‘రెడ్‌బుక్‌’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలన: వైఎస్‌ జగన్‌ | YSRCP chief YS Jagan complaint to Governor Justice Abdul nazeer | Sakshi
Sakshi News home page

‘రెడ్‌బుక్‌’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలన: వైఎస్‌ జగన్‌

Published Mon, Jul 22 2024 2:09 AM | Last Updated on Mon, Jul 22 2024 2:09 AM

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

అదే రాజ్యాంగం అనే రీతిలో రాష్ట్రంలో పాలన

అథఃపాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు 

హోర్డింగులు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి

ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణలేని దుస్థితి

నెల రోజుల్లోనే 36 హత్యలు.. 300కుపైగా హత్యాయత్నాలు

యథేచ్ఛగా దాడులు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం

వైఎస్సార్‌సీపీని అణచివేసే కుట్రతోనే బీభత్సకాండ

రాజ్యాంగ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యం

కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో నెలన్నర రోజులుగా డిఫ్యాక్టో రాజ్యాంగం.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. కూటమి ప్రభుత్వ అండదండలతో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ యథేచ్ఛగా కొనసాగుతోంది. రాజకీయ గూండాలు, మహిళలు–చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది. తమకు ఓటు వేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు ఊరూరా ఇష్టారాజ్యంగా కక్ష సాధింపు చర్యలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. వేలాది కుటుంబాలు ఊళ్లొదిలాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు మొదలు సామాన్యుల వరకు రక్షణ లేకుండా పోయింది. కళ్లెదుటే ఫొటో, వీడియో ఆధారాలున్నా పోలీసు యంత్రాంగం అరాచకాన్ని నిలువరించే సాహసం చేయలేకపోతోంది.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం అరాచకాలు, ఆటవిక పాలన, హింసాకాండపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను కోరారు. ‘రాష్ట్రంలో రాజ్యాంగం, శాంతి–భద్రతలు, పోలీసు వ్యవస్థ మొత్తం నిస్తేజంగా మారిపోయాయి. 45 రోజులుగా రాష్ట్రంలో డిఫ్యాక్టో రాజ్యాంగం.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదు. 

రాజకీయ గూండాలు, మహిళలు–చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది’ అని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. దాదాపు 45 నిముషాలపాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అండదండలతో సాగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసకాండ గురించి గవర్నర్‌కు వివరించారు. ‘వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేకుండాపోయింది. 

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి రాష్ట్రంలో 36 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలకు పాల్పడగా, వేధింపులు తట్టుకోలేక 35 మంది అత్మహత్యలు చేసుకున్నారు. 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దాడులతో భయకంపితులై 2,700 కుటుంబాలు తమ గ్రామాలను విడిచి పోయాయి. వాటితోపాటు 1,050 దాడులకు పాల్పడ్డారు. 

రాష్ట్రంలో ప్రస్తుత పాలకులు శాంతి–భద్రతలను ఏమాత్రం పరిరక్షించలేరని ఈ దురాగతాలు వెల్లడిస్తున్నాయి’ అని గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ గూండాలు పాల్పడిన హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సహా పూర్తి ఆధారాలను గవర్నర్‌కు సమరి్పంచారు.  గవర్నర్‌కు సమరి్పంచిన వినతిపత్రంలో విషయాలు ఇలా ఉన్నాయి.   

అదఃపాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు 
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రాజ్యాంగ వ్యవస్థలు విఫలమయ్యాయి. అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. సామాన్యుల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దారుణంగా దాడులకు పాల్పడుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో తమ పార్టీలకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. 

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వారిని అవమానిస్తూ.. దాడులకు పాల్పడుతుండటమే కాకుండా హతమారుస్తున్నారు. వారి ఆస్తులు, వ్యాపారాలను ధ్వంసం చేస్తూ, ఇళ్లను నేలమట్టం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ భవనాలతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. వాటిని గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే ఒకే ఒక్క విద్వేషంతోనే ఇలా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూడా నేలమట్టం చేస్తున్నారు.  

ఎంపీల నుంచి సామాన్యుల వరకూ రక్షణ కరువు 
టీడీపీ నేతలు, కార్యకర్తల దాడులకు పరాకాష్టగా వినుకొండలో వైఎస్సార్‌సీపీ క్రియాశీల కార్యకర్త రషీద్‌ను ఈ నెల 17న కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు సమీపంలోనే ఉన్నాసరే నడి వీధిలో దాడి చేసి మరీ పాశవికంగా హత్య చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఇటీవల ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఈ నెల 18న చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్పను కలిసేందుకు వెళ్లిన లోక్‌సభ వైఎస్సార్‌సీపీ పక్ష నేత, ఎంపీ మిథున్‌ రెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేసి హత్య చేసేందుకు యత్నించాయి. 

పోలీసుల సమక్షంలోనే ఈ దాడికి పాల్పడటం రాష్ట్రంలో సామాన్యులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల ఉదాసీనతకు ఈ దాడి అద్దం పడుతోంది. పోలీసుల ఈ నిర్లక్ష్య వైఖరితో అమానవీయంగా దాడులు చేసేందుకు తమకు అనుమతి లభించిందన్న రీతిలో టీడీపీ గూండాలు చెలరేగిపోయి యథేచ్ఛగా విధ్వంసకాండ సృష్టిస్తున్నారు.  

రెడ్‌ బుక్‌.. రాజ్యాంగ అరాచకం 
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఏమాత్రం వ్యవహరించడం లేదు. రాజ్యాంగం, శాంతి–భద్రతలు, పోలీసు వ్యవస్థ మొత్తం అచేతనంగా మారిపోయాయి. 45 రోజులుగా రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలవుతోంది. రాజకీయ గుండాలు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారి చెప్పుచేతల్లోకి ప్రభుత్వ వ్యవస్థ వెళ్లిపోయింది. 

గత ఐదేళ్లపాటు రాష్ట్రం అత్యుత్తమ విద్య, వైద్య–ఆరోగ్య విధానాలు, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, పటిష్టమైన శాంతి–భద్రతలు, సమీకృత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. కానీ ప్రస్తుతం హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్ష సాధింపులు, విధ్వంసానికి మారుపేరుగా దిగజారిపోయింది. రాష్ట్రంలో అంతటా అరాచకమే రాజ్యమేలుతోంది. ప్రస్తుత పాలకులు శాంతి–భద్రతలను ఏమాత్రం పరిరక్షించలేరని ఈ దురాగతాలు వెల్లడిస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీని అణచివేసే కుట్ర 
వైఎస్సార్‌సీపీని అణచి వేయాలని, తమ పార్టీతో అనుబంధం ఉన్న వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఏకైక కుట్రతోనే ఈ దాడులు, విధ్వంసానికి పాల్పడుతున్నారు. అందుకోసం అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో అధికారుల వరకు ఈ మేరకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఓ రాష్ట్ర మంత్రి రెడ్‌బుక్‌ పేరుతో ఏకంగా హోర్డింగులు ఏర్పాటు చేసి మరీ దాడులు చేయమని తమ నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. ఈ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసు అధికారులకు కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 

దాంతోనే టీడీపీ గుండాలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని హత్యలు, దాడులు, దురాగతాలకు పాల్పడేందుకు దురి్వనియోగం చేస్తున్నారు. 27 మంది ఐఏఎస్‌ అధికారులు, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వివక్ష, కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. 

మొత్తం మీద రాష్ట్రంలో శాంతి–భద్రతలు అదఃపాతాళానికి దిగజారిపోయాయి. రాష్ట్రంగానీ ప్రజలుగానీ ఈ దుస్థితిని ఇక ఏమాత్రం భరించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాకాండపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement