YSR Rythu Bharosa Aid On 30th - Sakshi
Sakshi News home page

30న వైఎస్సార్‌ రైతుభరోసా సాయం

Published Fri, May 26 2023 3:42 AM | Last Updated on Fri, May 26 2023 1:02 PM

YSR Rythu Bharosa aid on 30th - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతుభరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత పెట్టుబడి సాయం, ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 30వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.

పెట్టుబడి సాయం కింద గతేడాది 51.41 లక్షలమంది రైతులు లబ్ధిపొందగా.. ఈ ఏడాది 52.31 లక్షలమంది లబ్ధిపొందనున్నారు. వీరికి తొలివిడతలో రూ.7,500 చొప్పున రూ.3,934.25 కోట్లను ముఖ్యమంత్రి జమచేయనున్నారు. పెట్టుబడిసాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందించనున్నారు. 

ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు
వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఇచ్చిన మాటకంటే మిన్నగా అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడువిడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్‌వోఎఫ్‌ఆర్‌) భూములు సాగుచేసేవారే కాకుండా సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు తొలివిడతగా మే నెలలో రూ.7,500, రెండోవిడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడోవిడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు.

ఇలా 2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాలకు జమచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందారు. వీరికి తొలివిడతగా రూ.3,934.25 కోట్ల సాయం అందించనున్నారు. గతేడాది 49,26,041 మంది భూ యజమానులు కాగా, 1,23,871 మంది కౌలురైతులు, 91,031 మంది అటవీ భూ సాగుదారులు లబ్ధిపొందారు.

ఈ ఏడాది తొలి విడత సాయం కోసం అర్హత పొందిన 52,30,939 మందిలో భూ యజమానులు 50,19,187 మంది, అటవీ భూ సాగుదారులు 91,752 మంది, భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులు 1.20 లక్షల మంది ఉన్నారు. ఈ నెలలో అందించనున్న సాయంతో కలిపి ఈ నాలుగేళ్లలో సగటున 52.30 లక్షల మందికి వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30,996.34 కోట్ల పెట్టుబడి సాయం ఇచ్చినట్లవుతుంది. 

48,032 మందికి  రూ.46.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు సీజన్‌ ముగియకముందే పంట నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తూ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అదేరీతిలో గతేడాది  డిసెంబర్‌లో మాండూస్‌ తుపాన్‌తో పంటలు దెబ్బతిన్న 91,237 మంది రైతులకు రూ.76.99 కోట్ల నష్టపరిహారాన్ని ఫిబ్రవరిలో అందజేసిన విషయం తెలిసిందే.

మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు 78,510 ఎకరాల్లో పంటలు  దెబ్బ­తిన్నాయి. వీటిలో 59,230 ఎకరాల్లో వ్యవసా­య పంటలు, 19,280 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ మేరకు పంటలు దెబ్బతిన్న 48,032 మంది రైతులకు రూ.46.39 కోట్ల పంట నష్టపరిహా­రాన్ని ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి జమచేయనున్నారు.

ఇప్పటికే ఈ నాలుగేళ్లలో  22.22 లక్షలమందికి రూ.1,911.79 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని జమచేశారు. తాజాగా జమ­చేయనున్న సాయంతో కలిసి 22.70 లక్షల మంది రైతులకు రూ.1,958.18 కోట్ల పంట నష్టపరిహారం  అందించినట్లవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement