సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకమని, అయినా దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్ ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మూడు లక్షల మంది ప్రజలు సాక్షిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ గళం వినిపించారు. ప్రధానికి లేఖ రాశారు.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. మా పార్టీ, మా ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉందని పేర్కొన్నారాయన.
కేంద్రం నడపలేని స్టీల్ ప్లాంట్‌ని ఓ రాష్ట్రం నిర్వహించగలదా? అని ప్రశ్నించారాయన. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. అసలు కొనడం అనే మాటే ఉత్పన్నం కాదు. బీజేపీ, బీఆర్ఎస్‌లు రాజకీయంలో భాగంగా వాళ్లు చేసేది చేస్తున్నారు. తెలంగాణ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మాత్రమే చెప్తోంది అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అనేది స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు వ్యతిరేకమా? అనుకూలమా? అనేది స్పష్టం చేయాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు.
ఒకవేళ వ్యతిరేకమైతే.. బీఆర్‌ఎస్ బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటోందన్నారాయన. ఏడాదిన్నర క్రితం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక మొమోరాండం ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం లేదు. అసలు బీఆర్‌ఎస్ స్టాండ్ ఏంటి? అధికారులు లేదంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలనేది మా స్టాండ్. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. సీఎం వైఎస్ జగన్ కూడా ప్రధాన మంత్రి మోదీకి ఇదే చెప్పారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు..ఇదే మా నినాదం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేతిలోని సంస్థ ఆధారంగా.. మా మీద(వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం) దుష్ప్రచారం చేయడం దారుణం. చంద్రబాబు 64 ప్రభుత్వ సంస్థలు అమ్మితే ఏం చేసింది అని ఈనాడు తీరును ఎండగట్టారాయన.
Comments
Please login to add a commentAdd a comment