సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. త్వరితగతిన గృహాలు నిర్మించేందుకు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఆప్షన్–3లో భాగంగా కాంట్రాక్టర్లతో నిర్మించి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో సుమారు 15 వేల గృహనిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో..
జిల్లాలో పేదలకు ప్రభుత్వం 77,688 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికే పలువురు సొంతంగా నిర్మాణాలు ప్రారంభించారు. పలువురు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయగా డ్వాక్రా మహిళలకు బ్యాంకుల నుంచి రూ.35 వేలు రుణం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వ్యవసాయ కార్మికులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ఇంటి నిర్మాణం కష్టం కావడంతో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలను పురమాయించి నిర్మాణాలు చేపట్టేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారు.
నిబంధనల మేరకు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం 10 అడుగుల లోతులో గోతులు తవ్వి వాటికి ఆర్‌సీసీ కాంక్రీట్, ఫైల్ క్యాప్ వేస్తారు. ఆర్‌సీసీ ప్లి్లంత్ బీమ్‌తో కలిసి 4 అడుగుల ఎత్తు సిమెంట్ రాయి కట్టుడు బేస్‌మెంట్, బేస్‌మెంట్‌ను ఇసుకతో నింపడం, రూఫ్ బీమ్, 4 అంగుళాల స్లాబ్ వంటి పనులు చేస్తారు.
యంత్రాల వినియోగం
కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు యంత్రాలు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌కు డిగ్గర్‌ను అమర్చి పిల్లర్‌లకు గోతులు తవ్వుతున్నారు. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే కాంక్రీట్ కలపడానికి మిక్చర్ యంత్రం, శ్లాబ్‌కు లిఫ్ట్ మెషీన్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు.
లబ్ధిదారులతో ఒప్పందం
ఇంటిని నిర్మించుకోవడానికి కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. దీనిలో భాగంగానే 20 వేల టన్నుల ఇసుక నిల్వ చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసేలా కృషిచేస్తున్నాం.
–ఎ.శివరామరాజు, హౌసింగ్ పీడీ, భీమవరం
భీమవరంలో 3 వేల ఇళ్లు
భీమవరంలోని విస్సాకోడేరు జగనన్న కాలనీలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1,200 మందికి పైగా లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలనీలో ఆర్‌సీసీ కాంక్రీట్, ఫైల్‌క్యాప్ వేసే పనులు చేపట్టాం. పనులు చూసిన మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంటున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి గృహప్రవేశాలు చేయిస్తాం.
– పళ్ల ఏసుబాబు, కాంట్రాక్టర్, భీమవరం
ఇళ్ల నిర్మాణం ఇలా..
జిల్లాలో పెద్ద కాలనీలు ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలతో ఇళ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భీమవరంలో 3 వేలు, పాలకొల్లులో 3,500, తణుకులో 5,500, ఆకివీడులో 2,700 ఇళ్లను కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెంలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిర్మాణాలకు కొరత లేకుండా అధికారులు 20 వేల టన్నుల ఇసుకను నిల్వ చేశారు. కాంట్రాక్టర్లకు అవసరమైన సిమెంట్, ఇనుమును ముందుగానే అందిస్తున్నారు.
నిర్మాణానికి రూ.3.30 లక్షలు
ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.3.30 లక్షల ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు రూ.35 వేలు బ్యాంకు రుణం ఇస్తున్నారు. మిగిలిన రూ.1.15 లక్షలను లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment