ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నివేదిక అందజేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏర్పాటైన నూతన జిల్లాలను వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్(ఓడీఓపీ) పథకంలో చేర్చాలని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఓడీఓపీలో సులభతర వాణిజ్యాన్ని పెంచాలని కోరింది. ఒక్కో జిల్లాలో ఒక్కో ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ స్థానికంగా లభ్యమయ్యే వాటికి విస్తృత ప్రచారం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ఓడీఓపీ పథకం లక్ష్యం. ఈ–కామర్స్ సంస్థలకు డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ట్రేడ్(డీపీఐ ఐటీ)లో నమోదును తప్పనిసరి చేయాలని స్థాయీ సంఘం సూచించింది. తేయాకు బోర్డును పునఃనిర్మాణం చేయాలని కోరింది. ఈ మేరకు వాణిజ్య శాఖ స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు మూడు నివేదికలను అందజేశారు. అనంతరం అందులో ముఖ్యాంశాలను మీడియాకు వివరించారు.
చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్‌సీ కీలక ఆదేశాలు..
సాధికారత బృందం ఏర్పాటు చేయాలి
ఓడీఓపీలో ప్రస్తుతం 733 జిల్లాలు మాత్రమే ఉన్నాయని, మిగతా జిల్లాలను కూడా పథకంలో చేర్చాలని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నూతనంగా ఏర్పాటైన 13 జిల్లాలను ఇందులో చేర్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసిందన్నారు. ఓడీఓపీకి సంబంధించి ఎగుమతులు, ఎంఎస్‌ఎంఈ, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలతో నివేదిక రూపొందించామని తెలిపారు. వ్యవసాయం, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఎంఎస్‌ఎంఈ రంగాల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులతో సాధికారత బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసిందన్నారు.
క్షేత్రస్థాయిలో కార్యాచరణ సమర్థంగా అమలు చేసే క్రమంలో సమన్వయం కోసం డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఈపీసీ)లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. దేశీయ ఉత్పత్తులకు లాటిన్ అమెరికా, ఆఫ్రికా తదితర చోట్ల మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా దక్కేలా చూడాలని కోరామన్నారు. వివిధ జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) నమూనాలు ప్రారంభించాలని సూచించామన్నారు.
ఆరోగ్యసేతు తరహాలో..
ఎంఎస్‌ఎంఈల్లో ఎక్కువగా అనధికార, అసంఘటిత రంగంలో పని చేస్తున్నందున ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు సరైన రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ ఉండడం లేదని కమిటీ గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలను ఒకే వేదికపైకి తెచ్చేలా ఆరోగ్యసేతు తరహాలో ఒకే మ్యాపింగ్ విధానం తేవాలని సూచించామన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్స్ (డీఈహెచ్) సమర్థంగా పని చేసేలా చేపట్టిన చర్యలను వివరించామన్నారు. ఓడీఓపీ ఉత్పత్తులతో పెద్దపెద్ద ఈ–కామర్స్ సంస్థలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను ప్రోత్సహించాలని కోరామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
నకిలీ టీ ఎగుమతులను అరికట్టాలి
షాంపైన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డార్జిలింగ్ టీ నకిలీ ఎగుమతులను అరికట్టాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. టీ పరిశ్రమకు రాయితీలు, పెండింగ్‌లు క్లియర్ చేయాలని సూచించామన్నారు. తేయాకు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పర్జా పట్టాలు ఇవ్వాలని కోరామన్నారు. కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని వర్తింపజేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించామన్నారు. కృషి సించాయ్ పథకాన్ని తేయాకు రంగానికి వర్తింపచేసి టీ బోర్డును పూర్తిగా పునఃనిర్మాణం లేదా తగిన సవరణలు చేయాలని సూచించామని తెలిపారు.
ఈ–కామర్స్‌లో గుత్తాధిపత్యం లేకుండా
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)లో ఈ–కామర్స్ సంస్థల నమోదును తప్పనిసరి చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. పెద్దపెద్ద సంస్థల గుత్తాధిపత్యం లేకుండా అన్ని సంస్థలు ఒకే ప్లాట్‌ఫాంలోకి తేవాలని సిఫారసు చేశామన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినపుడే ఈ–కామర్స్ విజయవంతం అవుతుందని సూచించామన్నారు. ఈ–కామర్స్ పాలసీ తేవాలని కోరామన్నారు. రూ.40 లక్షల లోపు ఉన్న ఈ–కామర్స్ సంస్థలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరగా కేంద్ర కార్యదర్శి వీలు కాదని చెప్పారన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్) తరహాలో ఈ–కామర్స్ ఎక్స్‌పోర్ట్ జోన్స్ నెలకొల్పి ఎగుమతులను ప్రోత్సహించాలని సిఫార్సు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేషనల్ సైబర్ క్రైం పాలసీ తీసుకురావాలని, సైబర్ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని తెలిపారు.
కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే
కర్మ ఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు, రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించడంపై ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏ అభ్యర్థికి మద్దతు తెలపాలనేది వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాహుల్‌గాంధీని ఈడీ ప్రశ్నించడంలో కేంద్రానికి సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ‘కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యం చేసిన వారు పుణ్య ఫలం, పాపం చేసిన వారు పాప ఫలం ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలోనైనా అనుభవించక తప్పదు. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment