‘వైఎస్సార్‌’ అవార్డు గ్రహీతల స్పందన.. | Ysr-Lifetime-Achievement-Award-2021-Ceremony Response Of Award Recipient | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌’ అవార్డు గ్రహీతల స్పందన..

Published Tue, Nov 2 2021 12:42 AM | Last Updated on Tue, Nov 2 2021 12:59 AM

Ysr-Lifetime-Achievement-Award-2021-Ceremony Response Of Award Recipient - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెం‍ట్‌, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందిన ప్రముఖుల అభిప్రాయాలు..

సీఎం అభినందనీయులు
కళాకారులు, వృత్తి నైపుణ్య తదితర రంగాల వారిని ఎంపిక చేయటం గొప్ప విషయం. ఇన్ని రంగాలవారికి పురస్కారాలు అందించటం తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమం. 1వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు పాఠ్యాంశాల రూపకల్పన, భాషా పరిశోధన, సామాజిక రంగాలలో నా కృషిని గుర్తించి వైఎస్సార్‌ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.
- కేతు విశ్వనాథరెడ్డి, సాహితీవేత్త, కడప జిల్లా

గొప్ప ఔదార్యం
సాహిత్యం, విద్య, సామాజిక రంగాల్లో నా కృషికి వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం అందించినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంతమందిని ప్రోత్సహించటం గొప్ప ఔదార్యంతో కూడిన సందర్భం. 
- ఆచార్య కొలకలూరి ఇనాక్‌, గుంటూరు

కళల అభివృద్ధికి ప్రోత్సాహం 
దేశంలో కళలు అభివృద్ధి చెందటానికి ప్రోత్సాహం చాలా అవసరం. రాష్ట్రంలో కళలు, వ్యవసాయం వంటి వివిధ రంగాల అభివృద్ధికి కృషిచేస్తున్న వారిని సత్కరించిన ముఖ్యమంత్రి జగన్‌ అభినందనీయులు. తద్వారా ఆయన అనేక రంగాలకు చేయూత ఇచ్చారు. నాకు వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది.
- పొన్నాల రామసుబ్బారెడ్డి, రంగస్థలనటుడు, నెల్లూరు

దేశంలో ఎక్కడా లేనివిధంగా
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించడం హర్షణీయం. సాహిత్య రంగంలో ఏడుగురిని ఎన్నుకున్నారు. అందులో నేను ఒకడిని కావడం నా అదృష్టం. నా సాహిత్య కృషికి ఇదొక మంచి పురస్కారం. ఇనుమడించిన ఉత్సాహంతో మరిన్ని రచనలు రాయడానికి కృషి చేస్తాను. 
– ప్రొ. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, కవి, అనంతపురం జిల్లా

ఏపీ ప్రజలకు సన్మానం
తరిమెల నాగిరెడ్డి గారితో కలిసి పనిచేశాం. వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. విశాల దృక్పథం కనిపించింది. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చారు. అన్ని రంగాలవారికీ అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు జరిగిన సన్మానం ఇది.  
- ఇమామ్, పాత్రికేయుడు, కదలిక, అనంతపురం

సాంస్కృతిక విప్లవానికి ప్రోత్సాహం
60 ఏళ్లుగా తెలుగు తత్వశాస్త్రంలో కృషిచేస్తూ ఇప్పటివరకు 95కు పైగా పుస్తకాలు రాశాను. ఇందులో 75 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అస్పృశ్యుని యుద్ధగాధ అనే దళితుని జీవనగాధ రాజకీయ, సామాజిక, ఆర్థికశాస్త్రంగా ముందుకు వచ్చింది. ఈ గ్రం‍ధానికి చాలా అవార్డులు వచ్చాయి. భారత రాజకీయాలపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మార్గదర్శకంలో వెయ్యి పేజీలతో రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. బౌద్ధం నుంచి జ్ఞానం, ప్రతిభ తీసుకుని అంబేడ్కర్‌ ఎలా రాజ్యాంగం రంచించారు వంటి గ్రంథాలు రాయడం జరిగింది. ఈ రోజు వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కారం రావడం ఆనందంగా భావిస్తున్నా. ఇలాంటి ప్రోత్సాహకాలు రాజ్యాంగం ప్రకారం సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లాయి. కవులను, కళాకారులను, ట్రస్ట్‌లను, గ్రంథాలయాలను, విద్యాసంస్థలను ప్రోత్సహిం‍చడం ద్వారా మనలో ఒక సాంస్కృతిక భావజాలం ఏర్పడుతుంది. అది జ్ఞానాన్ని పెంచుతుంది. 
- కత్తి పద్మారావు

ఎంతో సంతోషించేవారు..
మా నాన్న వంగపండు ప్రసాదరావు ఏ ఒక్కరి నుంచీ పైసా తీసుకోకుండా జీవితాన్ని కళకే అంకితం చేశారు. ఈ రోజు జగనన్న నా తండ్రి గొప్పతనాన్ని గుర్తించి వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు అందించారు. ఇప్పుడు నా తండ్రి బతికుంటే ఎంతో సంతోషించేవారు. జగనన్న నన్ను, నా తండ్రిని ఎంతగానో అభిమానిస్తారు. అటువంటి నాయుకుడిని ఎక్కడా చూడలేం. కృతజ్ఞతగా ఆయన అడుగుజాడల్లో పార్టీ కోసం ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాను.
– వంగపండు ఉష

సాహిత్య సౌరభ వికాసం.. సీపీ బ్రౌన్‌ లైబ్రరీ
సీపీ బ్రౌన్‌ గ్రంథాలయానికి వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కడం సంతోషకరం. సీపీ బ్రౌన్‌ నివసించిన ప్రాంతంలో గ్రంథాలయం కట్టారు. ఇటీవల సీఎం జగన్‌ ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయం అభివృద్ధికి రూ.5.50 కోట్లు  కేటాయించారు. ట్రస్టు కింద గ్రంథాలయాన్ని వైఎస్సార్‌ తొలుత ఎస్‌వీ యూనివర్సిటీకి ఇచ్చారు. అనంతరం వైవీ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అవార్డు ద్వారా గ్రంథాలయానికి మంచి గుర్తింపు లభించింది. 
- సూర్యకళావతి, వైస్‌ చాన్సలర్‌, యోగివేమన యూనివర్సిటీ

అరుదైన గౌరవం
సారస్వత నికేతన్‌ రెండేళ్ల కిందటే శతాబ్ది ఉత్సవాలు చేసుకుంది. ఇప్పుడు వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. కళాకారులను, సాహితీవేత్తలను, వివిధ సంస్థలను గుర్తించి ఒకేసారి గౌరవించడం చాలా గొప్ప విషయం.
- వెంకటేశ్వర్లు, సారస్వత నికేతన్‌ కార్యదర్శి

సేవా నిరతికి నిదర్శనం
వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చినందుకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు తరఫున, భక్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు. లక్షలాదిమంది ఆన్‌లైన్లో ఈ కార్యమ్రమాన్ని చూశారు. నాకు చాలామంది మెసేజ్‌లు కూడా పంపారు. 50-60 సంవత్సరాలుగా రాష్ట్రంలోను, దేశంలోను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. బాబా చూపిన మార్గంలో నడుస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు రావడంతో చాలామంది సంతోషిస్తున్నారు. 
- రత్నాకర్, మేనేజింగ్‌ ట్రస్టీ, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు

వందేళ్ల చరిత్రకు గుర్తింపు
మా తాతగారు మల్లాడి సత్యలింగం నాయకర్‌ ప్రతి ఒక్కరికీ విద్య అందాలని ఆరాటపడ్డారు. తన ఆస్తులన్నింటినీ మార్చి ట్రస్టుగా పెట్టారు. వందేళ్ల చరిత్ర ఉన్న మా ట్రస్టుకు వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. 
- మల్లాడి కార్తీక్‌ నాయకర్, ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ 

రాష్ట్రానికి తెలిసింది..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక వందనాలు. వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వడం వల్ల గ్రంథాలయానికి రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఎంతోమందికి గ్రంథాలయం కల్పవృక్షంలా ఉంది. 123 ఏళ్లుగా సేవలందిస్తోంది.
- ఆర్‌.సి.హెచ్‌.వెంకట్రావు, గెజిటెడ్‌ లైబ్రేరియన్, గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి 

సేవకు సత్కారం
అనేక రంగాల్లో ఆర్డీటీ సేవలందిస్తోంది. ఆర్టీడీ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చింది. సీఎం జగన్‌కి కృతజ్ఞతలు. 
- డాక్టర్‌ వై.వి.మల్లారెడ్డి, ట్రస్టీ, ఆర్డీటీ, అనంతపురం

జన్మకు ఇది చాలు
వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు.. జీవితంలో ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదు. ఇలాంటి వేడుక ఒకటి చూస్తానని అనుకోలేదు. ఈ జన్మకు ఇది చాలు. ముఖ్యమంత్రిని దేవుడు చల్లగా చూడాలి. 
- గోచిపాత గాలీబు, డప్పు కళాకారుడు

నైపుణ్యానికి సత్కారం
ముఖ్యమంత్రికి వందనాలు. నేను అరటి రైతును. 1995లో మొట్టమొదటగా టిష్యూ కల్చర్‌ను ప్రవేశపెట్టాను. అరటిసాగులో నాకృషిని గుర్తించి వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చారు. అవార్డుల ద్వారా వివిధ రంగాల్లోని వ్యక్తుల నైపుణ్యాలను వెలికి తీశారు. 
- బలరామిరెడ్డి నల్లపురెడ్డి, అరటిరైతు, పులివెందుల

చాలా సంతోషం
ఆర్గానిక్‌ పద్ధతిలో ఉద్యాన పంటలను సాగుచేస్తాను. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం మాకు చాలా సంతోషం. వైవిధ్య భరితంగా పంటలను సాగు చేయడంపై నేను దృష్టిపెడుతున్నాను. మహానుభావుడు, రైతు బాంధవుడైన వైఎస్సార్‌ పేరుపై అవార్డు రావడం మాకు సంతోషంగా ఉంది. 
- కొట్యాడ శ్రీనివాసరావు, ఉద్యాన రైతు, నిమ్మలపాలెం, విజయనగరం జిల్లా

జగన్‌ ప్రభుత్వం గుర్తించింది
ఈ రీతిలో ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇలాంటి అవార్డులు ఇవ్వలేదు. 1984 నుంచి నేను కాఫీ సాగుచేస్తున్నాను. అనేక ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఎవ్వరూ గుర్తించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గుర్తించింది. వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డు ఇచ్చింది. ఇంకా ఆసక్తితో కృషితో సాగు చేస్తాను. 2018 నుంచి సొసైటీ కూడా ఏర్పాటు చేశాం. ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 
- సెగ్గె కొండలరావు, కాఫీ రైతు, చింతపల్లి, విశాఖపట్నం జిల్లా 

కోవిడ్‌ సేవలకు గుర్తింపు
కోవిడ్‌లో రోగులకు సేవచేయడం దేవుడు ఇచ్చిన అవకాశం. దీన్ని ప్రభుత్వం గుర్తించి వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 
- డాక్టర్‌ నీతిచంద్ర, పల్మనాలజిస్ట్‌, నెల్లూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ

దేవుడిచ్చిన అవకాశం
విప్తతు సమయంలో సేవ చేయడం దేవుడు మాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాం. మేమే కాదు చాలామంది నర్సులు బంధువులను పోగొట్టుకున్నారు. సంకల్పంతో రోగులకు సేవలందించారు. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం సతోషంగా ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 
- కె.జ్యోతిర్మయి, స్టాఫ్‌నర్సు, అనంతపురం ప్రభుత్వాస్పత్రి  

గొప్ప గౌరవం..
మా సేవలను ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషకరం. కోవిడ్‌ డ్యూటీ చేసినప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్లాం. నాలో ఏ ధైర్యం ఉందో.. అదే ధైర్యాన్ని పేషెంట్లకు ఇచ్చా. నా విధిని నేను నిర్వర్తించాను. దీనికి వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చేంత గొప్ప గౌరవం దక్కుతుందని ఊహించలేదు. 
- పోతంశెట్టి లక్ష్మి, స్టాఫ్‌నర్సు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి  

ఆయన జీవితం సాహిత్యం కోసమే
మా నాన్న, ప్రముఖ సాహితీవేత్త కాళీపట్నం రామారావు పేరిట వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చారు. ఆయన మరణానంతరం ఇచ్చారు. ఆయన జీవితం సాహిత్యం కోసం అంకితం చేశారు. సాహిత్యం మీద వచ్చిందంతా సాహిత్యానికే ఖర్చు చేసేవారు. ఆయన స్థాపించిన సంస్థకే ఖర్చు పెట్టాలని మా కుటుంబం నిర్ణయించింది. మా నాన్నగారికి ఈ అవార్డు ఇవ్వడం పట్ల మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
- కాళీపట్నం సుబ్బారావు

మహానేత వైఎస్సార్‌ పొందూరు ఖద్దరే కట్టేవారు
పొందూరు ఖద్దరు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా పొందూరు ఖద్దరు పంచెలే కట్టుకునేవారు. 73 ఏళ్ల  చేనేత సహకార సంఘ చరిత్రలో ఇన్నాళ్లకు గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పొందూరు ఖాదీ సంస్థ తరఫున ఈ అవార్డు అందుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది, ఈ అవార్డు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. ఈ నగదు సంస్థను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- డి.వెంకటరమణ, పొందూరు ఖాదీ బోర్డు కార్యదర్శి

సంగీత ప్రపంచానికి గర్వకారణం
103 సంవత్సరాల చరిత్ర కలిగిన మహారాజా ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలకు వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎంతోమంది మహానుభావులు ఈ కళాశాల నుంచి వచ్చి కళాశాల ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఇటువంటి అవార్డు కళాశాలకు రావడం యావత్‌ సంగీత ప్రపంచమంతా గర్వించదగినది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రిన్సిపల్‌ హోదాలో నేను అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. భావితరాలకు ఇది ప్రోత్సాహకరంగా ఉండి, మరింతమంది కళాకారులను తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది.
- ఆర్‌వి ప్రసన్నకుమారి

మహానేత జ్ఞాపకం
పాతికముఫ్పై ఏళ్లుగా ప్రజాగాయకుడిగా, ప్రజాకళాకారుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాను. గత ప్రభుత్వ హయాంలో 275 కేసులు నాపై ఉన్నాయి. ఈరోజు జగన్న నన్ను గుర్తుపెట్టుకుని ఈ పేదకళాకారునికి వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వడం గొప్ప విషయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరెడ్డి నన్ను హైదరాబాద్‌ రవీంద్రభారతికి పిలిచి ఆ రోజుల్లోనే రూ.లక్ష ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ మహానేత చనిపోయినపుడు నేను రాసిన పాట ఎప్పుడు పాడినా కన్నీళ్లు వస్తాయి. ఈరోజు ఆ రుషి పేరుమీద ఆయన తనయుడు నాకు వీధి నాటకం విభాగంలో అవార్డు ఇచ్చినందుకు శతకోటి నమస్కారాలు.
– మజ్జి శ్రీనివాసరావు (దేవీశ్రీ)

30 ఏళ్ల కళ..
ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ విభాగంలో కాలిగ్రాఫీకి వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అభించింది. ఈ కళ అత్యంత అద్భుతమైన, అరుదైన కళ. దీన్ని నేర్చుకోవాలంటే 20 నుంచి 30 ఏళ్లు శ్రమించాలి. కానీ నేర్చుకుంటే ఆ కళాకారునికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దానికి ఇదే నిదర్శనం. ఈ రోజు నా శ్రమను, కళను గుర్తించి అవార్డు అందించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– పరమేశ్వరరాజు.

బొబ్బిలి వీణకు సన్మానం
తరతరాలుగా దాదాపు రెండొందల శతాబ్దాలుగా విజయనగరంలో బొబ్బిలి వీణ తయారు చేస్తున్నాం. నేను మూడోతరం. ప్రస్తుతం మాలో ఐదోతరం వారు కూడా వీణల తయారీలో ఉన్నారు. యాభై ఏళ్లుగా బొబ్బిలి వీణను తయారు చేస్తూ మరికొంత మందికి నేర్పిస్తున్నాను. ఎనిమిది రకాల మెమెంటో వీణలు తయారు చేయడం ఇప్పుడు ప్రధానంగా మారింది. మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా భావించే బొబ్బిలి వీణకు వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. 
– సర్వసిద్ధి అచ్యుతనారాయణ

మాకో గుర్తింపు..
నా పేరు సురభి వేణుగోపాల్‌. మాది శ్రీవినాయక నాట్యమండలి సురభి థియేటర్‌. సురభి అనేది 1880లో వైఎస్సార్‌ కడప జిల్లాలో ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటివరకు నాటకరంగాన్ని వృత్తిగా భావిస్తూ సేవ చేసుకుంటున్నాం. ఇది ఏకైక కుటుంబసంస్థ. ఇటువంటి సంస్థను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా గర్వకారణంగా ఉంది. ఈ రోజు కళాకారుడిగా ప్రత్యేకించి గుర్తించి ఇక్కడ పిలవడం జరిగింది. 2019లో ఆంధ్రా అవతరణ సందర్భంగా ప్రదర్శించిన మాయాబజార్‌ నాటకాన్ని గవర్నర్‌, ముఖ్యమంత్రి వీక్షించండం సంతోషంగా ఉంది. ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కళాదృష్టికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఒక కళాకారుడిగా ఆనందం, అభిమానం, కృతజ్ఞతలు ఒకేసారి తెలియచేస్తున్నాను. వైఎస్సార్‌ హయాంలో ఆరి మారాఠీలను బీసీలుగా గుర్తించారు. ఒకరు కులం ఇచ్చారు. ఒకరు అవార్డు ఇచ్చారు.
- సురభి నాట్యమండలి

50 ఏళ్ల సేవకు..
బుర్రకథ కళారంగంలో 50 సంవత్సరాలుగా సేవచేస్తున్నా. ప్రభుత్వం వృత్తిని గౌరవించి గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. జగన్‌మోహన్‌రెడ్డికి ఎటువంటి కష్టాలు లేకుండా కలకాలం జీవించాలంటూ అప్పటికప్పుడు పద్యాన్ని పాడి వినిపించారు.
- మిరియాల అప్పారావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement