
సాక్షి, అమరావతి: పేదలు ఎవరైనా ఏదైనా అనారోగ్య కారణంతో ఆస్పత్రి పాలైతే.. వారి జీవితం మరింత దుర్భరం అవుతుంది. అదే ఇంటి పెద్ద అయితే కుటుంబం మొత్తం కష్టాల పాలవుతుంది. ఇలాంటి వారి జీవనోపాధికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో శస్త్రచికిత్సల అనంతరం పేషెంట్లు కోలుకునే వరకూ ఆసరాగా ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆ పథకం అలాంటి వారికి కొండంత అండగా నిలుస్తోంది.
రాష్ట్రంలో పథకాన్ని ప్రారంభించిన 2019 డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు అంటే 15 నెలల కాలంలోనే 3,81,723 మంది రోగులకు రూ. 235.46 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం ఆసరా కల్పించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన రోగులకు వైఎస్సార్ ఆసరా పథకం వర్తింప చేస్తున్నారు. ఈ పథకం కింద పేషెంటు చికిత్స అనుసరించి అతడి విశ్రాంతి కాలంలో రోజుకు రూ. 225 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 5,000 ఇస్తున్నారు. శస్త్రచికిత్సల అనంతరం రోగులు డిశ్చార్జ్ కాగానే వారికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా తప్పనిసరిగా అందాలని, ఈ విషయంపై జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.
బ్యాంకు ఖాతాలో జమ
శస్త్ర చికిత్స పూర్తయిన తరువాత రోగుల డిశ్చార్జ్ అయిన రోజునే వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు లేని వైఎస్సార్ ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు 104 ద్వారా కాల్ చేసి హెల్త్ కార్డులోని ఇతర సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్ ఆస్పత్రిలోని ఆరోగ్య మిత్రకు ఇవ్వాలని సూచిస్తున్నారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని మొత్తం 1,519 చికిత్సలకు వర్తింప చేస్తున్నారు. ఇక్కడే గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గత ప్రభుత్వం అసలు ఇలాంటి పథకం గురించి ఆలోచనే చేయలేదు గానీ మరోపక్క ఆరోగ్యశ్రీని నీరుగార్చి వ్యయం తగ్గించుకోవాలనే ఆలోచన చేసింది.