సాక్షి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన స్ఫూర్తితో గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా రాష్ట్రం పయనిస్తోంది. మహాత్ముడు కన్న కలలు సాకారమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు పేదల ఇంటిముంగిటికి చేరుతున్నాయి. గ్రామసచివాలయ వ్యవస్థపై ఇతర రాష్ట్రాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. ఉపాధితో పేదలకు సేవలచేసే భాగ్యం కల్పించిన సీఎం జగన్‌కు వాలంటీర్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని చేధిస్తామంటూ వలంటీర్లు ప్రతినబూనారు. గాంధీజీ చిత్రపటానికి, దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. (గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్)
గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్వర్యంలో విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో 30 అడుగుల సీఎం కటౌట్ ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయంతో సీఎం కటౌట్‌కి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో పదిహేను వేలకు పైగా సచివాలయాలను ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగు లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఉపాధి పొంది పేదలకు సేవచేస్తున్నారు. సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలనకు అడుగులు పడ్డాయి. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పేదల ముంగిటికి పథకాలు అందుతున్నాయి. సీఎం ఆలోచనలకు అనుగుణంగా వలంటీర్లు సైనికుల్లా పనిచేయాలి. సీఎం వైఎస్ జగన్ స్పూర్తితో రాష్ట్రం గ్రామస్వరాజ్యం వైపు పయనిస్తోంది. గాంధీజీ కలలు సాకారం చేస్తున్న ఏపీ వైపు అన్నిరాష్ట్రాలు చూస్తున్నాయి' అని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా పేర్కొన్నారు. (ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్)
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్దాది విష్ణు మాట్లాడుతూ.. ‘లక్షల్లో ఉద్యోగాలు కల్పించి.. కోట్లలో సేవలు అందించాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. దళారీ వ్యవస్థని సమూలంగా నిర్మూలించేందుకే సచివాలయ వ్యవస్థ. పేదల చెంతకే ఫలాలు అందించేందుకు ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది. బాపూజీ కలలు సాకారం చేసే దిశగా గ్రామస్వరాజ్య స్థాపన జరుగుతోంది' అని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్, పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment