జయహో బీసీ మహాసభ కార్యక్రమ వివరాలను మీడియాకు తెలుపుతున్న విజయసాయిరెడ్డి. చిత్రంలో కృష్ణమూర్తి, కారుమూరి నాగేశ్వరరావు, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, వేణుగోపాలకృష్ణ తదితరులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునేందుకే ‘వెనుకబడిన కులాలే వెన్నెముక’ అనే నినాదంతో ‘జయహో బీసీ మహాసభ’ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెల ఏడో తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి సోమవారం పరిశీలించారు.
అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘జయహో బీసీ’ నినాదం చంద్రబాబు సొత్తుకాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. జనాభాలో 50 శాతం ఉన్న ఆ వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్లలో 50 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చి రాజకీయంగా, సంక్షేమం కింద రూ.1.37 లక్షల కోట్లను మంజూరు చేసి ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ ఆవకాశాలు కల్పించి సామాజికంగా తలెత్తుకు తిరిగేలా చేసిందన్నారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కంటే ఏపీలో బీసీలు ఎక్కువ అభివృద్ధి సాధించడం సీఎం వైఎస్ జగన్ ఘనతగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు.
రాష్ట్రవ్యాప్తంగా సభల నిర్వహణ
ఇక సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. సభ అనంతరం జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
అలాగే, రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహాసభలను కూడా నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ టీకే రాణా, డీసీపీలు విశాల్ గున్ని, శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌కు ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా భోజనశాల, వాహనాల పార్కింగ్, స్టేజ్, ప్రజలు వచ్చి వెళ్లే మార్గాలను ఎంపీ పరిశీలించారు.
82 వేల మందికి ఆహ్వాన పత్రాలు
ఇక వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచ్‌లు, పీఏసీఎస్ అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలకు జయహో బీసీ మహాసభ ఆహ్వాన పత్రాలను పంపించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక సభకు వచ్చే వారికోసం 24 రకాల వంటకాలను సిద్ధంచేయిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.
చంద్రబాబు బీసీల ద్రోహి: బొత్స
బొత్స మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుని టీడీపీ రాజకీయ లబ్ధిపొందిందని మండిపడ్డారు. 14 ఏళ్ల తన పాలనలో చంద్రబాబు బీసీలను ఆణగదొక్కారన్నారు. ఆ కాలంలో బీసీ ఉపకులాలకు చెందిన వ్యక్తులకు మొక్కుబడిగా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అదే ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల మేరకు ఏడాదికి రూ.80 వేల కోట్లను బీసీల బ్యాంకు ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. టీడీపీలోని బీసీ నాయకులే చంద్రబాబును చూసి ‘ఇదేం ఖర్మరా బాబూ!’ అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
షెడ్యూల్ ఇదీ..
ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభను ప్రారంభిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు, నాయకులు ప్రసంగిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు సీఎం ప్రసంగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment