సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు మూడేళ్ల పాలన సందర్భంగా బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రధానంగా గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో 95 శాతం అమలుచేసి చూపించింది. అంతేకాక.. ప్రభుత్వ పథకాలను కులం, ప్రాంతం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో అమలుచేసింది.
సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేసి వారికి ఆయా పథకాలను అందించింది. అలాగే, మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలుచేసింది. ఈ నేపథ్యంలో.. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గడప గడపకు పంపించి ప్రజల నుంచి సలహాలను, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే బుధవారం నుంచి నియోజకవర్గాల్లోని అన్ని ఇళ్ల సందర్శనను ఎమ్మెల్యేలు పూర్తిచేసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం
ఇక గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా జవాబుదారీతనంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పథకాలను చేరవేస్తుండడంతో ప్రజల్లో ప్రభుత్వంపట్ల మరింత విశ్వాసం పెరిగింది. ఇక ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల వార్షిక క్యాలెండర్ ప్రకారం.. లబ్ధిదారులకు గత మూడేళ్లుగా నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. ఈ నేపథ్యంలో.. ఈ పథకాల అమలులో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తారు. చివరి లబ్ధిదారునికి కూడా పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని వారి నుంచే తెలుసుకుంటారు.
గడప గడపకు.. టీమ్‌లో ఎవరెవరు అంటే..
♦ఆయా నియోజకవర్గాల్లోని గ్రామ, వార్డు సచివాలయాలను మండల, మున్సిపాలిటీలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లాలి.
♦ఈ మహాయజ్ఞం పటిష్టంగా, పక్కాగా జరిగేలా ఆయా జిల్లాల కలెక్టర్లు షెడ్యూల్‌ను రూపొందించాలి.
♦గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఎమ్మెల్యేలకు
అందుబాటులో ఉంచాలి.
♦గడప గడపకు వెళ్లినప్పుడు లబ్ధిదారుల సంతృప్త స్థాయిని తెలుసుకుంటారు.
♦ నెలలో 10 గ్రామ, వార్డు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించేలా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment