సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజే) ఢిల్లీ కమిటీ సభ్యులను న్యూఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించారు. అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ నేతృత్వంలో కమిటీ సభ్యులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి జర్నలిస్టులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన రైల్వే పాసుల వ్యవహారాన్ని జర్నలిస్టులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశంపై వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి ఆయన రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు సేవలందిస్తున్న జర్నలిస్టులకు అనేక సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైనందున కమిటీ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చమిచ్చి, శాలువా కప్పి సన్మానించారు.
కరోనా ఆపత్కాలంలోనూ తమకు అండగా నిలిచిన విజయసాయిరెడ్డికి అందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యుజే రాష్ట్ర సహాయ కార్యదర్శి అవ్వారి భాస్కర్, ఉపాధ్యక్షురాలు స్వరూప పొట్లపల్లి, కార్యదర్శులు రాజు, జబ్బార్ నాయక్‍తో పాటు సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, ఆచార్య శరత్ చంద్ర, గోపీకృష్ణ, అశోక్‌రెడ్డి, నాగరాజు, ప్రభు, లింగారెడ్డి, కామరాజు, విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: 'పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి కాకూడదు'
Comments
Please login to add a commentAdd a comment