బాబు.. స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Serious Comments On Chandrababu Govt Over Diarrhoea Cases In Vizianagaram In Gurla Tour | Sakshi
Sakshi News home page

YS Jagan Gurla Tour Updates: బాబు.. స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా?

Published Thu, Oct 24 2024 1:06 PM | Last Updated on Thu, Oct 24 2024 5:29 PM

YS Jagan Serious Comments On Chandrababu Govt Over Diarrhoea
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుర్లలో డయేరియా వ్యాప్తి
  • 5 నెలలుగా కనీసం నీటి క్లోరినేషన్‌ కూడా లేదు
  • డయేరియా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం వైఎస్సార్‌సీపీ నుంచి చేస్తున్నాం
  • మరి ప్రభుత్వం ఎంత ఇవ్వబోతోంది అన్నది చెప్పాలి
  • గుర్లలో డయేరియా వ్యాప్తిని తక్కువ చేసి చూపారు
  • మృతుల సంఖ్యపైనా కలెక్టర్, డిప్యూటీ సీఎం వేర్వేరు లెక్కలు
  • అసలు అక్కడ ఏమీ జరగలేదన్నట్లు చెప్పేందుకు ప్రయత్నం
  • చివరకు నా ట్వీట్‌తో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది
  • డయేరియా బాధితులకు స్కూళ్లలో చికిత్స 
  • బెంచీలపై రోగులను పడుకోబెడుతున్నారు
  • నాడు–నేడు మనబడిలో ఆ స్కూళ్లు బాగు చేశాం
  • ఆ స్కూళ్లు కూడా లేకపోతే పరిస్థితి ఏమిటి
  • డయేరియా బాధితులను అసలు పట్టించుకునేవారా?
  • దారుణ స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం తీరు
  • డయేరియా రోగులను ఎక్కడికీ తరలించలేకపోయారు
  • విజయనగరం, విశాఖకు ఎందుకు తీసుకుపోలేదు?
  • :సూటిగా ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయనగరం: కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు?. స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

గుర్లలో డయేరియా బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్లలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. గ్రామాలను సస్యశ్యామలం చేశాం. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఈరోజు పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ హయంలో గ్రామ సచివాలయం ద్వారా సేవలు అందించాం. వివిధ శాఖలకు చెందిన సేవలు సత్వరమే అందించగలిగాం. అన్ని డిపార్టమెంట్ల సిబ్బంది అందుబాటులో ఉండేవారు.

..గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖ ఉద్యోగులు కనిపించేవారు. విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. విలేజ్‌ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానం చేశాం. ఏఎన్‌ఎంలు కనిపించేవారు. ప్రతీ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఉండేది. ప్రభుత్వం అలసత్వం కారణంగా గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. నేను ప్రశ్నించే వరకు డయేరియాపై ప్రభుత్వం స్పందించ లేదన్నారు.

వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

నాడు గ్రామ స్వరాజ్యం. మరి నేడు?
ఈరోజు గుర్ల గ్రామం, మండలంలో ప్రత్యేక పరిస్థితులు చూసి, గమనిస్తే, చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు కళ్లెదుటే కనిపిస్తాయి. మా ప్రభుత్వ హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే, ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటే, ఈరోజు పరిస్థితి ఏమిటన్నది గమనించండి.

నాడు వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామాలు చూస్తే.. ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపించేవి. అక్కడే వివిధ శాఖల వారు పని చేస్తూ కనిపించే ఉద్యోగులు ఉండేవారు. బడి పిల్లలు చక్కగా నవ్వుతూ కనిపించేవారు. మన గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు కనిపించేవి. సచివాలయాల్లో  పంచాయతీరాజ్‌ శాఖలో పని చేసే వాళ్లు కనిపించే వాళ్లు. అక్కడే విద్యా శాఖ చూసే వాళ్లు కూడా కనిపించేవారు.ఈరోజు గుర్ల మండలం, గ్రామంలో జరిగింది ప్రజలంతా గమనించమని కోరుతున్నాను. రాష్ట్రంలో పరిస్థితి గమనించమని కోరుతున్నాను.

ఇదీ ఆ గ్రామ స్వరాజ్య స్వరూపం
గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే, విలేజ్‌ క్లినిక్స్‌ కనిపించేవి. అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు, అక్కడే నివాసం ఉండే సీహెచ్‌ఓలు కనిపించేవారు, వారికి అనుసంధానంగా ఏఎన్‌ఎంలు, వారికి రిపోర్ట్‌ చేస్తూ ఆశా వర్కర్లు కనిపించేవారు. విలేజ్‌ క్లినిక్స్‌తో పాటు, ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ నడిచేది. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌ను అనుసంధానం చేసి, పీహెచ్‌సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు డాక్టర్లు వచ్చే వ్యవస్థ.
అదే గ్రామంలో నాడు–నేడుతో బాగుపడిన స్కూళ్లు. రైతన్నలను చేయి పట్టించుకుని నడిపించే వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి.
చక్కగా ఈ–క్రాపింగ్‌ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. రైతులకు సకాలంలో పెట్టుబడి సహాయం అందేది.
ఈరోజు గ్రామ స్వరాజ్యం ఎలా తయారైంది అని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ.

జగన్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేస్తే తప్ప..
ఇక్కడ డయేరియాతో ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. నీరు బాగాలేక, డయేరియా వచ్చి చనిపోయారు. ఇదే గ్రామానికి సంబంధించి, జగన్‌ అనే వ్యక్తి అక్టోబరు 19న ట్వీట్‌ చేస్తే తప్ప, ఇక్కడ 14 మంది చనిపోయారని చెప్పని పరిస్థితి.
ఇదే గ్రామంలో సెప్టెంబరు 20వ తారీఖున, అంటే 35 రోజుల కిందట, ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని పరిస్థితి. అక్టోబరు 12 వచ్చేసరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గుండ్రేడు, గోషాడ, నగలవలస గ్రామంలో డయేరియా ఉధృతంగా ప్రబలింది. డయేరియా వల్ల ఏకంగా 14 మంది చనిపోయారు. అక్టోబరు 19న జగన్‌ ట్వీట్‌ చేస్తే తప్ప, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ప్రభుత్వం కదిలిందా? అంటే అదీ లేదు.

తప్పుడు లెక్కలు. తక్కువ చూపే ప్రయత్నం
కలెక్టర్‌ అంటాడు, ఇక్కడ కేవలం ఒకరే చనిపోయాడని. అలా దీన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. మంత్రులు, అధికారులు ఆ ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు. తీరా చూస్తే, అక్టోబరు 24 వచ్చేసరికి చూస్తే, 14 మంది చనిపోయారని తేలింది.
ఇష్యూ పెద్దది కావడంతో, సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో 8 మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు.
తీరా, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి, జరిగిన తప్పును సరిదిద్దడం లేదు.

ఈ దారుణ పరిస్థితికి కారణం?
ఇక్కడ జరిగిన తప్పు గమనిస్తే.. పక్కనే చంపానది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. చంపానది మీద ఈ మండలానికి సంబంధించి సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్‌) పథకం. చంద్రబాబు వచ్చిన తర్వాత, ఈ 5 నెలల్లో కనీసం మెయింటెనన్స్‌ రెన్యూవల్‌ కూడా చేయలేదు. దాని ఫిల్టర్లు మార్చారా? లేదా? కనీసం క్లోరినేషన్‌ జరిగిందా? అన్న కనీసం ఆలోచన కూడా చేయలేదు.

శానిటేషన్‌ లేదు. గ్రామంలో సచివాలయం ఉంది. వారి సహాయ, సహకారంతో గ్రామంలో శానిటేషన్‌ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు.
ఈ మండలానికి సంబంధించి 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలో గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి
ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఏం చేస్తోంది? కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదు. ఏదైనా ఇష్యూ జరిగితే, ఆ ఇష్యూను ఎలా డైవర్ట్‌ చేయాలి? ఎలా కవరప్‌ చేయాలి? అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి? అన్న దిక్కుమాలిన ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి.

ఇది గుర్ల మండల కేంద్రం. ఇక్కడే 9 మంది చనిపోగా, మండలంలో మొత్తం 14 మంది చనిపోయారు. ఇక్కడి నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకోలేకపోయారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం కేవలం 80 కి.మీ దూరంలో ఉంది. ఒక 10 అంబులెన్సులు ఏర్పాటు చేసి, డయేరియా బారిన పడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎందుకు తీసుకుపోలేదు?

స్కూళ్లే ఆస్పత్రులు. బెంచీలే బెడ్లు
నాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఇలా స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే, పరిస్థితి ఏమిటి?. ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్‌ కాలేజ్‌ కూడా వచ్చింది.
17 కి.మీ దూరంలోని విజయనగరం, 80 కి.మీ దూరంలో ఉన్న విశాఖపట్నంకు రోగులను తరలించక పోవడంతో, గ్రామంలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు. ఇది దారుణం. మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా?

సాయం చేయకపోగా, అబద్ధం చెప్పమన్నారు
చివరికి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదు. అదే విషయం వారంతా చెప్పారు. సహాయం చేయకపోగా, ఆస్పత్రులకు పోతే.. ‘డయేరియాతో చనిపోయారని చెప్పొద్దని, అలా చెబితే గ్రామంలో దాని వల్ల భయాందోళన పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల గుండెపోటుతో చనిపోయారని చెప్పమని’.. ఉచిత సలహాలు ఇస్తున్నారు.
ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే, ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచన చేయమని కోరుతున్నాను.

వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు
ఇక్కడి గ్రామాల్లో పరిస్థితి బాగుపర్చకపోగా, విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలను బాగు పర్చకపోగా, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్ని రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1800 కోట్లు బకాయిలు పేరుకుపోయి, రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి.    

మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం. మిగిలిన 12 మెడికల్‌ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు కూడా మంజూరైతే, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది. ఆ తర్వాత ఈ 12 మెడికల్‌ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్‌ కాలేజీలు.. మొత్తం 17 మెడికల్‌ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్‌వైపు అడుగులు వేస్తోంది.
ఆరోగ్యశ్రీని నీరు గార్చారు. గతంలో కేవలం 1000 ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక, 3300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. ఇంకా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు, ఆరోగ్య ఆసరాను çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది.

మా పార్టీ నుంచి రూ.2 లక్షల చొప్పున. మరి ప్రభుత్వం?
మేము విపక్షంలో ఉన్నా, పార్టీ నుంచి ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నా మేమే ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండి. సూటిగా ప్రశ్నిస్తున్నాం.
ఇప్పటికైనా డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఆపి, వాస్తవాలను ప్రజలతో పంచుకుని, వారికి క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలి. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని పైన ఉన్న దేవుడిని ప్రార్థిస్తున్నాను.

డైవర్షన్‌ పాలిటిక్స్‌. అదే చంద్రబాబు రాజకీయం
ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే, దానిపై స్పందించాల్సి వస్తే, ప్రభుత్వం స్పందించకపోగా, ఇష్యూను డైవర్ట్‌ చేసేలా అడుగులు వేస్తోంది.

ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆరోజు మదనపల్లెలో ఏదో అగ్నిప్రమాదం జరిగితే, ఏకంగా హెలికాప్టర్‌లో డీజీపీని, అధికారులను పంపారు. అదే ఇక్కడ 14 మంది చనిపోతే, హెలికాప్టర్‌ కాదు కదా.. కనీసం మంత్రులు కూడా వచ్చి పలకరించలేదు.ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌ అన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు.
100 రోజుల పాలన మీద ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చెప్పి, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. తిరుపతి లడ్డూపై ప్రచారం చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు అండగా నిలబడాల్సి ప్రతి సందర్భంలోనూ, చంద్రబాబుగారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ డైవర్షన్‌. అదే చంద్రబాబు రాజకీయం.

ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు. రాష్ట్రవ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురు అవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి.

ప్రభుత్వం మాది అని చెప్పి, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు.

ఇప్పుడూ అదే. నా తల్లి, చెల్లి ఫోటోలు
మరోవైపు జగన్‌ అనే వ్యక్తి పర్యటిస్తున్నాడు. గుంటూరు వస్తున్నాడు. గుర్లకు వస్తున్నాడు అనేసరికి, మళ్లీ టాపిక్‌ డైవర్ట్‌. 
అలా టాపిక్‌ డైవర్ట్‌ చేసి ఏమంటారు?
మా చెల్లెలు ఫోటో పెడతారు. మా అమ్మ ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ. అయ్యా ఆంధ్రజ్యోతి. అయ్యా ఈనాడు. అయ్యా టీవీ5. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? అని అడుగుతున్నాను.
అయ్యా, ఇవన్నీ ఘర్‌ ఘర్‌కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటని మీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపడం, నిజాలను వక్రీకరించి చూపడం.
ఇవన్నీ మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని ఈరోజు చంద్రబాబును అడుగుతున్నాను. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు, దత్తపుత్రుణ్ని కూడా అడుగుతున్నానంటూ వైఎస్‌ జగన్‌ చురకలంటించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement