మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరు మొదలైంది. కార్మికులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన నిరసన సభకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొని కార్మికులు, ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదే ఉద్యమ స్ఫూర్తితో కాపాడుకుంటామని కార్మిక నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్లాంట్‌ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రైతు ఉద్యమాన్ని మించిన ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కడప స్టీల్ ప్లాంట్‌కి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా.. విభజన హామీల్ని విస్మరించి.. వైజాగ్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమవడం గర్హనీయమన్నారు. ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ నాయకత్వం వహిస్తుందని ముత్తంశెట్టి తెలిపారు. ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి మాట్లాడుతూ..స్టీల్‌ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో ప్రస్తావించి.. అవసరమైతే సభలో ధర్నా చేస్తామన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పార్లమెంట్‌ని స్తంభింప జేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు కేకే రాజు, వైఎస్సార్ టీయూసీ నాయకుడు వై.మస్తానప్ప, ఐఎన్‌టీయూసీ నాయకుడు గంధం వెంకటరావుతో పాటు కార్మికులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment