‘మలి యేడు–జగనన్న తోడు’ డాక్యుమెంట్, ‘రెండో ఏటా.. ఇచ్చిన మాటకే పెద్ద పీట’ బుక్‌లెట్‌లను ఆవిష్కరిస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు
సాక్షి, అమరావతి: ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో 86 శాతం ఇళ్లకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి కలిగేలా అడుగులు ముందుకు వేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో తమకు తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయతో ఈ రెండేళ్ల పరిపాలన సంతృప్తికరంగా చేయగలిగామన్నారు. రాబోయే మూడు సంవత్సరాలు కూడా ప్రతి ఆశను నెరవేరుస్తూ ప్రజా శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనలో అడుగులు ముందుకు వేయడానికి బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ‘రెండో ఏటా.. ఇచ్చిన మాటకే పెద్ద పీట’ పేరుతో బుక్‌లెట్‌తో పాటు ‘మలి యేడు –జగనన్న తోడు, జగనన్న మేనిఫెస్టో 2019’ డాక్యుమెంట్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండేళ్లలోనే 94.5 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వగలిగామని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..
ఏకంగా రూ.1,31,725 కోట్లు
► ఇవాళ రూ.95,528 కోట్లు డీబీటీ ద్వారా.. అంటే నగదు బదిలీ ద్వారా, మరో రూ.36,197 కోట్లు పరోక్షంగా (నాన్ డీబీటీ) ప్రజలకు చేరాయి. అంటే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల స్థలాలు, వైఎస్సార్ కంటి వెలుగు వంటి పథకాల ద్వారా అందాయి.
► ఇవన్నీ లెక్క వేసుకుంటే మొత్తం రూ.1,31,725 కోట్లు నేరుగా ప్రజలకు అందాయి. వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి.. లంచాలు, వివక్ష లేకుండా.. నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్లి అందించగలిగాం. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంత గొప్పగా చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను.
► గ్రామ సచివాలయ వ్యవస్థలో పని చేస్తున్న ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు.. గ్రామ వలంటీర్లుగా లాభాపేక్ష లేకుండా అంకిత భావంతో పని చేసిన ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు మొదలు కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలతో ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగాము.
ఇంటింటికీ లేఖ, డాక్యుమెంట్..
► వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ బుక్‌లెట్, డాక్యుమెంట్ (లేఖ) చేర్చడానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. ఒక డాక్యుమెంట్.. వారి పేరుతోనే అందజేస్తాం.
► ఇప్పుడు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్.. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం వండ్రంగి గ్రామంలోని కంది ఆదిలక్ష్మి అక్కకు చెందినది. ఇందులో ఆ అక్కకు, ఆ కుటుంబానికి దేవుడి దయతో ఏయే పథకాలు ఇవ్వగలిగాము.. ఆ కుటుంబానికి ఎంత మంచి చేయగలిగామో చెబుతూ ఆ అక్కకు ఈ లేఖ రాస్తున్నాము.
► మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టోను ప్రకటించాము. దాన్నే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి, అందులో చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేయడానికి ఈ రెండు సంవత్సరాలు అడుగులు ముందుకు వేశాం.
ఎన్నికల సమయంలో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ఇచ్చాము. అందులో చెప్పిన వాటిలో ఏమేం అమలు చేశాము? ఎన్నింటికి అడుగులు పడ్డాయి? ఏమేం ఇంకా అమలు కావాలి? ఆ వివరాలతో పాటు, మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఏమేం చేశామన్నది వివరిస్తూ ప్రతి ఇంటికి ఒక డాక్యుమెంట్, లేఖ పంపిస్తున్నాము.
రెండేళ్లలో 94.5 శాతం హామీల అమలు
► మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఈ రెండు సంవత్సరాలలో దాదాపు 94.5 శాతం అమలు చేశాం. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో దాదాపు అన్ని వాగ్దానాలు పూర్తి చేశామని, ఇంకా చేయాల్సిన వాటి కోసం అడుగులు వేస్తున్నామని గర్వంగా చెబుతున్నాము. ప్రతి అక్క చెల్లెమ్మకు రాసే లేఖతో ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తున్నాము. పథకాల్లో దాదాపు 66 శాతం అక్క చెల్లెమ్మలకు పోతున్నాయనే వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.
► రాబోయే మూడు సంవత్సరాలు కూడా ప్రతి ఆశను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయడానికి తగిన బలం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.
► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, (వైద్య ,ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కె.నారాయణ స్వామి (ఎక్సైజ్), అంజాద్ బాషా (మైనార్టీ వెల్ఫేర్), హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్.. గ్రామ, వార్డు సచివాలయాల సలహాదారు ఆర్.ధనంజయ్‌రెడ్డి, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, విడదల రజని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment