కృష్ణా జిల్లా మచిలీపట్నం సాధికార సభకు తరలివచ్చిన అశేష జనవాహినిలో ఓ భాగం
చిలకలపూడి (మచిలీపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు మచిలీపట్నంలో కదంతొక్కాయి. బుధవారం ఇక్కడ జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ అండతో తాము సాధించిన విజయాన్ని వివరిస్తూ నియోజకవర్గంలో కలియతిరిగారు. జై జగన్ అంటూ వీరు చేసిన నినాదాలతో మచిలీపట్నం మారుమోగింది. స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో సాధికార యాత్ర ఘనంగా జరిగింది. అనంతరం జరిగిన సభలో ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు.
బస్సు యాత్రలో పాల్గొన్న నాయకులు
అట్టడుగు వర్గాల ఆశలు, ఆశయాలు నెరవేర్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన
సభలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలు ఆశలు, ఆశయాలను నెరవేర్చారని చెప్పారు. ఎలాంటి ఉద్యమాలు లేకుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం కట్టబెట్టారని, ఇలా చేయడానికి దమ్ము, ధైర్యం ఉండాలని అన్నారు. 32 లక్షల మందికి ఇళ్లస్థలాలు అందించటం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు విద్యను ప్రైవేటు పరం చేయటం వల్ల అట్టడుగు వర్గాలకు విద్య అందలేదన్నారు.
వైఎస్ జగన్ కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దటంతో పాటు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని, తల్లుల ఖాతాల్లో అమ్మఒడి ద్వారా నగదు జమ చేస్తున్నారని వివరించారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ లక్షల కోట్లు నేరుగా లబి్ధదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, జీవన ప్రమాణాలు, పరిశ్రమల కల్పనలో మన రాష్ట్రం దేశంలోనే 4, 5 స్థానాల్లో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతుండగా రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శించడం శోచనీయమన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన పాలన అందిస్తున్న సీఎం జగన్‌ను ఆదరించాలని కోరారు.
బడుగుల తలరాతలు మారుస్తున్న జగన్: ఎమ్మెల్యే అనిల్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కులవృత్తుల వారికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు, గొర్రెలు, వలలు ఇచ్చి వారు ఇలాగే బతకాలని చంద్రబాబు ప్రయత్నిస్తే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే బడుగులకు ప్రపంచస్థాయి విద్యనందిస్తూ వారి తలరాతలు మారుస్తున్నారని అన్నారు. మత్స్యకారుల వలసల నివారణకు, వారి ఉపాధికి సీఎం జగన్ తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారన్నారు.
2019లో గెలిపించినందుకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా పదడుగులు ముందుకు వేస్తే 2024లో గెలిపిస్తే 100 అడుగులు ముందుకు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఒకరు చదువుకుంటే నెలకు రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.90 వేలు అని లోకేశ్ చెప్పారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలా ఇస్తే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు దీనికే సరిపోతాయన్నారు.
జగన్‌ను మళ్లీ గెలిపించుకుందాం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
చంద్రబాబు ఒక్క ముస్లిం నాయకుడినీ మంత్రిగా చేయలేదని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదని, సీఎం జగన్ డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చి గౌరవించారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు సీఎం జగన్ కృషి చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా తలెత్తుకొనేలా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని బందరు ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment