కాకినాడ రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన నురుకుర్తి రామకృష్ణ విజయదరహాసం
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం పెద్దఎత్తున విజయోత్సవాలు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కన్పించింది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పార్టీ విజయదుందుభి మోగించటంతో కార్యకర్తలు, నేతల్లో అభిమానం ఉప్పొంగింది. ఏకపక్ష ఫలితాలు వెలువడతాయనే నమ్మకంతో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఆదివారం ఉదయం నుంచే నింగినంటేలా సంబరాలకు తెరతీశారు. కౌంటింగ్ ఆరంభం నుంచే తమకు అనుకూలంగా వస్తున్న ఫలితాలతో పార్టీ అభిమానులు సందడి చేశారు. మండల కేంద్రాలు, పంచాయతీ కేంద్రాల్లోనే కాకుండా చిన్నచిన్న పల్లెల్లోనూ పెద్దఎత్తున విజయోత్సవాలు జరిగాయి. డప్పు నృత్యాల మధ్య పెద్దఎత్తున బాణసంచా కాల్చారు.
పార్టీ శ్రేణులు వాడవాడలా మిఠాయిలు పంచుకున్నారు. అతితక్కువ కాలంలోనే పెద్దఎత్తున అమలైన సంక్షేమ ఫలాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. అన్ని జిల్లాల్లోని వైఎస్సార్‌సీపీ శిబిరాలు ఇలా ఆనందోత్సాహాలతో కళకళలాడితే అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయాలు మాత్రం వెలవెలబోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు కరువయ్యారు. అన్నిచోట్లా నిశ్శబ్ద వాతావరణం తాండవించింది.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రోజంతా సందడే కన్పించింది. ఉ.11 గంటలకల్లా అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్ అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పెద్దఎత్తున్న బాణసంచా కాల్చారు. డప్పుల మోత.. అభిమానుల డ్యాన్సులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. మంత్రులు, సీనియర్ నేతలు ధన్యవాదాలు చెప్పారు.
పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట బాణసంచా కాలుస్తున్న పార్టీ శ్రేణులు
ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ప్రజా విజయమని కొనియాడారు. సీఎం జగన్ స్వచ్ఛమైన పాలనను కాంక్షిస్తూ ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఇదని చెప్పారు. అనంతరం ఆయన మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గడువు ముగిసినా.. గెలవలేమని భావించే చంద్రబాబు ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎన్నికలు పెట్టాలని కృషిచేసినా.. చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు చేశాయని ఆరోపించారు.
బాబు, లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా..
ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను తాము బహిష్కరించాం అని మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలకు సిగ్గులేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితాల్లో మార్పేమీ లేదని గుర్తుచేశారు. ఇప్పటికిప్పుడు టీడీపీ మొత్తం రాజీనామా చేసినా.. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసి వైఎస్సార్‌సీపీ గెలవడం తథ్యమని తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సీఎం జగన్ జనరంజక పాలనకు ఈ ఫలితాలు చక్కని నిదర్శనమన్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని మరో ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ధీమా వ్యక్తంచేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు, వైఎస్సార్‌సీపీ నేతలు బల్లి శ్వేత, చల్లా మధు, ఎన్‌ఆర్‌ఐ రత్నాకర్, జూపూడి ప్రభాకర్‌రావు, ఎ. నారాయణమూర్తి, ఈద రాజశేఖర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment