
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఎడవల్లి సుబ్బారావు (62) మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ నెల 7న విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు హాజరైన సుబ్బారావు అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పార్టీ శ్రేణులు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి అత్యుత్తమ వైద్యం అందించారు.
మరోవైపు.. సుబ్బారావు మృతి సమాచారం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి, మంత్రి కొట్టు సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పార్టీ తరఫున రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మృతుడి గ్రామానికి వెళ్లి స్వయంగా అందజేయనున్నట్లు కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
బీసీల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. అంతకుముందు.. తొక్కిసలాట విషయం తెలిసి విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు, ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును కలిసి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
చదవండి: (ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారింది: వైవీ సుబ్బారెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment