నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్మించిన టిడ్కో గృహసముదాయం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు కొత్త పట్టణాలను తలపిస్తున్నాయి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని అనువైన ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లు అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని 88 యూఎల్బీలలో పేదల కోసం 2,62,212 ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 163 ప్రాంతాల్లో ఉన్న వీటికి ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా నామకరణం చేశారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్న ఈ ఇళ్లు శాటిలైట్ సిటీలుగా మారబోతున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లలో 40 వేలకు పైగా యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అన్ని వసతులతో ఆధునిక ఇళ్లు
చక్కటి రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం, ఎస్టీపీలు వంటి సకల వసతులతో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తుండటం గమనార్హం. ప్రాంతాన్ని బట్టి ఈ గ్రూప్ హౌస్‌లు వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండటం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు.
త్వరలో ఈ ప్రాంతాలు శాటిలైట్ సిటీలుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, గత నెలలో కొందరు యజమానులు వారికి కేటాయించి ఇళ్లలో చేరగా, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో మిగిలినవారు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే మార్చి నాటికి మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, సరఫరా వంటి పనుల కోసం మునిసిపాలిటీల్లోని ఆయా శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్టీపీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని ఇళ్ల అంతర్గత నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
ఇక నగరాల పరిధి దాటి పంచాయతీల్లో మరో 38 చోట్ల టిడ్కో ఇళ్లు నిర్మించగా, వాటి అవసరాలను తీర్చేందుకు మునిసిపల్ శాఖ పంచాయతీ విభాగంతో సంప్రదింపులు చేపట్టింది. ఇవన్నీ కొద్దిరోజుల్లో కొలిక్కి రావడంతో పాటు ఆయా కొత్త టిడ్కో పట్టణాల అవసరాలను తీర్చేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment