 15 వేలకు పైగా గ్రామ పంచాయితీలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం, దాదాపు 90 వేలకు పైగా వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ప్రభుత్వ సేవలను చేరువ చేసేలా చర్యలు చేపట్టామని వివరించారు. వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో ప్రపంచస్ధాయి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా తయారీదారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ క్లస్టర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు భూమి, విద్యుత్తు, నీరు, రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్‌ కార్గో తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిపుణులైన ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ టెక్నీషియన్ల కోసం విశాఖలో హై ఎండ్‌ ఐటీ స్కిల్స్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటుతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగాలకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించిందని చెప్పారు.

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం.. 
ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారదర్శక విధానాలకు నిదర్శనంగా డీపీఐఐటీ, కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌లు సంయుక్తంగా ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి ర్యాంకు సాధించిందని సీఎం జగన్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో సమర్థవంతమైన పాలనతో ప్రజల ముంగిటకే అన్ని సేవలను అందిస్తోందని, అదే క్రమంలో పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములకు ఉత్తమ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించేందుకు పెట్టుబడులు, వ్యాపార భాగస్వాములను ప్రభుత్వం ఆహ్వానిస్తోందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement