సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. 'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాం. అధికారంలోకి వచ్చాక కూడా అంతే నిర్మాణాత్మకంగా వ్యవహరించాము. సామాజిక న్యాయం దిశగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం. ప్లీనరీ విజయవంతం అవుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. శుక్రవారం 1.50 లక్షల మంది, రెండో రోజు 4 లక్షల మంది వస్తారని అంచనా.
బడుగు బలహీన వర్గాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. ప్లీనరీ ఘనవిజయం చూసిన తర్వాత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తాడు. వర్షం రాకుండా రెండు రోజులు మినహాయింపు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. స్పెషల్ అహ్వానితులు ఎవరూ లేరు.. మా గౌరవ అధ్యక్షురాలు, పార్టీ అధ్యక్షులు హాజరవుతారు. ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు సీఎం అవుతానని కలలు కంటున్నారు. ఆయన కలలు కళ్లలుగానే మిగిలిపోతాయి. పార్టీ కమిటీలకు సంబంధించి రేపటి రోజున అధ్యక్షులు ఒక నూతన విధానం ప్రకటిస్తారు. పార్టీని మరింత పటిష్టం చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతాం' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఆ అంశాలపైనే చర్చిస్తాం
'సంక్షేమాన్ని నిలుపుదల చేయాలని చంద్రబాబు వ్యవస్థలను అడ్డు పెట్టుకుంటున్నాడు. ఒక్క స్కూల్ కూడా మూతపడలేదు.. కానీ 8వేల స్కూళ్లు మూతపడ్డాయి అంటాడు. పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల వద్దకే ప్రభుత్వం అనేది ప్రూవ్ చేశారు. చంద్రబాబు ప్రతి ఇంటికీ ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి అన్నా మీ హామీ ఏమైంది. చంద్రబాబు హయాంలో డిస్టిలరీలకు అనుమతిచ్చారు. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. మా హయాంలో డీబీటీ ద్వారా రూ.1.40 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా వెళ్లాయి. చేసిన మంచి పనులే ప్లీనరీలో చెప్తాం. విద్య, వైద్యం, మహిళా సాధికారత వంటి అంశాలను చర్చిస్తాం. ప్లీనరీకి డ్వాక్రా మహిళలను తరలిస్తున్నట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు మాత్రమే ప్లీనరీకి హాజరవుతారు. వారికే మేము ఆహ్వానం పంపాం తప్ప డ్వాక్రా మహిళలకు కాదు' అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment