‘అనంత’ వాసులకు అరుదైన గౌరవం | YSR Lifetime Achievement Awards were Announced by four Anantapur residents | Sakshi
Sakshi News home page

‘అనంత’ వాసులకు అరుదైన గౌరవం

Published Thu, Jul 8 2021 10:58 AM | Last Updated on Thu, Jul 8 2021 1:23 PM

YSR Lifetime Achievement Awards were Announced by four Anantapur residents - Sakshi

సాక్షి,అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ఈ సారి అనంత వాసులు నలుగురితో పాటు రెండు సంస్థలకు దక్కాయి.  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (వైఎస్సార్‌ జిల్లా తరఫున), పాత్రికేయ రంగంలో కదలిక సంపాదకులు ఇమామ్, కళాకారుల విభాగంలో దళవాయి చలపతి, స్వచ్ఛంద సంస్థల విభాగంలో ఆర్డీటీ, సత్యసాయి ట్రస్ట్‌కు లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు దక్కగా, ఉద్యానంలో తాడిపత్రికి చెందిన ఎంసీ రామకృష్ణారెడ్డి, వైద్య రంగంలో స్టాఫ్‌ నర్సు జ్యోతి మేరీ ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ప్రభుత్వం నగదు ప్రోత్సాహకంతో పాటు వైఎస్సార్‌ కాంస్య విగ్రహంతో సత్కరించనుంది. 
 

సేవే పరమావధిగా...
పుట్టపర్తి అర్బన్‌: సేవే పరమావధిగా భావించే సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌కు ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. 1972 సెప్టెంబర్‌ 2న ఈ ట్రస్ట్‌ను సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాబా ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పేదప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువ చేసేందుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, జనరల్‌ ఆస్పత్రులు, మొబైల్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 153 దేశాల్లో సత్యసాయి భక్తులు సేవా ఆర్గనైజేషన్స్‌ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానాలు, ఇళ్ల నిర్మాణాలు, ఎల్‌కేజీ నుంచి ఉన్నత విద్య వరకూ ఉచిత విద్యాబోధనను అందజేసేలా పాఠశాలలు, కళాశాలలు, డీమ్డ్‌ యూనివర్సిటీని నెలకొల్పారు.

కోవిడ్‌ –19 విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.5 కోట్ల చొప్పున విరాళాన్ని అందజేశారు. మరో రూ.5 కోట్ల వ్యయంతో మందులు కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. స్థానికంగా కోవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసి, వేలాది మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితులను తరలించేందుకు ఉచితంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సత్యసాయి తాగునీటి పథకంలో భాగంగా 700కు పైగా గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు.    

విలక్షణత స్వామి సొంతం 
‘స్వామి’ అంటూ అందరూ గౌరవంగా పిలుచుకునే ‘అనంత’ కథకుడు బండి నారాయణస్వామి జీవితం చాలా విలక్షణమైనది. తొలుత కవిత్వంలో ఈదులాడిన స్వామి తదనంతర కాలంలో బాలసాహిత్యంలోకి వచ్చారు. నవలలు రాశారు. ఏకకాలంలో కరువు కథలు రాశారు. మధ్యతరగతి ద్వందాల్ని విమర్శిస్తూ రచనలు చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన 1987లో పరుగు కథతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘గద్దలాడుతాండాయి, మీ రాజ్యం మీరేలండి, నిసర్గమ్, రెండు కలల దేశమ్‌’ నవలలు రచించారు. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్‌ కథా కోకిల, కొలకలూరి ఇనాక్, ఎన్టీఆర్‌ పురస్కారాలను అందుకున్నారు.  

సాహిత్యానికి ‘రాచ’బాట  
కవిగా, విమర్శకునిగా, వ్యాసకర్తగా కరువు సీమ సమష్టి జీవన చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన రాచపాలెం చంద్రశేఖరరెడ్డిది సాహితీ రంగానికి పరిచయం అక్కరలేని సుప్రసిద్ధమైన పేరు. స్వతహాగా చిత్తూరు జిల్లాకు చెందిన వారైనా.. వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డును వైఎస్సార్‌ జిల్లా తరఫున అందుకుంటున్నారు. నాలుగు దశాబ్ధాలుగా ఆయన అనంతను తన సాహితీ క్షేత్రంగా మార్చుకుని సాహిత్య యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ‘శిల్ప ప్రభావతి (పరిశోధనా గ్రంథం), మన నవలలు–మన కథానికలు (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గ్రంథం), కొన్ని కావ్యాలు – కొందరు కవులు, ప్రతిఫలనం (విమర్శనాత్మక గ్రంథం)’ తదితర పుస్తకాలను రచించారు. 2012లో గురుజాడ పురస్కారం, 2016లో  తెలుగు భాషా పురస్కారం, 2017లో గుర్రం జాషువా అవార్డును అందుకున్నారు.  

పాత్రికేయ రంగంలో ‘కదలిక’ 
ఇమామ్‌... ‘కదలిక’ పత్రిక ద్వారా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా అక్షరీకరణ చేశారు. సీమ వేదికగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరువు పరిస్థితులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు ప్రజా నాయకుడు తరిమెల నాగిరెడ్డితో కలిసి పనిచేస్తూ జనశక్తి పత్రికకు అనేక వ్యాసాలు రాశారు. 1983లో కదలిక పత్రికను ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డికి సన్నిహితునిగా ఉంటూ అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. అనేక సందర్భాలలో గౌరవ సత్కారాలందుకున్న ఇమామ్‌కు పాత్రికేయ రంగంలో వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారం దక్కడంపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

దళవాయికి మరో పురస్కారం 
 ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారుడు దళవాయి చలపతికి వైఎస్సార్‌ లైప్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. వారసత్వంగా వచ్చిన తోలుబొమ్మలాటను తొలుత గ్రామాలలో ప్రదర్శించే ఆయన అనంతరం దేశ విదేశాలకు విస్తరించారు. ఎన్నో రాష్ట్ర జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

పరిఢవిల్లిన ఉద్యానం.. 
 ఉద్యాన తోటల్లో నాణ్యమైన దిగుబడులు సాధించినందుకు తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ఎంసీ రామకృష్ణారెడ్డికి వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1995లోనే ట్రెల్లీస్‌ పద్ధతిలో ఎఫ్‌1 హైబ్రీడ్‌ రకం టమాట సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఉద్యాన పంటలు విస్తరించారు. 10 ఎకరాల్లో సాత్‌గుడి రకం చీనీ, 10 ఎకరాల్లో టిష్యూకల్చర్‌ భగువ రకం దానిమ్మ, 5 ఎకరాల్లో సూపర్‌సొనాకా రకం ద్రాక్ష, మరో 5 ఎకరాల్లో అలగార్‌ రకం మునగ సాగు చేస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు చదువుకున్న అతను ఆధునిక సాగు పద్ధతులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ఉద్యాన దిగుబడులతో ఏటా రూ.కోటికి పైగా టర్నోవర్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఆర్డీటీ సిగలో మరో కలికితురాయి   
జిల్లాలో 1969 నుంచి సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)కి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో బడుగు, బలహీన, నిమ్నజాతులు, గిరిజనుల అభ్యున్నతికి సంస్థ ఫౌండర్‌  ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ ఎనలేని కృషి చేశారు. ఆయన స్ఫూర్తితో ఆ సేవా కార్యక్రమాలు నేటికీ కొనసాగుతున్నాయి. విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, ఉద్యానం, మహిళాభ్యున్నతి, గృహ నిర్మాణ రంగాల్లో విశేష కృషి చేస్తోంది. దివ్యాంగులు, అనాథల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామీణస్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దినందుకు రెండేళ్ల క్రితం ఆర్డీటీ సంస్థకు భారతీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌ను భారత ప్రభుత్వం అందించింది. తాజాగా సేవా రంగానికి సంబంధించి వైఎస్సార్‌ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ పురస్కారానికి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.  

వృత్తే దైవంలా.. 
 వృత్తినే దైవంగా భావిస్తూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న అనంతపురం సర్వజనాస్పత్రి స్టాఫ్‌ నర్సు కె.జ్యోతిమేరీకి కోవిడ్‌ వారియర్స్‌ విభాగంలో వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ప్రభుత్వం ఎంపిక చేసింది. 2006లో కర్నూలు జిల్లా పత్తికొండ పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్సుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆమె 2012 నుంచి అనంతపురం సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో కోవిడ్‌ బారిన పడి, 20 రోజుల తర్వాత కోలుకుని సూపర్‌ స్పెషాలిటీ కోవిడ్‌ ఆస్పత్రిలో 5 నెలల పాటు రోగులకు సేవలందించారు. ఈ ఏడాది సెకెండ్‌ వేవ్‌లోనూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కోవిడ్‌ ఓపీ, ఈఎన్‌టీ, ఐసోలేషన్, చెస్ట్‌ ఐసీయూ, తదితర కోవిడ్‌ వార్డుల్లో వరుసగా పని చేశారు.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement