
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి మృతిపై సీబీఐ విచారణ వేగవంతం చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రిని హత్య చేశారని, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. హత్య జరిగి రెండేళ్లయినా ఎవరు చేశారనేది ఇప్పటివరకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం దర్యాప్తు సాగుతోందని ఈ మధ్యలో సాక్షులకు ఏమైనా అవుతుందేమోననే భయంతో ఉన్నానని చెప్పారు.శ్రీనివాసరెడ్డి మృతి దీనికి బలం చేకూర్చిందన్నారు.
న్యూఢిల్లీలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం తమ్ముడు, ప్రస్తుత సీఎం బాబాయి మృతి విషయంలోనే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి, న్యాయం కోసం ఇంకెంత కాలం చూడాలి అని ప్రశ్నించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తనకు అనుమానం ఉన్న 15 మంది పేర్లు రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని, అరెస్టులు కూడా చేయలేదని చెప్పారు. ఎంత కష్టమైనా నిందితుల్ని పట్టుకునే వరకు పోరాడతానని సునీత చెప్పారు.