సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
సాక్షి, నంద్యాల: బనగానపల్లె నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారు సాధించిన సామాజిక సాధికారతను చాటి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అండతో తాము సమాజంలో ఎదిగిన తీరును, తలెత్తుకొని తిరగగలుగుతున్న వైనాన్ని తెలుపుతూ బుధవారం భారీగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు అధిక సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు.
యాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిశాయి. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన బనగానపల్లె పట్టణంలో జరిగిన బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. జై జగన్.., మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు చేసిన నినాదాలతో సభాప్రాంగణం హోరెత్తింది.
అభివృద్ధి పథంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చేయి పట్టుకొని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యం అందిస్తూనే, అనేక పథకాలతో, కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్ని పదవుల్లో అధిక శాతం ఈ వర్గాలకే ఇస్తూ సీఎం జగన్ అందిస్తున్న చేయూత మరెవరికీ సాధ్యం కాదని తెలిపారు.
సీఎం జగన్ వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కిందని, ఈ వర్గాలే ప్రభుత్వానికి వెన్నెముక అని అన్నారు. మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా అడుగుతున్న సీఎం దేశంలో జగన్ మాత్రమేనన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏనాడూ మైనార్టీలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ శాఖను ఇతర వర్గాలకు కేటాయించిన ఘనుడు చంద్రబాబేనన్నారు.
చంద్రబాబు దళితులను అవమానించారు: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
దళిత, బలహీన వర్గాలను సీఎం జగన్ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి గౌరవించారన్నారు. అన్ని పథకాలు, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను, ఆస్పత్రులను సీఎం జగన్ కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలకు పైగా లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు.
చంద్రబాబు దళితులను తీవ్రంగా అవమానించారని, స్నానం చేయరని, శుభ్రంగా ఉండరని, వారికి రాజకీయాలెందుకంటూ టీడీపీ నేతలు నీచంగా మాట్లాడినా చంద్రబాబు ఖండించలేదని తెలిపారు. సొంత సామాజిక వర్గమే ఎప్పటికీ అధికారం చెలాయించాలనుకునే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనన్నారు. ధన, కుల, అవినీతి దాహమే బాబు అజెండా అని మండిపడ్డారు. వెన్నుపోట్లకు కేరాఫ్ అడ్రస్ బాబు అని చెప్పారు. అవినీతికి తలుపులు బార్లా తెరిచిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుంటే.. సీఎం వైఎస్ జగన్ ప్రజలను మాత్రమే నమ్ముకున్నారన్నారు.
దళితులకు పెద్దపీట వేసిన సీఎం జగన్: ఎంపీ డాక్టర్ గురుమూర్తి
రాజ్యాధికారంలో భాగస్వాములైనప్పుడే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని నమ్మి, ఆచరణలో పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు నామినేషన్ కింద ఇచ్చే పనుల్లోనూ దళితులకు పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో 34 వేల ఉద్యోగాలే ఇచ్చారని, ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు.
ఈ సమావేశంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment