తణుకులో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పడమటి ప్రాంతం పత్తికొండలో సామాజిక సాధికార నినాదం హోరెత్తింది. శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వెల్లువలా వచ్చాయి. తరతరాలుగా మారని తమ తల రాతను సీఎం జగన్ నాలుగేళ్లలో మార్చారన్న కృతజ్ఞత ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఉదయం 11 గంటలకు భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు ప్రజలు దారికి ఇరువైపులా మేడలు ఎక్కి అభివాదం చేశారు.
సీఎం జగన్ చేసిన మంచిని వివరిస్తూ కళాకారులు పాటలు పాడారు. యువత మోటర్ సైకిల్ ర్యాలీ చేశారు. జై జగన్.. జైజై జగన్ నినాదాలు మిన్నుముట్టాయి. కర్నూలు మేయర్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ చేసిన మేలును వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
సాధికారత ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమైంది
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినా సామాజిక సాధికారత కోసం ఏ పార్టీ, ఏ నేతా కృషి చేయలేదని, సాధికారత చేసి చూపించింది ఒక్క సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చేయిపట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఈ వర్గాలవారేనని తెలిపారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు అణగారిన వర్గాల వారేనని, ఇది గతంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. బీసీలను బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్పిన నాయకుడు జగన్ అని అన్నారు.
సభలో ఐక్యత చాటుతున్న ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు
అణగారినవర్గాలకు అందలం: మంత్రి ఆదిమూలపు సురేష్
సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్లలో అణగారిన వర్గాలను అందలమెక్కించారని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ‘బీసీలలో కొన్ని కులాలకు అధికారం ఎలా ఉంటుందో తెలీదు! సర్పంచ్, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. అలాంటి కులాల వారిని కూడా ఈ రోజు చట్టసభలకు పంపుతున్నారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఇలా ఎన్నో పదవులను అణగారిన వర్గాలకు ఇస్తున్నారు.
నిజమైన రాజకీయ సాధికారత ఏంటో చూపిస్తున్నారు’ అని చెప్పారు. సినిమాల్లో డైరెక్టర్ చెప్పిన రెండు ఇంగ్లిష్ మాటలు పలికే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలల్లోని బలహీన వర్గాల పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పత్తికొండలో ఎత్తిపోతల పథకం ద్వారా 77 చెరువులకు నీరందించారన్నారు. రెవెన్యూ, పోలీసు సబ్ డివిజన్లు ఏర్పాటు చేశారని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.
14 అసెంబ్లీ స్థానాలు గెలిపించి కానుకగా ఇవ్వాలి: మంత్రి జయరాం
‘టీడీపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు మర్రిచెట్లు లాంటివి. వాటి కింద తులసి మొక్కలు మెలవవు. జగన్ వచ్చిన తర్వాత మర్రిచెట్లు కొట్టుకుపోయి, తులసి మొక్కలు మొలుస్తున్నాయి. వాల్మీకులు, కురుబ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ.. ఇలా అన్ని వర్గాల వారు మంత్రులుగా ఉన్నారు’ అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు.
జగనే లేకపోతే ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మీసం మెలేసేవాళ్లమా అని అన్నారు. 2024 ఎన్నికల్లో అణగారిన వర్గాల ప్రజలందరూ సీఎం జగన్‌కి తోడుగా ఉండి, మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన తలరాత మార్చినందుకు ఆయనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు గెలిచి కానుకగా ఇవ్వాలని చెప్పారు.
దేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి యాత్ర చేపట్టలేదు: మంత్రి ఉషశ్రీ చరణ్
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సీఎం జగన్ మనందరినీ అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. అందుకే అందరమూ ఈరోజు ఎంతో ధీమాగా సాధికార యాత్ర నిర్వహిస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి యాత్ర చేపట్టలేదని అన్నారు.
ఒక వల, కత్తెర, ఐరన్ బాక్స్ ఇచ్చి బీసీలకు న్యాయం చేశాననే భ్రమలో చంద్రబాబు ఉన్నారన్నారు. సీఎం జగన్ మాత్రం 139 కులాలకు వెతికి వెతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి కులగణన చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment