వలంటీర్‌ అంటేనే స్వచ్ఛంద సేవ | YS Jagan Wrote Letter To Above Two Lakh Volunteers In AP | Sakshi
Sakshi News home page

వలంటీర్‌ అంటేనే స్వచ్ఛంద సేవ

Published Wed, Feb 10 2021 4:19 AM | Last Updated on Wed, Feb 10 2021 11:37 AM

YS Jagan Wrote Letter To Above Two Lakh Volunteers In AP - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించే సంకల్పంతోనే వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. గత సర్కారు ప్రతి సేవకూ రేటు కట్టి లంచాలు గుంజి, జన్మభూమి కమిటీలు లాంటి వాటితో పౌర సేవలను భ్రష్టు పట్టించడంతో అటువంటి వ్యవస్థను మార్చాలన్న ఆశయంతో వలంటీర్‌ వ్యవస్థను తెచ్చాం. లంచాలు, వివక్ష లేని విశ్వసనీయ పరిపాలన కోసం ప్రతి 50 ఇళ్లకు సేవాభావంతో పౌర సేవలను డోర్‌ డెలివరీ చేసే వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. వలంటీర్‌ అంటేనే స్వచ్ఛంద సేవ. అందుకే సమాజంలో ప్రజలంతా మిమ్మల్ని ఆత్మీయులుగా చూస్తున్నారు’’ అని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.6 లక్షల మంది వలంటీర్లనుద్దేశించి మంగళవారం రాసిన లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  లేఖ సారాంశం ఇదీ...

నా ఆత్మీయ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు.. 
గ్రామ వలంటీర్ల జీతాలు పెంచాలని కొద్ది మంది డిమాండ్‌ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డెక్కారన్న వార్త ఎంతో బాధించింది. గ్రామ, వార్డు వలంటీర్లుగా రాష్ట్రంలో దాదాపు 2.6 లక్షల తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఉదాత్తమైన బాధ్యతలు అప్పగించాం. ప్రతి 50 ఇళ్లకు పౌర సేవలను డోర్‌ డెలివరీ చేసే వలంటీర్‌ వ్యవస్థను తెచ్చాం. సేవాభావం ఉన్న చెల్లెళ్లు, తమ్ముళ్లతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశాం. మనందరీ ప్రభుత్వం అందించే పథకాలన్నీ కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అందాలన్న ఉద్దేశంతో వీరిని ఎంపిక చేశాం. చివరకు నాకు ఓటు వేయని వారికి కూడా, ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసిన వారికి కూడా వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం.

నా అంచనాలకు అనుగుణంగా 2.6 లక్షల మంది వలంటీర్లలో 99 శాతం మంది తాము చేస్తున్నది సేవ అని, అది ఉద్యోగం కాదని మనసావాచా కర్మణా నమ్మారు కాబట్టి ఈ వ్యవస్థకు మన సమాజంతోపాటు దేశంలో పలు రాష్ట్రాలు సలాం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ, ప్రతి మనిషి వారికి అందుకే ఆ గౌరవం ఇస్తున్నారు. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తోంది జీతం కాదు. అది గౌరవ భృతి. వలంటీర్లు సేవలు అందిస్తున్నప్పుడు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే గౌరవభృతి ఇస్తున్నాం. ఖర్చు ఎక్కువ అయినా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పౌర సేవల డోర్‌ డెలివరీకి ఇంత ఖర్చు చేయటానికి ముందుకు రాకపోయినా, ప్రజలకు లంచాలు, వివక్ష లేని సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి వలంటీర్‌కు ఏడాదికి రూ.60 వేలు చొప్పున 50 ఇళ్లకు ఒకరిని నియమించి గౌరవ భృతి అందజేస్తున్నాం. 

అపార్థాలు, అనుమానాలకు తావు లేకుండా..
వలంటీర్ల సేవలు ప్రారంభించిన సమయంలో నేను స్పష్టంగా చెప్పిన విషయాలు కానివ్వండి, మీ అందరి దగ్గర ఉన్న వలంటీర్ల హ్యాండ్‌ బుక్‌లో కానివ్వండి, ఎటువంటి అపార్థాలు, అనుమానాలకూ తావు లేకుండా వలంటీర్లను, వారికి ఇచ్చే గౌరవ భృతిని డిఫైన్‌ చేశాం. స్పష్టంగా చెప్పాం. ఆ హ్యాండ్‌ బుక్‌లో ఏముందో మీరే చూడండి. లేదా ఆ రోజు నేను అన్న మాటల్ని గుర్తు తెచ్చుకోండి. హ్యాండ్‌ బుక్‌లో నేను రాసిన సందేశంలో ‘‘ప్రతి గ్రామంలో, వార్డులో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా ధృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ/ వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, నవరత్నాల ద్వారా అందించే పథకాలు లాంటివి ఇంటివద్దకే డోర్‌ డెలివరీ చేస్తారు. వీరికి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చే వరకు సేవా  దృక్పథంతో అన్ని పథకాలూ ఇంటి వద్దకే అందేలా డోర్‌ డెలివరీ చేస్తారు’’ అని స్పష్టంగా చెప్పడం జరిగింది. వలంటీర్ల సేవల ప్రారంభం రోజు కూడా ఇదే విషయాన్ని చెప్పా. 

పని గంటల నిబంధనలు లేవు..
‘వలంటీర్‌’ అనే పదానికి అర్థమే ‘‘స్వచ్ఛందంగా సేవలు అందించడం’’. ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ. వలంటీర్లుగా సేవలందిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి. గ్రామ, వార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు అది కూడా మీకు వీలున్న సమయంలో మేం అందుబాటులో ఉన్నాం అని సూచిస్తూ అటెండెన్స్‌ ఇస్తున్నారు. మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు  ఏమీ లేవు. పని ఉన్నప్పుడు మాత్రమే సేవాభావంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లేందుకు నెలలో పని ఉన్న కొద్ది రోజులు మీ సేవలు అందిస్తున్నారు. పేదవారి ఆశీస్సులు అందుకుంటూ సంతోషంగా మీరు చేస్తున్న కార్యక్రమం ఇది. మీలో  ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు, ప్రజలతో మీ అనుబంధాన్ని పెంచేందుకు, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ పెంపొందించేందుకు దోహదం చేస్తుంది. వివక్ష, లంచాలు లేని ఒక మంచి వ్యవస్థను తెచ్చేందుకు, మంచి మార్పులు తెచ్చేందుకు మీరంతా సహాయ సహకారాలు అందించాలని గతంలోనే స్పష్టం చేశా. 

ఒక్కసారి ఆలోచన చేయండి..
సేవాభావంతో, ప్రతిఫలాపేక్ష లేకుండా వలంటీర్‌ అనే పదానికి అర్థం చెబుతూ మీరు ఇంత గొప్ప సేవలు అందించారు కాబట్టి సామాన్యులంతా మిమ్మల్ని ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. మీరు వలంటీర్లుగా కాకుండా జీతాలు తీసుకుని ఇదే పని చేస్తుంటే ఏ ఒక్కరైనా మీకు ఇటువంటి గౌరవాన్ని ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. స్వచ్ఛదంగా కాకుండా ఇదే పనిని మీరు జీతం కోసమే చేస్తే ఇటువంటి గౌరవాన్ని పొందగలరా? వలంటీర్‌ పేరుతో మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ అవుతుందా? 

రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి..
గొప్పగా సేవలందిస్తున్న వలంటీర్లకు సమాజం నమస్కరిస్తోంది. ప్రభుత్వమూ వారిని సత్కరిస్తుంది. అత్యుత్తమ సేవలందించిన వారికి నియోజకవర్గం ప్రాతిపదికగా ఏటా ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, జేసీ సమక్షంలో శాలువా కప్పి అవార్డుగా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని దక్కకుండా చేసేందుకు, మీకు వస్తున్న మంచి పేరును తుడిచేసేందుకు, మొత్తంగా వలంటీర్‌ వ్యవస్థను లేకుండా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలూ కుతంత్రాలు పన్నుతున్నారో మీకు తెలుసు.  ఇలా ప్రలోభాలకు గురిచేసే వారికి, రెచ్చగొట్టేవారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా, మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement