Telangana MLC Election Results 2023: YSRCP Lead In Teachers MLC Election - Sakshi
Sakshi News home page

జై కొట్టిన టీచర్లు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా

Published Sat, Mar 18 2023 3:48 AM | Last Updated on Sat, Mar 18 2023 10:30 AM

YSRCP lead in Teachers MLC election - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, తిరుపతి/ చిత్తూరు కలెక్టరేట్‌/సాక్షి ప్రతినిధి, అనంతపురం :రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన వైఎస్సార్‌సీపీ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించింది. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో ఏపీటీఎఫ్‌ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు.

టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహరెడ్డి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1043 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్‌ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిపై ఘన విజయం సాధించారు.

ఉమ్మడి రాష్ట్రంలో.. విభజన తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 13న ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహించింది. ఓట్ల లెక్కింపును గురువారం ప్రారంభించింది.

పశ్చిమ రాయలసీమలో..
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి 25,272 ఓట్లు పోలయ్యాయి.  నిబంధనల మేరకు ఓట్లు వేయకపోవడంతో లెక్కింపు సమయంలో 3,867 ఓట్లు చెల్లకుండా పోయాయి. తర్వాత మిగతా ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి మంచి ఆధిక్యం చాటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి 8,846 ఓట్లు వచ్చాయి. ఏపీటీఎఫ్‌ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 6,853 ఓట్లు వచ్చాయి. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి 4,162 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి ఎవరూ 50 శాతం ఓట్లను సాధించకపోవడంతో.. తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను ఒక్కొక్కరిని తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. లెక్కింపు ముగిసే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు రాగా.. ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 10,618 ఓట్లు వచ్చాయి. అప్పటికీ 50 శాతం ఓట్లు సాధించక పోవడంతో ఎన్నికల సంఘం అనుమతితో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి 169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు రిటర్నింగ్‌ అధికారి కేతన్‌ గార్గ్‌ ప్రకటించారు.

తూర్పు రాయలసీమలో..
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ స్థానానికి నిర్వహించిన పోలింగ్‌లో 24,291 ఓట్లు పోలయ్యాయి. 2,356 ఓట్లు చెల్లలేదు. మిగతా ఓట్లలో మొదటి ప్రాధాన్యతలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 10,892 ఓట్లు సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్‌ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 8,908 ఓట్లు వచ్చాయి. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో తక్కువ ఓట్లు వచ్చిన ఆరుగురు అభ్యర్థులను వరుస క్రమంలో తొలగిస్తూ.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి 11,714 ఓట్లు, టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పీడీఎఫ్‌ అభ్యర్థి బాబురెడ్డికి 10,671 ఓట్లు వచ్చాయి.

దాంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి 1,043 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారని రిటర్నింగ్‌ అధికారి హరినారాయణన్‌ ప్రకటించారు. కాగా, చిత్తూరు, అనంతపురంలోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద తుది ఫలితం వెల్లడికాగానే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తపరిచారు. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు.   

ఈ విజయం టీచర్ల సమస్యల పరిష్కారానికి దోహదం 
తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందడంపై ఉద్యోగ సంఘాల సమాఖ్య చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.

ఏపీ జీఈఎఫ్, వైఎస్సార్‌సీపీ, పీఆర్టీయూ ఏపీ అపుస్మా, వైఎస్సార్టీఎఫ్‌ తదితర 36 సంఘాల మద్దతుతో పోటీ చేసిన తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ అధికార పార్టీ అభ్యర్థులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ఎం. వి.రామచంద్రారెడ్డి గెలుపు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సుల వల్లే సాధ్యమైందన్నారు.  భవిష్యత్తులో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ విజయం దోహద పడుతుందని చెప్పారు.

వారధిగా పనిచేస్తా
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతోనే గెలుపొందాను. ప్రభుత్వానికి, ప్రభుత్వ.. ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. విద్యా రంగం అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. – ఎంవీ రామచంద్రారెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

టీచర్ల పక్షాన ఉంటా 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విద్యా రంగ అభివృద్ధే నన్ను ఎమ్మెల్సీని చేసింది. ప్ర­భు­త్వ, ప్రైవేట్‌ టీచర్ల సమస్యలను ఎ­ప్ప­టికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో విద్యాభివృద్ధి జరుగుతోంది.   – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తూర్పు రాయలసీమ  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement