ఈసీ అసంబద్ధ నిర్ణయాలతోనే దాడులు, విధ్వంసం
చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో పోలీసు అధికారుల బదిలీ
పథకం ప్రకారం ఆ ప్రాంతాల్లో పచ్చ ముఠాల స్వైర విహారం
తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాన్ని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పక్కా పన్నాగంతో జరుగుతున్న దాడులను డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా దృష్టికి తెచ్చింది. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య(నాని), లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు దాడులకు తెగబడిన 21 ఘటనలకు సంబంధించి పూర్తి ఆధారాలను అందచేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ విధ్వంసం సృష్టించే పన్నాగాన్ని అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు శాంతియుతంగా వ్యవహరిస్తున్నా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులకు దిగుతోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు చేపట్టి వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.
దౌర్జన్యాలకు కొమ్ముకాసిన పోలీసులు: అంబటి
టీడీపీ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారిని మార్చిన తరువాత కూడా హింసాత్మక సంఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? అవగాహనలేని డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, ఇతర అధికారులను నియమించడంతోనే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, పురందేశ్వరి సూచనల ప్రకారం ఈసీ అడ్డగోలుగా వ్యవహరించింది. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అనే సందేహం కలుగుతోంది.
కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారు. టీడీపీ గూండాలు పోలింగ్ బూత్‌లలో దౌర్జన్యం చేస్తున్నా, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై పడి దాడులు చేస్తున్నా పోలీసు యంత్రాంగం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేసిన పోలీసులు టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేసినా కన్నెత్తి చూడలేదు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నా ప్రత్యర్థిని మాత్రం యథేచ్ఛగా తిరగనిచ్చారు. నా నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది? వెబ్ కెమెరా రికార్డింగ్‌లను పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తుంది? ఇందుకు ఈసీ సమాధానం చెప్పాలి.
దాడులు.. ఆపై కేసులు: పేర్ని నాని
టీడీపీ పక్కా పన్నాగంతో దాడులకు పురిగొల్పుతోంది. కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టుకుని పచ్చ ముఠాలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తిరిగి కేసులు బనాయించడం దారుణం. పోలింగ్ అనంతరం హింసకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారిని పోలీస్ పరిశీలకుడిగా ఈసీ నియమించడం ఏమిటి? ఆయనకు ఏం జవాబుదారీతనం ఉంటుంది? బీజేపీ, టీడీపీ నేతలకు సహకరించాలంటూ ఆయన పోలీసు అధికారులను బెదిరించారు.
మా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పురందేశ్వరి చెప్పిన విధంగా పోలీసు అధికారులను మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పక్కా కుట్రతో పోలీసు అధికారులను బదిలీ చేసి టీడీపీ, బీజేపీ, జనసేన విధ్వంసానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి పోలీసులతోపాటు ఈసీ కూడా సమాధానం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల భద్రత కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం.
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు’
రాష్ట్రంలో హింస, దాడులు, అల్లర్లలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
గొడవలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇటీవల చేసిన హింసాకాండపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ముఖ్యంగా పల్నాడులో ఉద్దేశపూర్వకంగా, ప్లాన్ ప్రకారం దాడులు చేశారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కూటమి పార్టీలకు కొమ్ముకాస్తున్నారని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment